Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో అన్నదాతలపై కమలంపార్టీ దాడి
లక్నో : సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే.. మరోవైపు ఆ ఉద్యమాన్ని దెబ్బకొట్టేలా అన్నదాతలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రైతులపై బీజేపీ కార్యకర్తలు సోమవారం విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. షాన్‌పూర్ స్టేషన్ పరిధిలోని సోరమ్ గ్రామంలో ఓ చోట రైతులు సమావేశమయ్యారు. ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు కొనసాగించాలన్న విషయంపై చర్చిస్తున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు 'మా ప్రభుత్వానికే వ్యతిరేకంగా నోరువిప్పుతారా..! మీ అంతు చూస్తాం' అంటూ బెదిరింపులకు దిగారు. తమకు మర్యాదగా మాట్లాడాలంటూ రైతులు వారిని కోరారు. సాగు చట్టాల వల్ల మేలు జరుగుతుందంటూ రైతులతో బీజేపీ కార్యకర్తలు వాదనకు దిగారు. వాది వాదనను రైతులు వ్యతిరేకించారు. దీంతో కాషాయ కార్యకర్తలు రెచ్చిపోయారు. అన్నదాతల రక్తం కళ్లారా చూశారు.
షామ్లీలో కేంద్రమంత్రికి చుక్కెదురు
సాగుచట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని ప్రచారానికి వెళ్లిన కేంద్రమంత్రి సంజరు బలియాన్‌కు చుక్కెదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో ఆయనకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు నినాదాలు చేశారు. ఎలాగోలా కేంద్రమంత్రి చొరవ తీసుకుని ఓ వృద్ధ రైతు నేత ఇంటికి వెళ్ళారు. 'రైతులను బానిసల్ని చేస్తావా..' అంటూ ఆయన మంత్రిని నిలదీశాడు. దీంతో కంగుతిన్న కేంద్రమంత్రి వెనుదిరగకతప్పలేదు. బీజేపీ చేస్తున్న సాగుచట్టాల అనుకూల ప్రచారాలు కాస్త బెడిసికొట్టడంతో... ఎలాగైనా అన్నదాతల్ని దెబ్బతీయాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.