Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల రోజుల కిందట హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన వరదలని అప్పుడే జనం మరచిపోలేదు. మరచిపోయేంత చిన్నదేం కాదు ఆ వరదల ఉధృతి. నగర శివారు ప్రాంతాల్లో పేదలు, మధ్యతరగతివారేకాదు, ఒక మోస్తరు ధనికులు కూడా వరదల బారిన పడి వివిధరూపాల్లో నష్టపోయారు. నష్టపోయినవారికి పదివేల రూపాయల సహాయం అన్నది చిన్నదే. అది కూడా అందరికీ అందలేదు. అందనివారికి బ్యాంకు ఖాతాల్లో పదివేలు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తులు పెట్టుకోడానికి వందలు, వేలుగా మీ సేవ సెంటర్ల వద్ద జనాలు గుమిగూడిన దృశ్యాలు చూశాం. ఇది ఒకరకమైన 'ఓట్ల కోనుగోలు తంత్రం' అనే విమర్శ తలెత్తింది. ఆ మాట ఎలా వున్నా, వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు పరిహారం, సహాయం అందలేదనే సంగతి తేటతెల్లమైంది. ఇన్నాళ్ళుగా ఒక పద్ధతిగా సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదనే విషయమూ రూఢి అయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీకి లబ్ది చేకూర్చే ప్రక్రియగా విమర్శలు వచ్చాయి. దరిమిలా ఎన్నికల సంఘం ఆక్షేపణతో దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయంది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే డిసెంబర్ 1 తరువాత కూడా ఈ సహాయాన్ని అందించవచ్చు. నిజానికి జనాలు అడగకుండానే అధికార యంత్రాంగం కదలి ఆ సహాయం అందించాలి కదా. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోడం విపత్తులు తలెత్తినప్పుడు నిర్వర్తించాల్సిన కర్తవ్యం. అది ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాలతో ముడిపడిన అంశం కాదు. ప్రత్యేకంగా వేరెవరో గుర్తు చేయనక్కరలేని పాలకుల బాధ్యత. ఒకవైపున ఎన్నికలకు ఉపక్రమిస్తూ, మరోవైపున సహాయం చేసి తీరుతామని చెబితే శంకించకుండా ఉంటారా ఎవరయినా...?
ఆరేండ్ల పాలనలో...
వర్షాలు, వరదలు ప్రకృతి విపత్తులే. పాలకుల వైఫల్యం వాటికి తోడయితే నష్టతీవ్రత, విధ్వంసం భారీగా ఉంటాయి. దాదాపు నెలకిందట నగరాన్ని ముంచెత్తిన వరదల ఉదంతమే దీనికి తార్కాణం. ఆరేండ్ల కిందట తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చాక కూడా మన నగరాన్ని మనం క్షేమంగా, సుభిక్షంగా, ప్రణాళికబద్ధమైన రీతిన ఎందుకు నడిపించలేకపోతున్నామన్నదే ప్రశ్న. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ జనవాసానికి, పురోగతికి సానుకూలమైందన్న మాట నిస్సందేహం. 420 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం నిత్యమూ, నిరంతరమూ జనాల సందడితో వర్థిల్లుతున్నది. ఏటా దాదాపు అరు లక్షల మంది నగరానికి వలస వస్తున్నారన్నది ఒక అంచనా. మరి పెరిగే ఈ జనాభాకు అనుగుణంగా నగర ప్రణాళికలు సృజిస్తున్నామా? వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామా? అంతేగాక నగరం మీద ఒత్తిడి పెరగకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి, పురోగతికి అనువైన ప్రణాళికలు రచిస్తున్నామా? ఈ దిశగా పాలకుల విధానాలు, కార్యాచరణ ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సముచితమైన సమాధానాలు లభించవు. గత ఆరేండ్ల కాలంలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసామని అధికారంలో ఉన్న పార్టీ పదే పదే చెబుతున్నది. కానీ ఆ అభివృద్ధి వెలుగుల జాడలు ఎక్కడన్నదే సామాన్యుల ప్రశ్న.
ప్రయత్నాలున్నా... ఆచరణేది?
