Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌పై బిలాల్‌బాగ్ ఉద్యమకారులు
- ఆందోళనను ఆపేది లేదని స్పష్టీకరణ
బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను గజగజలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. అదే సందర్భంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మహిళల నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. అయితే దేశంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ అది తమ నిరసనలపై ప్రభావం చూపదనీ అంటున్నారు బెంగళూరులోని బిలాల్ బాగ్ నిరసనకారులు. దాదాపు గత 39 రోజులుగా బిలాల్ బాగ్‌లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. ''మాకు కరోనా వైరస్ గురించి బాధలేదు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లు అనే మూడు వైరస్‌లు కరోనా కంటే చాలా ప్రమాదకరం'' అని వారు అంటున్నారు. '' కరోనా బారిన పడకుండా మేము పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చల్లటి నీటికి దూరంగా ఉంటున్నాం. కానీ, ఈ మూడు(సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్) వైరస్‌ల కంటే కరోనా అంత ప్రమాదకరం కాదని మా అభిప్రాయం. ప్రభుత్వం మమ్మల్ని రోడ్ల మీద అవస్థలు పడేలా చేసింది'' అని మహిళలు ఆరోపించారు. కరోనా వైరస్ కారణంగా నిరసనలు ఆపి మేము ఇండ్లలో కూర్చుంటే నిరసనకారులను సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లతో దేశం బయటకు పంపిస్తారు అని ఒక మహిళ ఆరోపించింది. కాగా, రాష్ట్ర సీఎం యడియూరప్పతో చర్చించిన అనంతరం బిలాల్‌బాగ్‌పై చర్యలు తీసుకుంటామని వైద్య విద్య మంత్రి సుధాకర వెల్లడించడం గమనార్హం.
యూపీ లాయర్‌పై దేశద్రోహం కేసు:ట్విటర్‌లో యోగిపై కామెంట్ల ఫలితం
లక్నో : బీజేపీ పాలిత యూపీ రాష్ట్రంలో పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛ కఠినంగా మారిపోయింది. సామాజిక మాధ్యమంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకర కామెంట్లు పెట్టినందుకు ఒక లాయర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. రాష్ట్ర సమాచార విభాగానికి చెందిన మీడియా సలహాదారు శలభ్ మని త్రిపాఠి.. రాష్ట్ర అసెంబ్లీలో యోగి ప్రసంగించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిపై లాఠీచార్జ్‌ను సమర్థిస్తూ యోగి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. అంతే కాదు.. '' మీరు పత్రాలు చూపెట్టరు. నిరసనల్లో కూడా పాల్గొంటారు. మరిమేము.. మీ ఇండ్లను వేలం వేస్తాం. వాటికి పోస్టర్లు అంటిస్తాం'' అని రెచ్చగొడుతూ ఆ వీడియోకు క్యాప్షన్‌ను జోడించారు. అయితే ఈ ట్వీట్‌పై కాన్పూర్ జిల్లా కోర్టు లాయర్ అయిన అబ్దుల్ హన్నన్ స్పందించారు. సీఏఏ నిరసనకారులపై ప్రతీకారంతో వ్యవహరిస్తున్న యోగిని తీవ్రవాదిగా పేర్కొంటూ రిట్వీట్ చేశారు. తన ట్వీట్‌ను షేర్ చేయాల్సిందిగా మరొక ట్వీట్‌లో తన ఫాలోవర్స్‌ను కోరారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు హన్నన్‌పై దేశద్రోహం కింద కేసును నమోదు చేశారు. న్యాయస్థానం ముందు ఆయనను ప్రవేశపెట్టి అనంతరం జైలుకు తరలించినట్టు కళ్యాన్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అజరు సేథ్ తెలిపారు.
యోగి ఆదిథ్యనాథ్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలకు వ్యతిరేకంగా అమర్యాదకర పోస్టర్లు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు రెండు రోజుల క్రితం ఇద్దరిని అరెస్టు చేశారు. '' సుధాన్షు, అశ్వనీ అనే ఇద్దరిని అరెస్టు చేశాం. మూడో వ్యక్తి లాలూ కోసం గాలిస్తున్నాం'' అని పోలీసులు చెప్పారు. కాగా, వీరి అరెస్టులను విపక్ష కాంగ్రెస్ ఖండించింది. నిందితులను విడుదల చేయాలని లక్నోలో నిరసననూ చేపట్టింది. రాష్ట్రంలో నిరసన గళాలను యోగి సర్కారు అణచివేస్తున్నదని అరెస్టులపై యూపీ కాంగ్రెస్ చీఫ్ అజరు కుమార్ లల్లూ ఆరోపించారు.
కేరళ బాటలో రాజస్థాన్:సీఏఏపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కార్
జైపూర్ : వివాదాస్పద సీఏఏపై కేరళ దారిలో రాజస్థాన్ పయనిస్తున్నది. సీఏఏ రాజ్యాంగ బద్దతను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. లౌకికవాద సూత్రాన్ని సీఏఏ ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో అశోక్ గెహ్లాట్ సర్కారు పేర్కొన్నది. అలాగే జీవించే హక్కు, సమానత్వపు హక్కులకు ఇది తూట్లు పొడుస్తుందని వివరించింది. సీఏఏను సవాలు చేస్తూ దేశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి రాష్ట్రంగా కేరళ ఉన్నది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలూ సీఏఏకు వ్యతిరేకంగా తమ తమ రాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానాలను ఆమోదించిన విషయం విదితమే. సీఏఏతో పాటు పాస్‌పోర్ట్ సవరణ నిబంధనలు,2015, ఫారీనర్స్(అమెండ్మెంట్) ఆర్డర్ 2015 లనూ రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కారు సుప్రీంకోర్టులో సవాలు చేసింది.