Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, మమత కుటిల రాజకీయాలు
- మతతత్వానికి నేతాజీ వ్యతిరేకమన్న ఏచూరి
కోల్‌కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలనే యావలో ప్రధాని నరేంద్ర మోడీ , బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ పడ్డారు. మరో నాలుగు నెలల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోవారు దీనిని తమ బలాబలాల ప్రదర్శనకు వేదికగా మార్చారు. నేతాజీ జయంతిని పరాక్రమ దివస్‌గా పాటిస్త్తూ ప్రధానిమోడీ శనివారం కోల్‌కతా నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో రాష్ట్రప్రభుత్వం కూడా 'దేశ్ నాయక్ దివస్' పేరుతో పలు కార్యక్రమాలను చేపట్టింది. కోల్‌కతాలో నేతాజీకి అంకితం చేసిన శాశ్వత మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభించారు. కోల్‌కతా విక్టోరియా మెమోరియల్ కార్యక్రమ వేదికపై ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రసంగించేందుకు లేవగానే బీజేపీ కార్యకర్తలు 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వ కార్యక్రమం హుందాగా ఉండాలని భావిస్తున్నాను. ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమం. ప్రధాన మంత్రి, సాంస్కృతిక మంత్రిత్వశాఖ కోల్‌కతాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఒకరిని ఆహ్వానించిన తరువాత వారిని అవమానించడం సరికాదు. నిరసనగా, నేనేమీ మాట్లాడను. జై హింద్, జై బంగ్లా' అంటూ వేదిక దిగి వెళ్లిపోయారు.
మతతత్వానికి, సంకుచితత్వానికి నేతాజీ వ్యతిరేకం
'నేతాజీ సుభాష్ చంద్రబోస్ మతతత్వానికి, సంకుచిత మనస్తత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డారు. భారతీయులందరినీ ఏకం చేశారు. వారి మధ్య బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలపై నిరంతరం పోరాడారు' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. బోస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్, హిందూ మహాసభలలో ద్వంద్వ సభ్యత్వాన్ని కలిగి ఉండటాన్ని నిషేధించింది. 'కాంగ్రెస్, కమ్యూనల్ ఆర్గనైజేషన్స్' అనే అంశంపై 1940 మే 4న బోస్ చేసిన వ్యాఖ్యలను సీతారాం ఏచూరి ట్విట్టర్‌లో ఉటంకించారు. 'చాలాకాలం క్రితం ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మత సంస్థలైన హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌లలో సభ్యులుగా ఉన్నారు. కానీ, ఇటీవల కాలంలో పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మత సంస్థలు గతంతో పోలిస్తే మరింత మతతత్వంగా మారాయి. దీనికి ప్రతిస్పందనగా, భారత జాతీయ కాంగ్రెస్ తన రాజ్యాంగంలో హిందూ మహాసభ, ముస్లిం లీగ్ వంటి మత సంస్థలలో సభ్యులెవరూ ఎన్నుకోబడినా కాంగ్రెస్ కమిటీలో సభ్యులుగా ఉండకూడదని ఒక నిబంధన పెట్టారు.' అని అన్నారు.