అధికారంలోకి వచ్చాక నగర పురోగతికి సంబంధించి అసలు ఆలోచనలు చేయలేదని అనలేం. కానీ విధానాల్లో, ప్రణాళికల్లో, వాటి అమలులో స్పష్టత, నిర్దిష్టత, పారదర్శకత సందేహాస్పదం. 11 ఆగస్టు 2017న నగరాభివృద్ధిపై ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ''హైదరాబాద్ నగరం శరవేగంగా పెరుగుతున్నది. పెరిగే జనాభాకు అనుగుణంగా అవసరాలు కూడా పెరుగుతాయి. వీటిని దష్టిలో ఉంచుకుని మనం ప్రణాళికలు వేయాలి. రాబోయే 30ఏండ్లకు ఈ నగరం ఎలా ఉంటుంది? జనాభా ఎంత పెరుతుంది? అప్పుడు ఏర్పడే అవసరాలు ఏమిటి? అనే కల్పన ఉండాలి. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ఎలా చేయాలి? అని ఆలోచించాలి. కనీసం పదేండ్ల కోసం కార్యాచరణ ప్రణాళిక వేయాలి. ఇప్పటి నుంచి చేసే ప్రతీ పని ఆ ప్రణాళికలో భాగం అయి ఉండాలి'' అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మాటలు చెప్పి మూడేండ్లు దాటాయి. అప్పుడు చెప్పిన మాటలకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించి, అమలు చేస్తే నగరాన్ని ఇంతగా వరదలు ముంచెత్తేవా? ఒకవేళ వరదలు వచ్చినప్పటికీ వాటిని సునాయసంగా ఎదుర్కొని భారీనష్టానికి లోనుకాకుండా బయట పడేవారమేమోనని అనిపించక మానదు.
నగరాభివృద్ధికి సంబంధించి పదేండ్ల కోసం కార్యాచరణ ప్రణాళిక, ముప్పయేండ్ల తరువాతి భవిష్యత్తును ఊహించి ప్రణాళికలు రూపొందించడమనే ఆలోచనలు విజ్ఞతని సూచిస్తాయి. ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి అనువైన ప్రయత్నాలు చేస్తేనే చెప్పిన మాటలకు విలువ, విశ్వసనీయత లభిస్తాయి. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామనే మాట వినడానికి అందంగా ఉంది. 'గ్లోబల్ సిటీ' అనే మాట చెవులకింపుగానూ ఉంది. అంతేకాదు, సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే 'హైదరాబాద్ విశ్వనగరం' అనే స్వప్న సాకారం సాధ్యమే. అయితే ఆ ప్రణాళికలు ఎలా ఉండాలి? ఏ లక్ష్యంతో రూపొందాలి? నగరాభివృద్ధికి, పురోగతికి మనం ఇచ్చుకునే నిర్వచనాలు ఏమిటి? నగర పురోగతి క్రమాన జనాలు హాయిగా, శాంతంగా జీవించడానికి ఏం చేయాలి? అనే అంశాలపై స్పష్టమైన ఆలోచన, దిశానిర్దేశం తప్పనిసరి.
అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ కాదు...
నగరాభివృద్ధి జనాల కోసమే గానీ బేహారుల కోసం కాదు. అభివృద్ధి సర్కారు వారి ఆదాయవనరుగా కాక జనాల జీవనసరళికి సంబంధించిన అంశంగా తలపోయాలి. అభివృద్ధి అంటే రియల్‌ఎస్టేట్ విశృంఖలత్వం కాదనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. నగర విస్తరణ, పురోగతి వెంచర్ల కోసం కాదు. ప్రజలు సౌకర్యవంతంగా, నింపాదిగా జీవించడం కోసమనే దృష్టికోణం తప్పనిసరి. మహానగరానికి అనుబంధంగా ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, సినిమా సిటీ అనే ప్రణాళికల గురించి వింటున్నాం. నగరం లోపల, వెలుపల అభివృద్ధికి సంబంధించిన విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఇందుకు అనువుగా నిర్మాణ రంగానికి అనుమతులు ఇవ్వడం, రియల్‌ఎస్టేట్ విస్తృతికి సంబంధించిన పరికల్పనలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మూడు దశాబ్దాల అనంతరం నగర జనాభా రెట్టింపు కానుందనేది అంచనా. ఇందుకు అనువుగా నగరాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన సబబే. హైదరాబాద్ నగర విస్తీర్ణానికి అవకాశం వుంది. అయితే విస్తరించే కొద్దీ పెరిగే కాలుష్య నివారణకు సంబంధించిన పక్కా ప్రణాళికల దాఖలాలు కనిపించడం లేదు. కేవలం పచ్చదనం ఒక్కటే కాలుష్యాన్ని నివారించదు. కాలుష్యానికి దారితీసే పరిశ్రమల్ని, పరిణామాలని నియంత్రించాలి. ఇందుకు సంబంధించిన ఆలోచనలపై ఇప్పటివరకయితే స్పష్టత లేదు. ఫార్మాసిటీ గురించి మాట్లాడుతూ, పరిశ్రమలకు అనుమతిస్తున్న నేపథ్యంలోనే కాలుష్యప్రమాదంపై ఆందోళనలు తలెత్తిన సంగతి తెలిసిందే. తమ ప్రాంతాలకు మందుల, రసాయనాల పరిశ్రమలు రావడానికి వీల్లేదనే శివారు ప్రాంతాల జనాందోళనలు గమనార్హం. అభివృద్ధికీ, పర్యావరణానికీ నడుమ సమతుల్యం తప్పనిసరి. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల పటాన్‌చెరు, జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాలు ఏవిధంగా ఉన్నాయో తెలంగాణ రాకముందు నుంచీ చూస్తున్నాం. విశ్వనగరం రూపొందే క్రమాన మరిన్ని ప్రాంతాలు కాలుష్యమయమైతే అది నగరానికి మచ్చే కదా!
