Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ కవళికల ఆధారంగా బాధలో ఉన్నవారిని గుర్తిస్తామని యుపి పోలీసుల ప్రకటన
- ఈ చర్యపై పలు ప్రశ్నలు, విమర్శలు
షహరాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్) : మహిళలకు భద్రత కల్పించే పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పోలీసులు చేసిన తాజా ప్రకటన పలు ప్రశ్నలకు, విమర్శలకు దారితీస్తోంది. మహిళలకు ఎదురౌతున్న కష్టాలు, ఇబ్బందులపై నగరంలోని పలు ప్రాంతాల్లో కృత్తిమ మేథస్సు(ఎఐ)తో కూడిన కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా చర్యలు తీసుకోవాలనేది పోలీసుల ప్రణాళిక. ఈ కెమెరాలు ముఖ కవళికల ఆధారంగా బాధలో ఉన్న మహిళ ఫొటోను తీస్తుంది. అనంతరం పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక అలర్ట్ వెళ్తుంది. దీనికి అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజిపి ప్రశాంత్‌కుమార్ పేర్కొన్నారు. ఈనెల 20న లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన 'ఆశిష్ : అభరు ఔర్ అభ్యుదయ' వర్క్‌షాప్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డికె ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. మహిళల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే ప్రాంతాల ఆధారంగా నగరంలో 200 హాట్‌స్పాట్‌లను గుర్తించి ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళ ముఖంలోని బాధను గుర్తించిన ఈ కెమెరాలు యాక్టివేట్ అయిన వెంటనే సదరు మహిళ 100 లేదా 112కు ఫోన్ చేయకముందే పోలీసులు అలర్ట్ అవుతారని తెలిపారు.
పోలీసుల తాజా ప్రకటనపై పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య పౌరుడి గోప్యతా హక్కు ఉల్లంఘన కిందకు వస్తుందని, బలహీనవర్గాల ప్రజలపై నిఘా సాధనంగా కూడా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని విమర్శించారు. ఒక నేరంపై ఎప్పుడు ఫిర్యాదు చేయాలనుకునే దానిపై నిర్ణయం తీసుకునే మహిళ హక్కును ఈ చర్య విస్మరిస్తుందని అన్నారు. మహిళ ముఖంలోని బాధకు గల కారణాన్ని గుర్తించడం కష్టమని, కుటుంబంలో ఏమైనా బాధలు ఉన్నా, ఎవరైనా చనిపోయినా వారి ముఖంలో బాధ ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ వ్యవహారాల్లో కూడా తలదూర్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ డెమోక్రసీ డైరెక్టర్ అంజా కోవాక్స్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. భద్రత పేరుతో నిఘా సాధనాలను ఉపయోగించడం సమస్యాత్మకమైన భావన అని అభిప్రాయపడ్డారు. ఇది సామాజిక నియంత్రణను పెంచుతుందని అన్నారు. నిఘా నిబంధనలపై అవగాహన లేకపోవడం ద్వారా ఇప్పటికే సమాజంలో హానివున్న వారికి మరింత హాని కలిగించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
మహిళలను అన్ని సమయాల్లో అనుసరించడం సాధ్యం కాదని, దీని కంటే వారికి రక్షణపరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మతాంతర వివాహం చేసుకున్న జంటలను ఈ నిఘా ప్రమాదంలోకి నెడుతుందని అన్నారు.