Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ శివార్లకు చేరుకున్న ఒడిశా రైతులు
- ఇది పంజాబ్, హర్యానాకే పరిమితం కాదు : రైతు సంఘాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు వస్తున్నారు. తాజాగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా రైతులు ఢిల్లీ శివార్లకు చేరుకున్నారు. వీరంతా జాతీయ రహదారి నెంబర్ 2పై టెంట్లు వేసుకొని శాంతియుతంగా నిరసన దీక్షకు దిగారు. ఉద్యమం కేవలం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకే పరిమితమైందని 'గోడీ మీడియా' (ప్రభుత్వ మీడియా వర్గాలు) చేస్తున్న ప్రచారంలో నిజం లేదని నిరూపించడానికే వేల కి.మీ దాటుకొని ఢిల్లీకి వచ్చామని ఒడిశాకు చెందిన చామ్రూ సోరెన్ చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలతో కలిగే ముప్పు దేశంలోని రైతులందరిపైనా ఉంటుందని ఆయన అన్నారు. తనతోపాటు వేలాదిమంది రైతులు భవనేశ్వర్ నుంచి 1800 కి.మీ ప్రయాణించి ఢిల్లీకి చేరుకొనీ, రైతు ఉద్యమంలో పాల్గొంటున్నామని చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చామని చామ్రూ సోరెన్ వెంట వచ్చిన మిగతా రైతులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
చట్టాలు ఒకవేళ అమల్లోకి వస్తే రైతాంగ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని మరో రైతు మరాండీ అన్నారు. వీరంతా కూడా జాతీయ రహదారిపై ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
రైతులతోగానీ, రైతు సంఘాలతోగానీ ఎలాంటి చర్చలూ జరపకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ చట్టాలు చేసిందని మారాండీ విమర్శించారు. ఒడిశా విషయానికొస్తే, ఇక్కడ ఒక్క పంట వేయటమే రైతులకు కష్టతరంగా మారిందనీ, చాలా కొద్దిమంది రైతులకు మాత్రమే నీటిపారుదల అందుబాటులో ఉందని ఆయన అన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ సభ్యుడు జతిన్ మెహంతీ మాట్లాడుతూ..''ఈ నల్ల చట్టాల ప్రభావం ప్రధానంగా దళితులు, గిరిజనులపై ఎక్కువగా ఉండనున్నది. ఒకవేళ కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం మొదలైతే..వీరి మనుగుడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుడు భూమి హక్కులున్నా లేనట్టే లెక్క. కౌలు రైతుల బతుకుదెరువు దెబ్బతింటుంది. వీరికంటే ఎక్కువిస్తామని భూమి యజమానులకు ఆఫర్లు వస్తే..వారు పేద రైతుకు కౌలుకు ఇస్తారా? చెప్పండి'' అని ప్రశ్నించారు.