Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనితా రావు... ఓ మాజీ ఎయిర్ హోస్టెస్. మంచి జీతం.. విలాస వంతమైన జీవితం.. కానీ ఇవేవీ ఆమెకు తృప్తినీయలేదు. మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏదో చేయాలనే తపన ఆమెను నిలవనీయ లేదు. అందుకే వెనుకబడిన, గ్రామీణ ప్రాంత మహిళలకు రుతు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు కృషిని ప్రారంభించింది. కేవలం అవగాహన కల్పించడం మాత్రమే కాదు.. రుతుస్రావం గురించి సమాజంలో నెలకొని ఉన్న మూఢవిశ్వాసాలను పారద్రోలేందుకు ప్రయత్నిస్తున్నది. దీని కోసమే 'సక్రియా' అనే సంస్థను కూడా ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు 10 వేల మంది మహిళలకు దీనిపై అవగాహన కల్పించింది. ఇంకా కృషి చేస్తూనే వుంది. దీనికోసం ఆమె చేసిన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి నేటి మానవిలో....
కర్ణాటకకు చెందిన అనితా రావు గ్రామాలు, వెనకబడిన ప్రాంతాలలోని మహిళలను రుతుస్రావం గురించి అవగాహన కల్పించేందుకు ఎంతో ప్రయాణం చేసింది. అలా ప్రయాణిస్తున్న క్రమంలో ఓ గ్రామంలో ఆమె 60 ఏండ్ల మహిళను కలుసుకుంది. ఆ వయసులోనూ ఆమెకు రుతుస్రావం అవుతూనే ఉంది. పైగా ఆ సమయంలో విపరీతమైన రక్తస్రావం అయ్యేది. అది అసాధ్యమని గ్రహించిన అనిత ఆమెతో తన సమస్యను ఆషా వర్కర్‌కు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. 15 రోజుల తర్వాత అనిత ఆమె కోసం కొన్ని చీరలు, పండ్లు, చెప్పులు, ప్యాడ్స్ తీసుకుని గ్రామానికి తిరిగి వెళ్ళింది, అయితే అప్పటికే ఆ మహిళ లేదు. నాల్గవ దశలో ఉన్న గర్భాశయ క్యాన్సర్‌తో ఆమె మరణించింది. ఆ సంఘటన అనితను కలచివేసింది.
ఓ అధ్యయనం ప్రకారం
రుతుస్రావం అనేది ఇప్పటికీ మనదేశమంతటా ఓ నిషిద్ధ విషయం. బయటకు చెప్పకూడని మాట ఇది. మూఢ నమ్మకాలు, ఆచారాలు, పేదలకు ప్యాడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల నెలసరి సమయంలో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. దాస్రా అనే ఓ స్వచ్ఛంధ సంస్థ 2014 నివేదిక ప్రకారం సానిటరీ న్యాప్‌కిన్‌లు దొరకక పోవడం, రుతుస్రావం గురించి కనీస అవగాహన లేకపోవడం, ఆ సమయం లో పరిశుభ్రత పాటించలేకపోవడం వల్ల సంవత్సరానికి దాదాపు 23 మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్య నుండి తప్పుకుంటున్నారు. ఇదే అధ్యయనం ప్రకారం రుతుస్రావం అవుతున్న తమ కుమార్తెలకు 70 శాతం మంది తల్లులు ఇదో మురికి పదంగా పరిచయం చేస్తున్నారని, కౌమారదశలో ఉన్న 71 శాతం మంది బాలికలకు రుతుక్రమం గురించి అసలు అవగాహనే ఉండడం లేదని తేలింది.
సొంత డబ్బుతో...
