Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థుల అనుయాయుల్లో తీవ్ర ఉత్కంఠ
- గెలుపోటములపై జోరుగా బెట్టింగులు
- కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
- విప్ జారీ చేసిన ప్రధాన పార్టీలు
- నేడు పుర ఎన్నికల ఫలితాలు
పురఎన్నికల ఫలితాలకు కౌంట్.. డౌన్ మొదలైంది. మరి కొన్నిగంటల్లో బ్యాలెట్‌బాక్స్‌లో దాగున్న అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. నువ్వా..? నేనా..? అన్నట్టుగా హోరాహోరీగా ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈక్రమంలో ఎన్నికల ఫలితం అనుకూలమా? ప్రతికూలమా? తెలియక నరాలు తెగేంత టెన్షన్‌కు గురవుతున్నారు.వారి అనుయాయులు సైతం గెలుపోటముల గురించి తెలుసుకునేందుకు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పుర ఎన్నికల గెలుపు గుర్రాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు సాగాయి. శనివారం జరిగే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల కలెక్టర్ల అధ్వర్యంలో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు.ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలను పోలీసులు నిషేధించారు.సమస్యాత్మాక ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 407 వార్డులు ఉండగా 3వార్డులు ఏకగ్రీవమైనాయి. యాదాద్రి జిల్లాలోని 433 మంది అభ్యర్థులు పోటీ చేసిన 103 వార్డుల్లో 1,17,769 ఓట్లకు గాను 104014 ఓట్లు పోలైనాయి.సూర్యాపేట జిల్లాలోని 556 మంది పోటీ చేసిన 140వార్డుల్లో 2,06,238 ఓట్లకు గాను 1,71,710 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 718 మంది పోటీ చేసిన 161 వార్డుల్లో 2,81,444 ఓట్లకు గాను 2,23,684 ఓట్లు పోలయ్యాయి. 1707 మంది పోటీ చేసిన 404 వార్డుల్లో మొత్తంగా 6,05,451ఓట్లకు గాను 4,99,344 ఓట్లు ఈనెల 22న 1006 పోలింగ్ బూత్‌ల్లో పోలయ్యాయి.మిగతా 1,06,107 ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ఆనంతరం బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. వీటికి మూడంచెల భద్రతను పోలీసులు కల్పించారు. సీసీ కెమెరాల నిఘాలో 24గంటల పాటు పర్యవేక్షించారు. పోలీసులభద్రతలో ఉన్న బ్యాలెట్‌బాక్స్‌లు కౌంటింగ్ సందర్భంగా నేడు తెరుచుకోనున్నాయి. వాటిల్లో దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని బయట పెట్టనున్నాయి.
యాదాద్రి జిల్లాలో....
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ పురపాలిక ఓట్ల లెక్కింపు భువనగిరిలోని ఆరోరా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది.ఏబ్లాక్‌లో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, బీబ్లాక్‌లో చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులకు గాను పోచంపల్లి ఒకటవ వార్డు ఏకగ్రీవం కాగా 103వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్ చొప్పున 103 టేబుళ్లను ఏర్పాటు చేశారు.ఓట్ల లెక్కింపు కోసం 360 మంది సిబ్బందిని నియామకం చేశారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లెకింపు పూర్తవ్వనుంది.అయితే ఉదయం 11గంటల లోపు ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
సూర్యపేట ఎస్.వి కాలేజీలో...
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు సూర్యపేట ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది.సూర్యపేటలోని 48వార్డులకు 21 టేబుల్స్ సిద్ధం చేశారు. 3రౌండ్లల్లో ఫలితాలు ముగి యనున్నాయి. 35 వార్డులను కోదాడకు 15టేబుళ్లు, నేరడుచర్ల ఆరు, హుజూర్‌నగర్‌కు 10, తిరుమల గిరికి 6 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు.
నల్లగొండలో ఎక్కడికక్కడే...
నల్లగొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఎక్కడికక్కడే జరుగుతుంది. నల్లగొండలోని 48వార్డుల ఓట్ల లెక్కింపు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఎఫ్‌సీఐ గోదాంలో వార్డుకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు.మిర్యాలగూడలోని 48వార్డుల ఓట్ల లెక్కింపు ఏ.ఎం.సి ఆవంతీపురం మార్కెట్ యార్డులో సిద్దం చేశారు. దేవరకొండలోని 20వార్డులకు ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొండలోని 12వార్డులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల హలియా, చిట్యాలలో ఎంపీడీఓ ఆఫీస్, చండూర్‌లో మారినికేతన్ పాఠశాలలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో టేబుల్‌కు రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సూపర్‌వైజర్, ఇద్దరు క్లర్కులు ఉంటారు. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద మూడెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సెంటర్ వద్ద 100 మించి పోలీసులను మోహరించారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు.
విజయోత్సవ ర్యాలీలు నిషేధం..
పుర ఫలితాల్లో గెలుపొందిన విజేతలు విజయోత్సవ ర్యాలీలు తీయకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు.సభలు, సమావేశాలు సైతం నిర్వహించకూడదని ప్రకటించారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తారు.
జోరుగా బెట్టింగ్‌లు...
పురఎన్నికల గెలుపు గుర్రాలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జోరుగా పందాలు కాసారు. నేడు వెలువడే ఫలితాల్లో గెలిచే అభ్యర్థులు వీరేనంటూ.. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు చేసుకున్నారు.రూ.5వేల నుంచి లక్ష వరకు బెట్టింగ్ పెట్టుకున్నారు. ఇందులో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉండడం విశేషం. చౌటుప్పల్, యాదగిరిగుట్ట, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట తదితరు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు తగ్గాపోరు ఉన్న చోట తమ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని తొడగొట్టి ఛాలెంజ్ చేస్తూ పందాలు కట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా పురపాలికల్లో శుక్రవారం ఇదే చర్చ వినిపించింది.చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట తదితర పురపాలికల్లో గతం కంటే ఎక్కువ ఓట్లు పోలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పట్టణ యువత ఓట్లు ఎవరికి మొగ్గు చూపాయో అర్ధం కాక ప్రధానపార్టీల అభ్యర్థులకు గుబులు మొదలైంది. పట్టణ యువత ఓట్లు ఎవ్వరికి అధికంగా పడుతాయో.. వారికి విజయం వరించడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విప్ జారీ చేసిన పార్టీలు..
ఎన్నికలకు ముందు క్యాంపు రాజకీయాలు మొదలుకావడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ(ఎం) పార్టీలు విప్‌ను జారీ చేశాయి.కౌంటింగ్ సమావేశాల పేరిట అభ్యర్థులను పిలిచి విప్ పత్రాలను అందజేశాయి.ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను బట్టి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.