Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కారుకు ఊహించని షాకిచ్చారు. ఎన్నికల్లో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్నిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వరుసగా క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో ఆయన పర్యటించారు. తొలి పర్యటనలో ఆయన సంచలన నిర్ణయాలను ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల సేవల వినియోగం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెట్టనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లే దగ్గరి నుంచి అధికార పక్షానికి సహకరించారని ఫిర్యాదులు చేశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల తరఫున ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని బెదిరించకూడదని తెలిపారు. ఓటర్ స్లిప్పులను కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దన్నారు. వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించారు. ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగిస్తే కోడ్ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్లు దైనందిన విధులు నిర్వహించడంలో అభ్యంతరం లేదన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఐదుకు మించి సభ్యులు ఉండకూడదని నిబంధన పెట్టారు. ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టాలని ఎస్ఈసీ ఆదేశించారు.