Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ పిలుపు
- దేశ ఆస్తులను ప్రయివేటు చేతుల్లో పెట్టే కుట్ర
న్యూఢిల్లీ : అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడానికి కేంద్రం అత్యంత వేగంగా చేస్తున్న అడుగుల పట్ల సీఐటీయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆస్తులను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోడీ సర్కార్ ఉబలాటపడుతోందనీ, ఈ ప్రయివేటీకరణ యత్నాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొడతామని శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. కేంద్రం చేస్తున్న ప్రయివేటీకరణ యత్నాలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వంత పాడడం పట్ల సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశానికి చెందిన ఆస్తులను ఏదో నామమాత్రపు రేటుకు దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అమ్మేయాలని భావిస్తున్నారని, దీనివల్ల దాదాపు అన్ని వ్యూహాత్మక, కీలక రంగాల్లో సామర్ధ్యాలు దెబ్బతింటాయని పేర్కొంది. పైగా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఈ చర్యలన్నింటినీ సమర్ధించుకోవడానికి కేంద్రం చూస్తోందని
విమర్శించింది. పెట్రోలియం, విద్యుత్, ఉక్కు, బొగ్గు, మౌలిక సదుపాయాలు, యావత్ ఆర్థిక రంగం ఇలా అన్ని రంగాల్లోని పీఎస్‌యూలను ప్రయివేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనీ, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్ధ్యం నాశనమవుతుందని హెచ్చరించింది. స్వావలంబన దెబ్బతింటుందనీ, సామ్రాజ్యవాద శక్తులపై దేశం ఆధారపడేలా తయారవుతుందని పేర్కొంది. ఇటువంటి విధ్వంసకరమైన ప్రయివేటీకరణ కార్యక్రమాన్ని దేశంలోని మొత్తంగా కార్మికోద్యమం తీవ్రంగా ప్రతిఘటిస్తోందని తెలిపింది. కేంద్రం అవలంభిస్తున్న ఈ విధ్వంసకర ప్రణాళికను నిర్ణయాత్మకంగా ప్రతిఘటించేందుకు ఐక్య పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని సీఐటీయూ పేర్కొంది. ఈ దిశగా కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ వర్గాల సమాఖ్యల ఐక్య వేదిక ఇప్పటికే తీర్మానించిందని తెలిపింది. ప్రయివేటీకరణ అనేది కేవలం కార్మికుల ఆందోళన మాత్రమే కాదని, దీని ద్వారా దేశ ఆస్తులన్నీ దేశ, విదేశీ కార్పొరేట్లకు చేతుల్లోకి వెళ్తాయని విమర్శించింది. కేంద్రం దేశ, ప్రజావ్యతిరేక అడుగులపై ప్రతి పౌరుడు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. ఈ ప్రయివేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా అన్ని సంస్థల్లో ఐక్య ప్రతిఘటనా పోరాటం జరుగుతుండడం స్వాగతించదగ్గ పరిణామమని సీఐటీయూ పేర్కొంది. వివిధ రంగాల్లో వివిధ దశల్లో పోరాట కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ప్రతిఘటనా పోరాటాలు దేశవ్యాప్తంగా చేపట్టేందుకు మార్గం సుగమం చేసేలా అన్ని సంస్థల స్థాయిల్లో నిరసనలు చేపట్టాలనీ, ఇందుకోసం అత్యవసర చొరవలు తీసుకోవాలని కార్మికులను ముఖ్యంగా ప్రభుత్వ రంగ కార్మికులను సీఐటీయూ కోరింది.