Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంచాలనుకుంది. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మాన్వాడ వద్ద నిర్మించిన మిడ్‌మానేర్ కట్ట పక్కన కొత్తపేట, కోదురుపాక, మాన్వాడ గ్రామాల శివార్లలో 40 వేల మొక్కల చొప్పున నాటాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీనిలో భాగంగా అక్కడ మొక్కలు నాటాల్సి ఉన్న సంబంధిత అధికారులు ఇప్పటివరకు 15 వేల మొక్కలను మాత్రమే నాటారు. మిగిలిన మొక్కలను అక్కడే పక్కన పడేశారు. అంతేకాకుండా నాటిన మొక్కలకు సైతం రక్షణ కల్పించలేదు. మరికొన్ని నీళ్లు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాతాన్ని పెంచాలనుకునే లక్ష్యం నెరవేరేలా కనబడటం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మిగిలిన మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలను రక్షించాలని పలువురు కోరుతున్నారు.
నవతెలంగాణ-బోయినిపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మాన్వాడ వద్ద నిర్మించిన మిడ్‌మానేరు కట్ట పక్కన హరితహారం కార్యక్రమంలో భాగంగా అధికారులు మొక్కలు నాటాల్సి ఉంది. అయితే మొక్కలు నాటాల్సిన సంబంధిత అధికారులు మొక్కలు నాటే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించి రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్‌మానేరు కట్ట పక్కన నాటిన మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించి రక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. అంతేకాకుండా నాటిన మొక్కల రక్షణకు గాను ట్రీగార్డులను కూడా ఏర్పాటు చేయలేదు. మరికొన్ని మొక్కలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మిడ్ మానేరు కట్ట పక్కన సంబంధిత అధికారులు మొక్కలు నాటారు కానీ రక్షణ మరిచారని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యాల ఛేదనలో విఫలం...
మిడ్ మానేరు పరిధిలో కొత్తపేట, కోదురుపాక, మనువాడ గ్రామాల శివార్లలో కట్ట పక్కన ఫారెస్ట్ కోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులకు ప్రభుత్వం 40 వేల చొప్పున మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే అందులో ఇప్పటి వరకు కేవలం 15 వేల మొక్కలను మాత్రమే నాటారు. మిగితా మొక్కలు నాటకుండా అక్కడే వదిలేశారు. నాటిన మొక్కలను రక్షించాల్సి ఉన్నా ఆ పనులు కూడా చేయడం లేదు.
నీరు లేక..ఎండుతున్న మొక్కలు
మిడ్ మానేరు కట్ట పక్కన నాటిన మొక్కలకు సరైన నీరు అందకపోవడంతో కొన్ని ఎండిపోతున్నాయి. అంతేకాకుండా సకాలంలో వర్షాలు కురువకపోవడంతో నాటిన మొక్కలను సంరక్షించే వారే లేకుండా పోయారు. అధికారులు మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకున్నారు. నాటిన మొక్కలకు నీరు అందించే చర్యలు కూడా తీసుకోవడం లేదు. మొక్కలను నాటి రక్షించడానికి ప్రభుత్వం వేలా రూపాయలను ఖర్చు పెట్టిన వృథాగానే పోతున్నాయని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
కట్ట మరమ్మతులో మొక్కల తొలగింపు
మిడ్ మానేరు కట్టపై మాన్వాడ గ్రామ శివారులో భోగం ఒర్రె వద్ద నాటిన మొక్కల చుట్టూ గడ్డి పిచ్చి మొక్కలు పెరిగింది. దీంతో కట్ట మరమ్మతులో భాగంగా జేసీబీతో మట్టిని తీస్తున్నారు. దీనిలో భాగంగా నాటిన మొక్కలను గుర్తించక కొన్ని మొక్కలు ఆ మట్టితోనే తీసేస్తున్నారు. ఫారెస్ట్ కోసం ఎంతో ఖర్చుపెట్టి మొక్కలు నాటిన ఆ మొక్కలు మట్టిలో కలిసిపోతున్నాయి.
అమర్చని ట్రీగార్డ్స్
మిడ్ మానేరు కట్ట పక్కన కేవలం 15వేల మొక్కలు నాటిన వాటికి అధికారులు ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. వాటి రక్షణకు ట్రీగార్డ్స్ అమర్చాల్సి ఉన్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొక్కకు ట్రీ గార్డ్ లేకపోవడంతో కట్ట పక్కన పోయే మేకలు, గోర్లు వంటి జంతువులు మొక్కల ఆకులు తింటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరందించడంతో పాటు ఆ మొక్కలకు ట్రీ గార్డ్స్ అమర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలి
వేలా రూపాయాలు ఖర్చు పెట్టి నాటిన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా వాటర్ ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లు అందిస్తే బతుకుతాయి. నాటిన ప్రతి మొక్కకూ ట్రీగార్డు ఏర్పాటు చేసి రక్షిస్తేనే ఫారెస్టు ఏర్పడుతుంది. అధికారులు వాటిపై శ్రద్ధ చూపాలని కోరుతున్నాను.
బాల్‌రెడ్డి, నిలోజిపల్లి, గ్రామస్తుడు