Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారుల కోసం ఓ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ గానీ, ల్యాండ్‌లైన్ కనెక్షన్ గానీ తీసుకున్న వారికి 4జీ సిమ్‌లను ఉచితంగా అందిస్తోంది. ఈ 4జీ సిమ్ కార్డులను ఉచితంగా ఇస్తున్న స్కీంను గతవారం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ లేదా ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఫ్రీ సిమ్ పొందేందుకు వీలుంది. ఈ ఫ్రీగా అందించే సిమ్ 75 రూపాయల ప్లాన్ ఓచర్‌తో వస్తుంది. 100 నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు 2 జీబీ డేటాను 60 రోజుల పాటు ఆస్వాదించవచ్చు. వినియోగదారులను ఆకట్టుకుని సిమ్ కార్డ్స్ సేల్స్‌ను పెంచుకోవడానికే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు టెలికాం నిపుణులు చెబుతున్నారు. టెలికాంలో గతంలో ఓ వెలుగువెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం ఆ స్థాయిలో లేకపోవడం గమనార్హం. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తర్వాత స్థానాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ ఉంది. టెలికాం రంగంలో నాలుగో స్థానానికి పడిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్ మెరుగుపడేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగడంతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ తీసుకున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. బీఎస్‌ఎన్ఎల్ కూడా ‘భారత్ ఫైబర్’ పేరుతో రూ.499 నుంచే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ‘భారత్ ఫైబర్’ ప్లాన్స్‌కు ఆశించిన స్పందనే వచ్చింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కొత్త కనెక్షన్స్ ఎక్కువగా తీసుకున్నారు.