Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌ఈసీ వర్సెస్ ప్రభుత్వం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివాదం కొనసాగుతున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటోంది. దీంతో అధికారయంత్రాంగం కూడా ఎన్నికల ప్రక్రియకు దూరంగానే ఉంటున్నది. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమానికి పంచాయతీ రాజ్‌శాఖ అధికారులెవ్వరూ హాజరు కాలేదు. శనివారం సాయంత్రం వరకూ ఒక్క జిల్లా కేంద్రంలో కూడా నోటిఫికేషన్ విడుదల కాలేదు. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికార యంత్రాంగంతో ఎస్‌ఈసీ నిర్వహించతలపెట్టిన వీడియోకాన్ఫరెన్స్ కూడా రద్దయింది. ఉన్నతస్థాయి అధికారులతో పాటు, జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఎస్‌ఈసీ కార్యాలయ వర్గాలు గవర్నర్ అప్పాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినట్టు కూడా సమాచారం. చివరకు గవర్నర్‌ను కలవకుండానే ఎస్‌ఈసీ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తూ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకుంది. అది రాజ్యాంగం ఇచ్చింది. ప్రాణాపాయం వస్తే ఎదుటివాడ్ని చంపే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. దీనిని సుప్రీం కోర్టు కూడా కాదనదనే భావిస్తున్నాం. మా ప్రాణాలు ఫణంగా పెట్టైనా ఎన్నికలు నిర్వహించాలన్న పంతంతో ఎస్‌ఈసీ ఉన్నారు. ఆయన మాత్రం ప్రత్యేకమైన తెర వెనుకనుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. విధుల్లో పాల్గొనడానికి ఎవరైనా సిబ్బంది సమ్మతిస్తే వారితో ఎన్నికలు జరుపుకోవచ్చు.' అని ఆయన అన్నారు.