Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రానేవచ్చాయి. పౌర సమస్యలు చర్చనీయాంశమవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. విశ్వనగరం గురించి ప్రభుత్వం ఊరిస్తున్నది. కానీ వర్షాలు ఇది వరద నగరమని రుజువు చేసాయి. సమస్యలకు పరిష్కారం వెతకవల్సిన సమయం. కానీ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలకులే ప్రజల దృష్టి మరలించటం సహజం. కానీ ఇక్కడ బీజేపీ నాయకులే ఆ పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉగ్రవాది అంటున్నారు. తీవ్రవాది అనీ, దేశద్రోహి అనీ అంటున్నారు. హైదరాబాద్ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించవచ్చు. తమను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పవచ్చు. ఇందుకు భిన్నంగా దాడిచేస్తున్నారెందుకు? మరోవైపు బీజేపీలో కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. అగ్రనేతలే టికెట్లు అమ్ముకుంటున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మహానగరం విస్తరణతో పాటు సమస్యలూ పెరిగాయి. ఆకాశహర్మ్యాలొక వైపూ.. మురికివాడలు ఇంకోవైపు.. ఒకప్పటి కొత్తనగరం ఇప్పుడు పాతనగరం అయిపోయింది. వర్షాలకు ప్రజలు వణుకుతున్నారు. భాగ్యనగరం అభాగ్యనగరం అవుతున్నది. గోదావరి జిల్లాలను తలపిస్తున్నది. డబల్ బెడ్రూం ఇండ్ల దగ్గరి నుంచి ట్రాఫిక్ సమస్యల వరకు అన్నీ సమస్యలే. కాలుష్యం విజృంభిస్తున్నది. క్రిక్కిరిసిన జనావాసాలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నగరం అభివృద్ధికీ, సమస్యల పరిష్కారానికీ నిధులు ఒక పెద్ద సమస్య. పాలకుల నిర్లక్ష్యం మరో సమస్య. ఇవన్నీ ప్రజలు లోతుగా పరిశీలించాలి. పార్టీలను ప్రశ్నించాలి. కానీ.. ప్రశ్నించే వాతావరణాన్ని బీజేపీ నేతలు కలుషితం చేస్తున్నారు. వరద బాధితులకు సహాయం కూడా బురద రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆ కొద్దిపాటి సహాయమూ ఆగిపోయింది. ఎన్నికలు వస్తున్నాయని వరదలకు తెలియదు కదా! వాటి పని అవి చేసాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరద సహాయం ఆపేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసారని వార్తలు వెలువడ్డాయి. ఆ లేఖ తాను రాయలేదనీ, ఆ సంతకం తనది కాదనీ బీజేపీ నేత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అనర్హులకు డబ్బులు అందజేస్తున్నారని వాదిస్తున్నారు. అనర్హులకు పంచితే నిర్దిష్టంగా ఫిర్యాదులు చేయవచ్చు. అర్హులను సమీకరించి సహాయం కోసం పోరాడవచ్చు. కానీ అనర్హుల పేరుచెప్పి, ఎన్నికల సాకు చూపి, బాధితులకు సహాయం అందకుండా అడ్డుపడటం ఏమి న్యాయం? తమ ఓట్ల రాజకీయానికి వరద బాధితులను బలిపెట్టకూడదు కదా! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరుతో ఇచ్చిన లేఖ నిజంగానే ఫోర్జరీ అయితే... ఇప్పుడు ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వవచ్చు. వరద సహాయం అందజేయాలనీ, ఆపవద్దనీ కోరవచ్చు. చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. దీనిని మాత్రం దాటవేస్తున్నారు.
కుటుంబానికి పదివేలు వరద సహాయం ఏమాత్రం సరిపోదు. ఓట్ల కోసం పంచుతున్నట్టు ఉన్నది తప్ప ఆదుకునేందుకు తోడ్పడదు. కానీ రాష్ట్రం దివాళా తీసింది. కరోనాను కట్టడి చేయటంలో వైఫల్యానికీ ఇదొక కారణం కదా! వరద బాధితులను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికిలేదా? తమను గెలిపిస్తే రూ.25వేలు ఇస్తామంటున్నారు బీజేపీ నేతలు. ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు? జీహెచ్‌ఎంసీ బడ్జెట్ ఎంత? ఎవరు గెలిచినా నిధులు రాష్ట్ర ప్రభుత్వమన్నా ఇవ్వాలి.. లేదా కేంద్రమన్నా ఇవ్వాలి. కేంద్రం ఇప్పటికే మొండిచేయి చూపించింది. తమను గెలిపిస్తేనే ఇస్తామనటం బురద రాజకీయమే! వరదలు వచ్చిన తర్వాత నెల రోజులకు కేంద్ర బృందం పర్యటించింది. నష్టం మోతాదు ఎంతో అంచనాగట్టి ప్రకటించటం అనవాయితీ. ఆపని చేయకపోగా, ముఖ్యమంత్రినీ, ప్రతిపక్షాలనూ, సంస్థలనూ కలవకుండా ఢిల్లీకి జారుకున్నారు. అప్పుడే అనుమానాలు వ్యక్తమైనాయి. నామమాత్రపు సాయం ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకున్నది. బీజేపీ నేతలు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు టీఆర్‌ఎస్ పాలకుల వైఫల్యాలనూ చర్చకు రానివ్వటం లేదు.