అత్యంత ప్రమాదకరమైన ఈ గణాంకాలే అనిత ప్రయత్నాలకు పునాది వేశాయి. దీనిపై అమ్మాయిలకు, మహిళలకు అవగాహన కల్పించడం కోసమే 2017లో 'సాక్రియా' అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. సక్రియాకు రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటి 'క్రియాశీల భాగస్వామ్యం', రెండు 'మంచి పని'. ఈ సక్రియా ద్వారా ఆమె బెంగళూరుతో పాటు కర్ణాటకలోని మారుమూల గ్రామాల్లోని వెనుకబడిన మహిళలు, పిల్లలకు చేరుకుంది. రుతు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తన సొంత డబ్బుతో ప్రతి నెల వారికి శానిటరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అంతే కాకుండా కార్పొరేట్‌లకు కూడా రుతు ఆరోగ్యం, సెల్ఫ్ డెవలెప్‌మెంట్ తరగతులు తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఆమె గ్రామాలతో సహా 119 కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వీటి ద్వారా 10,000 మందికి పైగా మహిళలు ప్రయోజనం పొందారు.
తమని తాము స్వీకరించాలి
ఓ సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన అనిత ఎయిర్ హోస్టెస్ కావడానికి ఎంతో పోరాడవలసి వచ్చింది. తన పోరాటంలో గెలిచి ఉద్యోగం సంపాదించింది. తన ఉద్యోగంలో భాగంగా 63 కి పైగా దేశాలకు వెళ్ళింది. ఇప్పుడు సక్రియా ద్వారా బెంగళూరు, కోలార్, బేలూర్, విజయపుర, నర్సపుర, ఇతర ప్రదేశాలకు వెళ్ళి అవగాహన కల్పించింది. ''వ్యక్తిగత వస్త్రధారణ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మహిళలు తమను తాము ఎలా స్వీకరిస్తారో అనే దానిపై వారి ఆత్మగౌరవం ఆధారపడి ఉంటుందని నేను భావిస్తున్నాను. దానిపై మహిళలకు అవగాహన కల్పించాలనే ఆలోచన కూడా వచ్చింది. మహిళలు తమ శరీరం ఎంతో విలువైనదిగా గుర్తించాలి'' అంటున్నారు అనిత.
నేను చేయగలిగింది చేస్తా
కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. ఈ అంశాల గురించి మరింత అవగాహన కల్పించ డానికి అనిత కార్పొరేట్‌లను, ఫ్యాషన్ పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత, దంత పరిశుభ్రత, దుస్తులు ధరించడం వంటి వాటి గురించి విసృతంగా ప్రచారం చేస్తున్నది. రుతుస్రావం గురించి ప్రచారం కోసం బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు అక్కడి ఉపాధ్యాయులు ఈ విష యాల గురించి ఆంగ్లంలో చెప్ప డానికి కష్టపడుతున్నారని ఆమె గ్రహించింది. ''నేను ప్రిన్సి పాల్‌ను కలిసి, విద్యార్థులకు ఆంగ్ల భాషతో అవగాహన కల్పిం చేందుకు సహాయం చేస్తా అని చెప్పాను. కాబట్టి నేను ఎక్కడైనా అవగాహన కార్యక్రమం పెట్టాలనుకుంటే వారం ముందే దాని గురించి ప్రాక్టీస్ చేస్తాను. నాకు చేతనైన సాయం నేను చేస్తాను'' అంటుంది అనిత. ఈమె విద్య, రుతు ఆరోగ్య అవగాహనతో పాటు, వికలాంగ పిల్లల్లోని ప్రతిభను సమాజానికి చూపించడానికి విద్యా పోటీలు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.
కోవిడ్-19 సమయంలోనూ
కరోనా మహమ్మారి సమయం లోనూ ఆమె పేదలకు శాని టరీ ప్యాడ్లను పంపిణీ చేయడం తో పాటు ఉత్తర కర్ణాటక లోని గ్రామీణ ప్రాంతాల్లో రుతు పరిశుభ్రత నిర్వ హణపై ఆన్‌లైన్ సెషన్లను చురుగ్గా నిర్వహిస్తోంది. ''గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి నెట్‌వర్క్ సమస్యలు ఉన్నాయి. నెట్‌వర్క్ బాగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నేను డిజిటల్ పద్దతిలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాను. నేను వెళుతున్న గ్రామాల్లో ప్రతి 20 ఇళ్లకు ఒక టెలివిజన్, రెండు కంప్యూటర్లు ఉన్నాయి. కాబట్టి భౌతిక దూరం పాటిస్తూ వారిని ఒక చోటకు చేర్చి సెషన్లు నిర్వహిస్తున్నాను. వాస్తవానికి కరోనా సమయంలో చాలా మంది భయపడి నన్ను తమ గ్రామాలకు రానీయకుండా అడ్డుకున్నారు'' అంటూ అనిత కరోనా సమయంలో తన అనుభవాలను పంచుకుంది.
