Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో రోజువారీ కేసుల్లో పెరుగుదల
- మూడు నెలల నుంచి ఇదే తీరు
- 24 గంటల్లో 16వేలకు పైనే..
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రోజువారీ యాక్టివ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మూడు నెలలుగా దేశంలో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,738 కొత్త కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,51,708కి చేరుకున్నది. ఇటు కరోనాతో తాజాగా 120 మంది చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య దేశంలో 1,56,825కు చేరుకున్నది. కాగా, దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కొత్త కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో తాజా పరిస్థితిపై రాజీవ్ గౌబా సమావేశమయ్యారు. కాగా, గురువారంనాడు నమోదైన కొత్త కేసుల్లో 89.57శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభించడానికి గల కారణలపై, కోవిడ్-19 నియంత్రణ, నిరోధించే చర్యల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖలతో సమన్వయం కోసం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్‌లలో ఇప్పటికే ఉన్నతస్థాయి బృందాలను కేంద్రం రంగంలోకి దించింది. '' పాజిటివ్ వ్యక్తులను తప్పనిసరిగా ఐసోలేట్ చేయాలి. వారి అన్ని కాంటాక్టులను ట్రేస్ చేసి ఏ మాత్రం ఆలస్యం లేకుండా పరీక్షలు నిర్వహించాలి'' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇటు దేశంలోని ఆరోగ్య నిపుణులు సైతం పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ప్రజలు కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసి పాటించాలని సూచించారు.