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నారు. మతపరమైన విభజన సృష్టించి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేస్తారట! ముఖ్యమంత్రినీ అక్కడ ప్రమాణం చేయాలని సవాలు విసురుతున్నారు. ఇక్కడే విభజన రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రమాణం చేయడానికి భాగ్యలక్ష్మి ఆలయమే ఉన్నదా! జనం మరచిపోయిన గాయాలు కెలుకుతున్నారు. భయానకరమైన మతకొట్లాటలు చర్చకు తెచ్చే ప్రయత్నమే ఇది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పౌర సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం శాంతి భద్రతల సమస్యకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే కరోనా సమస్యలతో తల్లడిల్లుతున్న ప్రజల జీవితాలను ఓట్ల కోసం అశాంతిమయం చేసే ఎత్తుగడ ప్రమాదకరం.
ప్రతిదీ మతం చుట్టే తిప్పి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్ నేతలు ఎంఐఎంతో తెరవెనుక బంధం ఏర్పరుచుకున్నారని వీరి ఆరోపణ. అక్కడితో ఆగలేదు. హిందువుల ఓట్లు చీల్చడానికే అంటున్నారు. అక్కడ కూడా ఆగలేదు. పాతనగరంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ముస్లిం అభ్యర్థులను పోటీపెట్టి ముస్లింల ఓట్లు చీల్చాలంటున్నారు. ఎంతసేపటికీ ఓట్ల కోసం మతాన్ని వాడుకునే ప్రయత్నమే తప్ప సమస్యల గురించి మాట్లాడటం లేదు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్ బంధం పచ్చి అవకాశవాదం. అందులో సందేహం లేదు. మరోవైపు బీజేపీతో జనసేన జతకట్టింది. మరోసారి పవన్‌కళ్యాణ్ ప్యాకేజీ రాజకీయం ముందుకొచ్చింది. ఎంఐంఎంతో టీఆర్‌ఎస్ తెరవెనుక బంధమైనా, జనసేనతో బీజేపీ తెరముందు బంధమైనా.. ప్రజా ప్రయోజనాలు పణంగా పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడటమే! బీహార్ పరిణామాలు గుర్తుకు తెచ్చుకుంటే బీజేపీ బాధేమిటో అర్థమవుతుంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చటం కోసం అక్కడ ఎంఐఎంతో బీజేపీ తెరవెనుక బంధం నెరపిన విషయం తెలిసిందే. ఇక్కడ అదే పని టీఆర్‌ఎస్ చేయటంతో బీజేపీ కంగుతిన్నది.
మహానగర ఎన్నికలలో ఏ గడ్డి కరిచైనా గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకు దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించి, ప్రజల జీవితాలను బజారుపాలు చేసిన కాంగ్రెసు నేతలను పావులుగా వాడుకుంటున్నారు. పదవి చూపిస్తే ఎన్ని వంకర్లు తిరగడానికైనా కాంగ్రెసు నేతలు సిద్ధమే! నోట్ల కట్టలకు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇది జగమెరిగిన సత్యం. ఈ దిగజారుడు విలువలనే బీజేపీ పావులుగా కదుపుతున్నది. నేతల మీద 'ఆపరేషన్ ఆకర్ష్' ప్రయోగిస్తున్నది. ఫిరాయింపుల పర్వం ఊపందుకుంటున్నది. ఇంకోవైపు బీజేపీ కార్యకర్తలు తిరగబడుతున్నారు. పైగా ఇది కేవలం స్థానిక నాయకుల పంచాయితీ కాదు. కూకట్‌పల్లి కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన నేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. తొలిజాబితా విడుదల కాకముందే లీకైంది. ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మెన్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు, నాయకులు ధర్నా చేసారు. బీజేపీ క్యాంపు కార్యాలయం దగ్గర బీజేపీ నాయకుడొకరు పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేసారు. నాచారం నాయకురాలు నిద్రమాత్రలు మింగారు. ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మీద ఆరోపణలు చేసారు. బీజేపీ కార్యకర్తలు ఎక్కడ ఆందోళనలు చేసినా అగ్రనాయకులే టికెట్లు అమ్ముకుంటున్నారనీ, తమవారికే ఇచ్చుకుంటున్నారనీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీలో కుమ్ములాటలు కాంగ్రెసును తలపిస్తున్నాయి. కాంగ్రెసు సంస్కృతి ఇప్పుడు బీజేపీని ఆవహిస్తున్నది.