చారిత్రక స్పృహ కీలకం
నాలుగు దశాబ్దాలకు పైబడిన చరిత్ర గల నగరం అభివృద్ధి క్రమాన తన ఆనవాళ్ళను కోల్పోవడం బాధాకరం. నగర ప్రణాళికలు రూపొందించే క్రమాన పర్యావరణం, చారిత్రక స్థలాల పరిరక్షణ అనే అంశాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ స్పృహతోపాటు చారిత్రక స్పృహ అవసరం. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ హౌదా పొందగలిగిన అనేక అర్హతలు ఉండి కూడా మన నగరం ఆ గుర్తింపుకు నోచుకోలేదు. మన దగ్గర చార్మినార్, గోల్కొండ కోటలకు ప్రపంచ వారసత్వ హౌదా పొందే అర్హతలున్నాయి. నిజానికి మొత్తం నగరానికే ఇంతటి ప్రాశస్త్యం ఉంది. కానీ అభివృద్ధి పేరిట చారిత్రక ఆనవాళ్ళని ధ్వంసం చేస్తూ సాగిపోవడం హైదరాబాద్ నగరాన్ని ప్రేమించే వారికి మింగుడు పడని అంశం. గోల్కొండ కోటలకు యునెస్కో వారి ప్రపంచ వారసత్వ హౌదా కోసం దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపున ఆ చారిత్రక ప్రాధాన్యాన్ని విచ్ఛిన్నం చేసే నిర్మాణాలు ఆ చుట్టుపక్కల ఇప్పటికీ జరుగుతున్నాయి.
అభివృద్ధి పేరిట పాతబస్తీకి మెట్రోరైలు అనే డిమాండ్ కూడా సరయింది కాదు. మొజాంజాహీ మార్కెట్, సుల్తాన్‌బజార్ లాంటి ప్రాంతాలు మెట్రోరైలు వల్ల బాగా దెబ్బతిన్నాయి. వాటి పురాతత్వ వైభవమూ క్షీణించింది. కనుక మెట్రోరైలు వంటి ప్రాజెక్టులు మాత్రమే కాదు, మరేవైనా నగర చారిత్రక వైభవం, పురాతత్వ సంపదకు విఘాతం కలగని రీతిలో రూపొందాలి. నగర అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దేవారికి ఈ అంశాన్ని స్పష్టం చేయడం ప్రభుత్వం బాధ్యత. ఇప్పటికే సచివాలయం కూల్చివేతలో భాగంగా అక్కడి పురాతత్వ వైభవానికి ప్రతీకగా నిలిచే ఒక భవనాన్ని కోల్పోయాం. ఆ భవనాన్ని కూల్చకుండా కూడా అక్కడ తాము ఆశించిన రీతిన కొత్త సచివాలయం నిర్మించుకోవచ్చు. కానీ ఆ ఆలోచన ఎవరికీ రాకపోవడం వింత కాదు, చారిత్రక స్పృహ లోపించిన ఫలితం. చారిత్రక స్థలాల పరిరక్షణ నగర ప్రతిష్టనీ, పర్యాటక రంగాన్నీ ఇనుమడింపజేస్తుందన్న అవగాహన అవసరం.
