Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం చేసేవారు రోజులో ఎక్కువ సమయం గడిపేది ఆఫీసులోనే. అలాంటి వర్క్ ప్లేస్ బాగుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆఫీస్ లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. అందుకే ఆఫీసు వాతావరణం, మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎంత బాగుంటే మన కెరీర్‌ను మనం అంత బాగా ఎంజారు చేయగలం. ప్రొఫెషనల్ లైఫ్ సంతృప్తిగా సాగాలన్నా, విజయవంతంగా సాగాలన్నా వర్క్ ప్లేస్, అక్కడి స్టాఫ్‌ను బట్టే అదంతా సాధ్యమవుతుంది. అయితే కొన్ని సమస్యలు రావడం సహజమే. కానీ ఎప్పుడూ అలాగే ఉంటే? పనిచేస్తున్న ఆఫీసు సక్రమంగా లేదని, మీరు అక్కడ ఎదగలేరని.. అతి త్వరలో మరో మంచి ఉద్యోగం చూసుకోవాలని అర్థం. లేదు అలాగే ఉండిపోయారంటే మాత్రం టెన్షన్ రోజురోజుకీ పెరుగుతుంది. ఇది శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీయటం ఖాయం. దీని తాలూకు దుష్ప్రభావాలు వ్యక్తిగత జీవితంపైనా పడతాయి. ఆఫీసులో తీవ్ర ఒత్తిడి, నైతికత లోపించటం, అనారోగ్యకరమైన పోటీ, మీ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీయడం వంటివి ఉన్నాయంటే మీ మానసిక స్థిరత్వాన్ని ఇవి కబళించేస్తాయి. మీరు ఎలాంటి చోట పని చేస్తున్నారో తెలుసుకోండి...
బ్యాడ్ గాసిప్స్: మీ ఆఫీసులో కొలీగ్స్ తరచూ చెవులు కొరుక్కుంటున్నారంటే అది మంచి వాతావరణం కాదని గుర్తించండి. ఎందుకంటే ఇలా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతూ, గాసిప్స్ చెప్పుకుంటూ ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా మాట్లాడుకునే వారు మీ చుట్టూ ఉంటే మీకు ఉద్యోగంలో ప్రశాంతత ఉండదనే చెప్పుకోవచ్చు. అంతే కాదు ఇలాంటివి కొలీగ్స్ మధ్య అపార్థాలకు, కన్ఫ్యూజన్‌కు దారితీస్తాయి. రోజువారి పనిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉద్యోగుల మధ్య గొడవలకు దారి తీసి, టీం స్పిరిట్ దెబ్బతింటుంది.
టీనేజర్లా ప్రవర్తిస్తున్నారా: ఉద్యోగుల్లో కొందరు కాలేజ్ టీనేజర్స్‌లా ప్రవర్తిస్తూ గ్రూపిజం చేస్తుంటారు. ఇలాంటి వారి వల్ల కూడా సమస్యలు పుట్టుకొస్తాయి. ఇలాంటి చోటనే గాసిపింగ్, జట్లుగా మారి ఇతరుల ప్రయోజనాలను దెబ్బతీయటం వంటివి జరుగుతాయి. అదేపనిగా కొందరిని లక్ష్యంగా చేసుకుని మాటలతో వారిపై దాడిచేయటం, అవమానించటం, కొందరినే పనికట్టుకుని ఏకాకిగా చేయటం వంటివన్నీ వర్క్‌ప్లేస్ వాతావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఉద్యోగుల మధ్య సహృద్భావం దెబ్బతినేందుకు ఇదంతా దారితీస్తుంది. ఇలాంటి వాతావరణంలో పనిచేయటం చాలా కష్టం.
నస పెట్టే బాస్: మీ బాస్‌లు ఎవరైనా ఒకటే నస పెట్టి, వేధిస్తూ, సూటిపోటి మాటలతో టార్గెట్ చేస్తున్నారంటే అలాంటి చోట పనిచేసే వాతావరణం లేనట్టే లెక్క. తమ కిందిస్థాయి ఉద్యోగులను ఇలా కాల్చుకు తినే అధికారులపై హెచ్‌ఆర్ డిపార్ట్మెంట్‌కు ఫిర్యాదు చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి బాస్‌లు తమ సబ్ ఆర్డినేట్స్ పై ఎప్పుడూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి, రేటింగ్ తక్కువ వచ్చేలా ప్రవర్తిస్తారు. తద్వారా మన కెరీర్‌లో మనం పైకి వెళ్లకుండా వారే అడ్డుకుంటారు.
మానసిక భారం: సహ ఉద్యోగులు పని చేయకుండా ఇతరులపై ఆ పని భారం పడేలా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ కుదురుగా, ప్రశాంతంగా చక్కగా ఉద్యోగం చేసుకోవటం కుదరని పని. ఇలాంటి చోట పని భారంతో పాటు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల క్రమంగా నైతికత లోపించేలా అక్కడి వర్క్ ప్లేస్ తయారవుతుంది.
ఎదుగుదల లేకపోతే: చక్కని వర్క్ ప్లేస్ అంటే ఉద్యోగులు ఎదిగేందుకు మంచి అవకాశాలు అందించే స్థలం అని చెప్పుకోవచ్చు. ఎదిగేందుకు అవకాశాలు, మన పనిని గుర్తించే పై అధికారులు లేకపోతే అలాంటి చోట పనిచేసి వృథానే. నాణ్యమైన పనితీరు ఉద్యోగుల్లో లోపించేందుకు ఇది ప్రధాన కారణం. కెరీర్‌లో గ్రోత్ లేని ఉద్యోగంలో ఉండి ఏం ప్రయోజనం. అందుకే వీలైనంత తొందరగా ఆ ఉద్యోగం మారేందుకు ప్రయత్నించండి.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్: వ్యక్తిగత జీవితం గాడి తప్పేలా మీ ఆఫీస్ పరిస్థితులు ఉన్నాయంటే అది మంచి వర్క్‌ప్లేస్ కాదని కచ్చితంగా భావించవచ్చు. మీ సెలవు రోజుల్లో లేదా మీరు లీవ్ పెట్టినప్పుడు కూడా మీకు పదేపదే మీ ఆఫీసు వారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారంటే మీకు వర్క్ లైఫ్ బ్యాలన్స్ లేనట్టే. దీంతో పాటు ఇంటికొచ్చినా రోజూ ఆఫీసు పనిని వెంట తెచ్చుకుంటున్నారంటే లేదా రోజూ సమయానికి మించి పనిచేస్తున్నారంటే, ఏడాదిలో కొన్ని రోజులు కూడా మీకు లీవ్ లభించటం లేదంటే మీరిక ఉద్యోగం మారాల్సిందే అని అర్థం.