Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునావర్ ఫరూకీ కేసు
భోపాల్: స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీతో పాటు మరో ఐదుగురు స్టాండప్ కమెడియన్లు ఓ ప్రదర్శన సందర్భంగా హిందూ దేవతలపై జోకులు వేశారనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ ఇండోర్ జైలులో ఉన్న మునావర్ ఫరూకీకి ఈ నెల 5న సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు స్టాండప్ కమెడియన్లు సదఖత్ ఖాన్ (23), నలిన్ యాదవ్ (25) తాజాగా ఊరట లభించింది. హైకోర్టు వీరిద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే ధర్మాసనం ఫిబ్రవరి 12న ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ప్రకార్ వ్యాస్, అడ్విన్ అంథోనీలకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, ఇండోర్ లో నిర్వహించిన స్టాండప్ కామెడీ ప్రదర్శనలో భాగంగా అందులో పాల్గొన్న మునావర్ ఫరూకీ సహా మరో ఐదుగురు ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసేలా నడుచుకున్నారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మాలిని లక్ష్మణ్ సింగ్ కుమారుడు ఏకలవ్య సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జనవరి 1న ఈ ప్రదర్శనలో పాల్గొన్న స్టాండప్ కమెడియన్లను పోలీసులు అరెస్టు చేశారు.