Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో న్యాయవ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ల పనితీరుపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలనీ, ఒక వేళ అలా జరగకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని తెలిపింది. న్యాయమూర్తులు ఎస్.ఎస్.షిండే, మనీశ్ పిటాలే లతో కూడి డివిజన్ బెంచ్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విధంగా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర మాజీ రెవెన్యూ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పుణేలోని ఓ భూమి కబ్జా కేసు విషయంలో తనకు వ్యతిరేకంగా గతేడాది ఈడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సదరు పిటిషన్‌లో న్యాయస్థానాన్ని ఖడ్సే కోరారు. '' ఈ సంస్థలు స్వతంత్రంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికే చాలా ప్రమాదకరం. రాష్ట్ర సంస్థలు కూడా నిష్పక్షపతానికి కట్టుబడి పని చేయాలి'' అని న్యాయస్థానం తెలిపింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రముఖ నాయకులను బెదిరించడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం తోలుబొమ్మలా వాడుకుంటోందని కాంగ్రెస్ సహా దేశంలోని అనేక ఇతర పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.