ఇలాంటి సమయంలో 'ఇక యుద్ధమే' అంటున్నారు టీఆర్‌ఎస్ అధ్యక్షులు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టవల్సిన బాధ్యత ఇతర పక్షాల మీద ఉందంటున్నారు. ఇప్పటికైనా ఇది గుర్తుకు రావడం మంచిదే. కానీ తమ ప్రభుత్వం కూడా బీజేపీ, కాంగ్రెసు ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే అమలు చేస్తున్న విషయం దాచితే దాగదు. కనీసం కేంద్రం నిరంకుశ పోకడల మీదనైనా పోరాటానికి టీఆర్‌ఎస్ సిద్ధం కావాలి. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, జీఎస్‌టీ నిధులు, కరోనా కట్టడికోసం కేంద్రం నిధుల కోసం కలసి కొట్లాడుదామన్న కేరళతో తెలంగాణ ప్రభుత్వం చేతులు కలపలేదు. పైగా కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో లాలూచీ కుస్తీ నెరపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించటం ద్వారా ఆయా సంస్థలను కేంద్రం... కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నదన్నారు కేసీఆర్. అది నిజం. ఉద్యోగులకు సంఘీభావంగా ఉంటామన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తామన్నారు. మంచిదే. కానీ అది మాటలకే పరిమితం కారాదు. ఎన్నికల మాటగానే మిగిలిపోవద్దు. ఈనెల 26న, ఇదే లక్ష్యంతో దేశవ్యాపితంగా కార్మికవర్గం సార్వత్రిక సమ్మె తలపెట్టింది. 26, 27 తేదీలలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ బంద్‌కు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్ నాయకత్వం ఈ ఉద్యమంతో భుజం కలపాలి. వామపక్షాలు ఇప్పటికే కార్మికులు, రైతులు తలపెట్టిన ఈ మహాసంగ్రామానికి అండగా నిలిచాయి. టీఆర్‌ఎస్ నేతలు కూడా తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వామపక్షాలు బాధ్యతాయుతంగా ముందుకొచ్చాయి. మహానగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి. సీపీఐ, సీపీఐ(ఎం)లు కలిసి నడుస్తున్నాయి. ప్రత్యామ్నాయ ప్రణాళికతో ప్రజల ముందుకొస్తున్నాయి. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో తమకు ఓటేయాలని కోరుతున్నాయి. ఇతర స్థానాలలో బీజేపీ, ఎంఐఎంలను ఓడించగల అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేసాయి. వామపక్షాలను బలోపేతం చేయటం భాగ్యనగరం అభివృద్ధికి అవసరం. ఎర్రజెండా ప్రతినిధి లేని తెలుగు రాష్ట్రాల శాసనసభలు ఎంత నిర్వీర్యమైనాయో చూస్తున్నాం. గత ఐదేండ్లలో జీహెచ్‌ఎంసీ ప్రజా ప్రతినిధులేం చేసారో, సమావేశాలలో ఏమి చర్చించారో కూడా ఎవరికీ తెలియదు. కార్పొరేషన్ నామమాత్రంగా మారింది. కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉన్న సభలు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చావేదికలవుతాయి. ఎర్రజెండా ప్రతినిధులుగా ఎన్నికైన వారు సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో కృషి చేస్తారన్న విషయం నిర్వివాదాంశం. అంతే కాదు, ప్రభుత్వంతో పోరాడి నిధులు సాధిస్తారన్న విషయమూ తెలిసిందే. కార్పొరేషన్‌లో ప్రజా సమస్యలు చర్చకు రావాలన్నా, నగరంలో ప్రజా ఉద్యమం బలపడాలన్నా.. ఈ ఎన్నికలలో వామపక్షాలను బలోపేతం చేయటం ఎంతైనా అవసరం.
- ఎస్. వీరయ్య