సాక్రియా పీరియడ్ పాట్ అభియాన్
రుతుస్రావ సమయంలో ఉపయోగించే ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలని ఆమె కోరుకుంటుంది. రుతు కప్పులు, తిరిగి ఉపయోగించగలిగే ప్యాడ్లు, బయోడిగ్రేడబుల్ ప్యాడ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని ఆమె భావిస్తుంది. దీన్ని 'సాక్రియా పీరియడ్ పాట్ అభియాన్' అనే పేరుతో నడుపుతుంది. ''ప్లాస్టిక్ నీటి కాలుష్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ప్రారంభించిన ఈ చిన్న అడుగు మరింత ప్రేరణనిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే నా ప్రయత్నంలో భాగంగా కనీసం ఒక్క గ్రామంలోనైనా ప్లాస్టిక్ ప్యాడ్లు లేకుండా చేయాలనుకుంటున్నాను'' అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంగా చెబుతుంది అనిత. ప్రస్తుతం ఆమె అతి తక్కువ జనాభా కలిగిన నర్సాపురాలో ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది. మహిళలకు పునర్వినియోగ ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తుంది.
కనీస అవగాహన లేదు
గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో తాను చూసిన కొన్ని హృదయ విదారక సంఘటనలను పంచుకుంటూ ''గ్రామాల్లో చాలా మంది మహిళల వద్ద కనీసం ఒక జత లోదుస్తులు కూడా లేవు. కొంతమంది తాడులు, పొడి ఆకులు, సాదా వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ), వంధ్యత్వం, అండాశయం, గర్భాశయ క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దారితీస్తుంది. అందుకే వారికి డిస్పోజబుల్ లోదుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ దారుణమైన విషయం ఏమిటంటే దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలలో ఈ ఆరోగ్య ఉత్పత్తులపై కనీస అవగాహన లేదు'' అంటూ ఆమె ఆవేదన చెందుతున్నారు. అనిత తన కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఎవ్వరినీ సహాయం అడగలేదు. అయితే ఇప్పుడు ఆమె కార్యకలాపాలు మరింతగా విస్తరించాయి. అందుకే నిధుల కోసం ఎదురు చూస్తుంది. మరింత మంది మహిళలకు సాయం చేయాలంటే నిధులు అడగక తప్పదని భావిస్తుంది.
మనస్సాక్షిని కదిలించింది...
19 సంవత్సరాల వయసులో నేను చాలా విలాసాలను అనుభవించాను. ఖరీదైన హోటళ్లలో బస చేశాను. దీని కోసం చాలా డబ్బు ఖర్చు చేశాను. కానీ ఏదో నా మనస్సాక్షిని కదిలించింది. నావంతుగా సమాజానికి ఏదో చేస్తే తప్ప ప్రశాంతత ఉండదనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను కలిసి మాట్లాడుతున్న సమయంలో రుతు పరిశుభ్రత వంటి అత్యంత ప్రాధ మిక విషయాలపై కూడా వారికి అవగాహన లేకపోవడం బాధ కలిగించింది. రక్తస్రావం అయిన తర్వాత ప్యాడ్ మార్చుకోవడం అనేది ఓ సాధారణ ప్రక్రియ. కానీ ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. అది చూసినపుడే సక్రియా ప్రారంభించాలనే ఆలోచన కలిగింది.
- అనితా రావు