Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీ నాయకులకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- వివాదాస్పద వ్యవసాయ చట్టాలే కారణం
- పార్టీని వీడుతున్న సీనియర్ నేతలు
చండీగఢ్ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలు పంజాబ్‌లో బీజేపీకి రాజకీయంగా ఫుల్‌స్టాప్ పెట్టనున్నాయా? రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి రానున్నది గడ్డు కాలమేనా? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. బీజేపీ నాయకులు ఇటీవల ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్ (ఎస్‌ఏడీ) వ్యవసాయ చట్టాల ఆమోదం అనంతరం ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు దూరమైంది.
కేంద్రంలో ప్రభుత్వం నుంచి వైదొలిగి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్ ప్రజలు బీజేపీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు ప్రజల మధ్య వెళ్లడానికి కూడా భయపడుతున్నారంటే అక్కడి బీజేపీ పతన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అగ్రనాయకులు సైతం బీజేపీని వీడి ఇతర పార్టీల వైపు వెళ్తున్నారు.
ముఖ్యంగా వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేయాలని భావించిన బీజేపీ అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. రాబోయే మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి బర్నాలా జిల్లాలో ఆ పార్టీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా సమావేశం ఏర్పర్చడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది.
బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని భావించిన ఆ పార్టీలో అనేక పదవులను నిర్వహించిన దాదాపు 10 మంది సీనియర్లు గతవారం ఎస్‌ఏడీలో చేరారు. ఫరీదాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది బీజేపీ నేతలు అదిష్టానానికి లేఖ రాశారు. వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లు నెరవేరే దాకా రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ తాము భాగస్వామ్యం కాబోమని ఆ లేఖ సారాంశం. '' మేము రైతులకు మద్దతు ఇచ్చాం. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో పార్టీకి సంబంధించి ఏ ఒక్క కార్యచరణలోనూ తాము భాగం కాబోమని అధిష్టానానికి వివరించాం '' అని బీజేపీ ఓబీసీ ఫ్రంట్ నాయకుడు జస్విందర్‌సింగ్ భులారియా అన్నారు.
బీజేపీకి ఇక్కడ ప్రజలు, రైతుల్లో విశ్వాసం లేదనీ, గ్రామస్థాయిలో పార్టీ సున్నా స్థాయికి చేరుకున్నదని బీజేపీలో 25 ఏండ్లుగా పనిచేసిన మాన్సా జిల్లా నాయకుడు రజిందర్ కుమార్ రాజీ తెలిపారు. పంజాబ్‌లో కుల, మత ఆధారిత రాజకీయాలను చేయడం కుదరదని బీజేపీని వీడిన మరో ప్రముఖ నాయకుడు బల్విందర్‌సింగ్ మాల్ అన్నారు. ఇదే దారిలో అనేక మంది సీనియర్ నాయకులు క్యూలో ఉన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే కానీ రాష్ట్రంలో బీజేపీ నిలవలేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు.
రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం పంజాబ్ నుంచి ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఫిబ్రవరిలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికలు బీజేపీకి, మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలకు లిట్మస్ టెస్టు వంటివనీ, ఇందులో గెలవడం ఆ పార్టీకి అంత సులువేం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హర్యానా మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓడిన తీరును వారు గుర్తు చేశారు.