కేంద్రీకరణ తగ్గితేనే పురోగతి
నగరాలు సుభిక్షంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే ఒత్తిడి ఉండకూడదు. జనసాంద్రత ఇబ్బడిముబ్బడిగా పెరగకూడదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చదరపు కిలో మీటర్‌కు 18,172 మంది ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగడం నగరానికి శోభాయమానం కాదు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణ వచ్చాక గానీ హైదరాబాద్‌కు వస్తే తప్ప ఉపాధి లేదనే పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో ఉపాధిలేమి అతి పెద్ద సమస్యగా పరిణమించింది. కనుకనే తెలంగాణ వచ్చాక సైతం నగరానికి వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది. దీనిని అడ్డుకోవాలంటే హైదరాబాద్ ఒక్కటే కాదు తెలంగాణలో ఉన్న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి ప్రాంతాలు కూడా పురోగతి దిశగా ప్రయాణించాలి. ఈ నాలుగు మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో ఉన్న పట్టణాల పురోగతికి తగిన అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన అవసరం. ఎక్కడికక్కడ పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయానుబంధ పరిశ్రమల స్థాపన వల్ల ఉపాధి సౌకర్యాలు మెరుగుపడతాయి. వికేంద్రీకృతమైన అభివృద్ధి అంతిమంగా హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గిస్తుంది.
దేశంలో దక్కన్ పీఠభూమి మరింత నివాసయోగ్యం, అందునా ప్రత్యేకించి హైదరాబాద్ మాత్రమే గాక మొత్తం తెలంగాణ పల్లెలు, పట్టణాలు హాయిగా జీవించడానికి అనువైన భౌగోళిక ప్రాంతాలు. నైసర్గికంగా చక్కటి సానుకూలతలు ఉన్న తెలంగాణలో కేవలం హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి అనే వ్యూహం సరికాదు. ఇది విపరీతమైన కేంద్రీకరణకు దారితీసి, జనజీవనాన్ని సంక్షుభితం చేస్తుంది. రియల్‌ఎస్టేట్ బేహారులకు, భారీ వాణిజ్యసముదాయాలకు లాభకరం కావచ్చు కానీ నగరంలో నివసించే వారికి కేంద్రీకృత అభివృద్ధి ఉపయోగకరం కాదు.
ఏది ఆ స్వర్గం?
హైదరాబాద్ నగరాన్ని నిర్మించేటపుడు కులీ కుతుబ్ షా నేను నగరాన్ని కాదు, ఒక జన్నత్ (స్వర్గం)ని నిర్మిస్తున్నానని అన్నారని 10 ఫిబ్రవరి 2019న హైదరాబాద్ అభివృద్ధి సమీక్షలో గుర్తు చేశారు ముఖ్యమంత్రి. నగర జీవనం దుర్భరమైన విషయాన్ని చెబుతూ భవిష్యత్ అవసరాలని అంచనా వేసి, దానికి తగ్గట్టుగా హైదరాబాద్‌ని భూతల స్వర్గంగా మార్చేందుకు మూడు నెలల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. ఆశయం మంచిదే, స్వప్నం అభిలషణీయమే. స్వర్గంగా మారాలన్న తలంపు ఆహ్వానించదగిందే. కానీ ఇందుకు అనువుగా ప్రణాళికలు, ఆచరణ ఎంతవరకు ఏ దిశలో ఉన్నయో ఆత్మావలోకనం తప్పనిసరి.
కులీకుతుబ్‌షాలు, నిజాం నవాబులు నగర ప్రజల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని పనులు చేశారు. ఇవాళ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వెల్లువెత్తిన ఈ దశలో నగరాన్ని విశ్వనగరం చేయాలన్న ఆకాంక్ష ఆక్షేపణీయం కాదు. కానీ అందుకు తగిన ఆచరణ లేకపోతే మాటలుకోటలు దాటుతాయేగానీ, చేతలు ప్రగతి ప్రాంగణం దాటడం లేదేమిటని ఎవరయినా ప్రశ్నిస్తే నగుబాటు కాదా? నగరాన్ని స్వర్గం చేయడం సంగతటుంచి, కనీసం నివాసయోగ్యంగా, భారీ వర్షాలు, వరదలు వంటి విపత్తులకు తట్టుకునే విధంగా రూపుదిద్దడం తక్షణావసరం. నిజాయితీతో కూడిన చేతలే గంభీరమైన మాటలకు విశ్వసనీయతనిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!
- గుడిపాటి