Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాల్లో వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ బకాయిలను సత్వరమే రాబట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి, ప్రిన్సిపాల్ కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించిన వివిధ అంశాల కేసులకు సంబంధించిన ప్రభుత్వ వసూళ్లను పరిశీలించి సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల వారీగా గతంలో వివిధ పథకాలకు సంబంధించిన సబ్సిడీ, మిగిలిన నిధులను అన్ని శాఖల ద్వారా తెప్పించుకుని ప్రభుత్వ పద్దుకు జమచేయాలని సూచించారు. డిసెంబర్ మాసంలో నిర్వహించే సమావేశంనాటికి అన్ని అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అమరుకుమార్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ అంశాలపై 33 విజిలెన్స్ కేసులు ఉన్నాయన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, దేవాదయ, కార్మిక, మైన్స్, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఇప్పటివరకు గత పాత బకాయిలు రూ.7.23 కోట్లు ఉన్నట్టు తెలిపారు. ఆ బకాయిలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబంధిత శాఖల నుంచి వసూళ్లు చేసిన తర్వాత ప్రభుత్వ పద్దులకు జమచేయనున్నట్టు వివరించారు. జిల్లాలో గతంలో వివిధ పథకాలకు సంబంధించి మిగిలిఉన్న అలాగే సబ్సిడీ నిధులను సంబంధిత శాఖల ద్వారా నివేదికలను తెప్పించుకుని పరిశీలన అనంతరం జమచేయనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మోహన్‌రావు, సీపీఓ టి.అశోక్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి:విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ద్వారా నమోదైన కేసులకు వెంటనే పరిష్కరించి, వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రూ.1,966 కోట్లను వెంటనే జమ చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జ్యోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా నమోదైన కేసులు ప్రగతి, రావాల్సిన నిధుల వివరాలపై సమీక్షించారు. 11 శాఖల ద్వారా రావాల్సిన నిధులను రెండు నెలలోగా ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య పనులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు, రెవెన్యూ, పంచాయతీరాజ్, టౌన్‌ప్లానింగ్, నాలా కన్‌వర్షన్ ఫీజుల చెల్లింపు తదితర విభాగాల ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీఆర్‌ఓ వెంకట్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఆర్డివో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.