Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాస్త్రీయ పరిశోధనా పత్రాల విడుదలలో భారత్ వాటా 6.7శాతం
- చైనా నుంచి 47.4శాతం ఆర్టికల్స్ విడుదల
ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తున్నదని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇప్పటికీ వ్యాక్సిన్‌పై జనంలో ఉన్న అపోహలు తొలగలేదు. తాను, సీఎంలందరూ వ్యాక్సిన్ వేయించుకుంటామని మోడీ ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఎవరూ టీకా వేయించుకోలేదు. అమెరికా,రష్యా లాంటి దేశాల అధ్యక్షులే వ్యాక్సిన్‌లు వేయించుకున్నా..ఇక్కడి ప్రజాప్రతినిధులు వైరస్ నియంత్రణమందును ఎందుకు వేయించుకోవటంలేదు. ఇప్పటికీ వైరస్ విజృంభిస్తుంటే.. భారత్ వైరస్ పరిశోధనల్లో వెనుకే ఉన్నదా..! కోవిడ్-19 వైరస్ ఉన్నా..బీజేపీ సర్కార్ లైట్ తీసుకుంటున్నదా..? అసలేం జరుగుతున్నదో పరిశీలిద్దాం..
న్యూఢిల్లీ : కోవిడ్-19 వైరస్ తాకిడికి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. వైరస్‌బారిన పడి కోట్లాది మంది ప్రజలు మరణించారు. వైద్యుల కృషి, శాస్త్రీయ పరిశోధన మాత్రమే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలదని కొద్ది రోజుల్లోనే ప్రపంచం గుర్తించింది. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, భారత్, ఇటలీ, బ్రెజిల్..తదితర దేశాల్లో వైరస్‌పై విస్తృతంగా పరిశోధనా పత్రాలు (ఆర్టికల్స్) వెలువడ్డాయి. అక్టోబర్ 5, 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా వైరస్‌పై మొత్తం 87,515 పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. అయితే మిగతా దేశాలతో పోల్చితే భారత్ నుంచి పెద్ద సంఖ్యలో పరిశోధనా పత్రాలు విడుదల కాలేదనీ, కేవలం 13,062 (6.7శాతం) ఆర్టికల్స్ మాత్రమే విడుదలయ్యాయని తాజా నివేదిక పేర్కొంది. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న మొదటి పిరియడ్‌లో (జనవరి-ఏప్రిల్ 2020) చైనా నుంచి 47.4శాతం ఆర్టికల్స్ వచ్చాయని నివేదిక తెలిపింది.
అమెరికాలోని ఒహియో వర్సిటీ, చైనాలోని జిజియాంగ్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. నివేదికలో పేర్కొన్న మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబరు 5, 2020నాటికి ప్రపంచవ్యాప్తంగా 87,515 పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయి. ఇందులో అత్యధికంగా అమెరికా నుంచి 17,129 (32.5శాతం) ఆర్టికల్స్ వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో చైనా, ఇటలీ, భారత్, బ్రిటన్ దేశాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచ స్థాయి పరిశోధనా పత్రాల ప్రచురణలో వివిధ దేశాల వాటా ఈ విధంగా ఉంది..అమెరికా-32.5 శాతం, చైనా-17.5 (మూడు పిరియడ్‌లలో సగటు), ఇటలీ-10.7, భారత్-6.7, బ్రిటన్-6.6, ఫ్రాన్స్-5.3, స్పెయిన్-4.3, బ్రెజిల్-2.6, బెల్జియం-1.6, పోలండ్-0.9, రష్యా-0.5శాతం.
10 దేశాల్లో అధ్యయనం
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి పరిశోధనా పత్రాలు అత్యధిక సంఖ్యలో వస్తాయని ఊహించాం, కానీ అలా జరగలేదని నివేదికలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మొదటి పిరియడ్‌లో చైనా నుంచి, రెండు, మూడు పిరియడ్‌లలో భారత్ నుంచి పరిశోధనా పత్రాలు ఎక్కువగా వెలువడ్డాయి. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న పది దేశాల గణాంకాల్ని పరిశోధకులు పరిశీలించి ఈ నివేదిక తయరుచేసినట్టు తెలిపారు.
అవగాహన పెంచింది
వైరస్‌పై పరిశోధనా పత్రాలు వెలువడటం మొదలైన తర్వాత, ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, పోలండ్, బెల్జియం దేశాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అవగాహన పెరిగిందని నివేదిక తెలిపింది. ఉదాహరణకు మొదటి పిరియడ్ కాలంలో చైనా నుంచి 47.7శాతం ఆర్టికల్స్ వెలువడ్డాయి. ఆ తర్వాత క్రమంగా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి.
అడ్డంకులు అనేకం
రెండవ(9 ఏప్రిల్-12జులై 2020), మూడవ పిరియడ్(13జులై-5అక్టోబరు 2020) లలో బ్రెజిల్, ఇండియాలో వైరస్ వ్యాప్తి పెద్ద ఎత్తున నమోదైంది. దాంతో ఈ దేశాల నుంచి ఆర్టికల్స్ అత్యధిక సంఖ్యలో వెలువడ్డాయి. లాక్‌డౌన్, ట్రావెల్ బ్యాన్, రాజకీయ ఆంక్షలు..మొదలైనవాటి వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి రీసెర్చ్ చేయడానికి ఆయా దేశాల్లోని వర్సిటీ పరిశోధకులకు అడ్డంకులు ఏర్పడ్డాయి.