Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కొరొనిల్'పై కేంద్ర ఆరోగ్య మంత్రి వివరణ ఇవ్వాలి
- ఐఎంఏ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ : పతంజలి వారి కొరొనిల్ టాబ్లెట్‌కు డబ్ల్యూహెచ్‌ఓ సర్టిపికెట్ వుందంటూ దారుణంగా అసత్యం చెప్పడం పట్ల ఐఎంఏ సోమవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వెంటనే ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరింది. ఆయన సమక్షంలోనే ఈ ఔషధాన్ని ఆవిష్కరించారు. కోవిడ్ చికిత్స కోసం తామెలాంటి సాంప్రదాయ సిద్ధమైన ఔషధం సామర్ధ్యాన్ని సమీక్షించలేదనీ, లేదా సర్టిఫై చేయలేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా ప్రభావం బాగా ఎక్కువగా వున్న సమయంలో కోవిడ్‌పై పోరాటానికి సరైన మందు ఉంది అంటూ ప్రచారం చేస్తూ గతేడాది జూన్ 23న ఈ టాబ్లెట్‌ను పతంజలి ప్రవేశపెట్టింది. డబ్ల్యూహెచ్‌ఓ సర్టిఫికేషన్ స్కీమ్ ప్రకారం ఆయుష్ మంత్రిత్వశాఖ నుండి కొరొనిల్ టాబ్లెట్‌కు సర్టిఫికెట్ అందిందని ఫిబ్రవరి 19న యోగా గురు రాందేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద్ ప్రకటించింది. అయితే, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తర్వాత ఈ సర్టిఫికేషన్‌కి సంబంధించి ఒక వివరణను ట్వీట్ చేశారు. గందరగోళాన్ని నివారించేందుకే తామీ వివరణ ఇస్తున్నామనీ, కొరొనిల్‌కు మాకందిన డబ్ల్యూహెచ్‌ఓ జీఎంపీ కంప్లైంట్ సీఓపీపీ సర్టిఫికెట్ భారత ప్రభుత్వ డీసీజీఐ జారీ చేసిందని చెప్పారు. ఒక దేశ ఆరోగ్య మంత్రి అయి వుండి, ఇటువంటి తప్పుడు పద్దతిల్లో రూపొందించిన, ఏ మాత్రమూ శాస్త్రీయత లేని ఉత్పత్తిని ప్రజల కోసం విడుదల చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తన ప్రకటనలో ప్రశ్నించింది. ఈ కొరొనిల్ టాబ్లెట్‌కు జరిగిన క్లినికల్ ట్రయల్స్ వివరించగలరా? అని ప్రశ్నించింది. తక్షణమే ప్రజలకు మంత్రి వివరణ ఇవ్వాలని కోరింది.
దీనిపై జాతీయ మెడికల్ కమిషన్‌కు కూడా లేఖ రాయనున్నట్టు తెలిపింది. పైగా కోవిడ్‌పై పోరులో కొరొనిల్ టాబ్లెట్ పనిచేసే తీరుపై పరిశోధనా వివరాలు అంటూ కొన్ని పత్రాలను పతంజలి ఆయుర్వేద విడుదల చేసింది.