Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుప్పకూలిన మార్కెట్లు
- సెన్సెక్స్ 1932 పాయింట్లు ఫట్
- రూ.5.43లక్షల కోట్ల సొమ్ము ఆవిరి
- ఒక్క డాలర్ ఏ రూ.73.47
ముంబయి : గడిచిన తొమ్మిది మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ట్రీట్ దారుణంగా పడిపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ భారీగా క్షీణించింది. పలు అంతర్జాతీయ, జాతీయ ప్రతికూల అంశాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1939.32 పాయింట్లు లేదా 3.80 శాతం క్షీణించి 49,099.99కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 2,149 పాయింట్లు కుదేలైంది. గతేడాది మే నాలుగో తేదీ తర్వాత మార్కెట్లు అత్యధికంగా పతనం కావడం ఇదే తొలిసారి. దినమంతా సాగిన నష్టాల పరంపరలో ప్రతీ నిమిషానికి మదుపర్లు రూ.1,450 కోట్ల చొప్పున పోగొట్టుకున్నారు. మార్కెట్లు ఎప్పుడెప్పుడా ముగుస్తాయి అని ఎదురు చూశారు. ఒక్క సెషన్‌లోనే మొత్తంగా రూ.5.43 లక్షల కోట్ల సొమ్ము ఆవిరైంది. బీఎస్‌ఈ బాటలోనే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 568.20 పాయింట్లు కోల్పోయి 14.529.15కు పడిపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 104 పైసలు పతనమై 73.47 స్థాయికి దిగజారింది. 19 మాసాల తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. నిఫ్టీలోని అన్ని రంగాలు నేల చూపులు చూశాయి. బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 4.78 శాతం కోల్పోగా.. వాహన పరిశ్రమ, ఐటీ, లోహ రంగాలు 2.5 నుంచి 4 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్-30లో అన్నీ పడిపోయాయి. ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్ సూచీలు 6 శాతం మేర అత్యధికంగా నష్టాలను చవి చూశాయి.
ప్రతికూలాంశాలు..
అంతర్జాతీయ మార్కెట్ల తీవ్ర ప్రతికూలతలు, ఆసియన్ సూచీలు ఒత్తిడిని ఎదుర్కోవడంతో భారత మార్కెట్లపై మదుపర్లు విశ్వాసాన్ని కోల్పోయారు. అమెరికా- ఇరాన్ మధ్య తాజా ఆందోళనలు సూచీలపై ప్రభావం చూపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ ద్రవ్య పరపతి విధానాన్ని మారిస్తే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందేమోనన్న భయంతో విదేశీ ఇన్వెస్టర్లు వాటాల అమ్మకానికి దిగారు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సాను కూల సంకేతాలు కానరాకపోవడం మరోవైపు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ గణంకాలపై ప్రతికూల అంచనాలు మార్కెట్లను కుదేలు చేశాయి.