Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలు గడుస్తున్నా పైసలు నిల్
- యేటికేడాది తగ్గుతున్న పనులు
ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మాత్రమే ఆ ముప్పునుండి బయట పడొచ్చన్నది ఆర్థిక, సామాజిక వేత్తల అభిప్రాయం. కాని రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనబడడంలేదు. ఈ విషయంలో ఉమ్మడి మెదక్‌జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ద్వారా పేదలకు పనులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆవిషయాన్ని పూర్తిగా విస్మరించింది. పేదలకు వంద రోజుల పని కల్పించకపోగా చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు చెల్లించడంలేదు. దీంతో పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు.
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌జిల్లాలో గడిచిన నాలుగేండ్లలో ఉపాధి కల్పన నానాటికీ తగ్గుతుండగా చేసిన పనికి నెలల తరబడి బిల్లులు చెల్లించడంలేదు. సంగారెడ్డిజిల్లాలో లక్షా 42వేల 664మందికి జాబ్‌కార్డులుండగా లక్షా38వేల 710 మందికి పనులు కల్పించారు. వీరికిగాను ఏప్రిల్‌నుండి నవంబర్ వరకు రూ.9కోట్లా 55వేలా 370 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో మొత్తం 4లక్షలా 17వేలా 975మంది కూలీలు ఉండగా లక్షా 95వేలా 682 మందికి మాత్రమే జాబ్‌కార్డులున్నాయి. అందులో 91వేలా624 మందికి ఉపాధిహామీ కింద పనికలిస్తున్నారు. వీరికిగాను గతేడాది రూ.54లక్షలా 49వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు
రూ.8కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజుకు ఒక్కోకూలీకి రూ.197 చెల్లించాలని చట్టం చెబుతున్నా ఎక్కడా ఆవిధంగా చెల్లించడంలేదు. కేవలం రూ.80నుండి రూ.150 వరకు ఒక్కో చోట ఒక్కో విధంగా చెల్లిస్తున్నారు. మెదక్‌జిల్లాలో 4లక్షలా731మంది కూలీలుండగా లక్షా73వేలా4జాబ్‌కార్డులు మాత్రమే అందజేశారు. వీరిలో లక్షా43వేలా 742మంది జాబ్‌కార్డులు కలిగి పనులు చేస్తున్నారు. వీరికిగాను రూ.48లక్షలా 14వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.197 కూలి చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.120నుండి రూ.160 వరకే కూలి చెల్లిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 2016-17 నిర్దేశించుకున్న లక్ష్యంలో 97.23 శాతం పనులు పూర్తిచేయగా 2017-18లో 67.56 శాతం, 2018-19 36.83శాతం , 2019-20కి గాను ఇప్పటి వరకు కేవలం 1.11 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు.
మెదక్‌జిల్లాలో 2016-17 లో నిర్దేశించిన లక్ష్యంలో 98.19శాతం పనులు పూర్తిచేయగా 2017-18లో 78.18 శాతం, 2018-19లో 27.27, 2019-20కిగాను 3.59శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో 2016-17లో నిర్ధేశించిన లక్ష్యంలో 98.16శాతం పనులు పూర్తిచేయగా 2017-18లో 72.11శాతం, 2018-19లో 27.27శాతం, 2019-20లో 7.49శాతం పనుల లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు.
చేసిన పనులకు పైసలొత్తలేవు .. ఏంతిని బతకాలి - లక్ష్మి, మల్కాపూర్, హత్నూర మండలం
ఉపాధి పనులు చేసి ఆర్నెళ్లవుతోంది. ఇంత వరకు పైసలివ్లలే. చేసిన పనికి డబ్బులివ్వకుంటే ఏంతిని బతకాలి. కష్టం చేసినా డబ్బులు తక్కువ కడుతున్నారు. అవికూడా ఇయ్యకపోతే ఎవరిని అడగాలి. జల్దీ పైసలిస్తే బాగుంటది.
రేపు..మాపు అంటున్నారు - ఎంకమ్మ, సింగూరు, పుల్కల్ మండలం
చేసిన పనులకు పైసలడిగితే రేపు..మాపు అంటున్నారు. ఉపాధి డబ్బులు ఎప్పుడొస్తయో అర్థమైతలేవు. పైసలు రాక ఇబ్బంది పడుతున్నాం. సరుకుల ధరలు పెరిగిపోతున్నా కూలిరేటు పెంచట్లేదు. పనులుకూడా అప్పుడప్పుడు మాత్రమే చెబుతున్నారు. ఎక్కువ రోజులు పనికల్పిస్తే కుటుంబ పోషణకు ఇబ్బందులుండవు.