Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా దన్నుతో జరిగిన సైనిక తిరుబాటు కారణంగా అధ్యక్షుడు ఇవో మొరేల్స్ ఆదివారంనాడు రాజీనామా చేశారు. ఆ తరువాత మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందిన నేపథ్యంలో దక్షిణ అమెరికాలో అత్యంత పేద దేశమైన బొలీవియాలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. బొలీవియా కార్మికులు, రైతులు, గిరిజనులు సాయుధ బలగాలను, ఫాసిస్టు మూకలను ఎదుర్కొంటున్నారు.
మిలిటరీ తిరుగుబాటును వేలాది మంది కార్మికులు, యువత సాహసోపేతంగా ప్రతిఘటించారు. రాజధాని లా పాజ్‌లోను, కార్మికవర్గం బలంగావున్న పొరుగునవున్న ఎల్ ఆల్టోలోను సైన్యంతో వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాలలో రైతులు, గని కార్మికులు హైవేలపై అడ్డంకులను పెడుతున్నారు. సైన్యం అనేకచోట్ల కాల్పులు జరుపుతోంది. కోచమ్‌బాంబాలో సైన్యం హెలీకాప్టర్ నుంచి కాల్పులు జరిపింది. మొత్తం మీద సైన్యం జరిపిన కాల్పులలో మరణించినవారి సంఖ్య పెరుగుతూ ఉన్నది.
మిలిటరీ, పోలీస్‌హింసతో పాటు మొరేల్స్‌కు వ్యతిరేకులైన ఫాసిస్టుశక్తులు చెలరేగిపోతున్నాయి. ప్రభుత్వ మద్దతుదారుల ఇండ్లను తగలబెడుతున్నారు. ప్రభుత్వాధి కారుల కుటుంబ సభ్యులను అపహరిస్తున్నారు. గిరిజనులను ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. సామాజిక సంస్థల కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అక్టోబర్ 20న జరిగిన అధ్యక్ష ఎన్నికను వివాదాస్పదం చేస్తూ మూడువారాల పాటు జరిగిన నిరసన ప్రదర్శనలు అంతిమంగా ఆదివారంనాడు సైనిక తిరుగుబాటుగా పరిణమించాయి. సైనిక దళాల చీఫ్ జనరల్ విలియమ్స్ కాలిమన్, తన యావత్తు మిలిటరీ సహచరులతో కలిసి ఇచ్చిన ఒక టెలివిజన్ సందేశంలో 'బొలీవియాలో శాంతి, సుస్థిరతల స్థాపనకు అధ్యక్షుడిని రాజీనామా చేయమని సూచించాం' అని పేర్కొన్నారు. 'రక్తపాతం జరగకుండా' చూడటానికి, 'శాంతిని పరిరక్షించటానికి' ఈ 'సూచన'ను మొరేల్స్ అంగీకరించారు.
మొరేల్స్ అధ్యక్ష పాలనని సైనిక తిరుగుబాటుతో కూలదోసిన తరువాత అమెరికా అధ్యక్షుడి ఆనందానికి అవధులు లేవు. మొరేల్స్‌ని పదవీచ్యుతుడిని చేయటం 'పశ్చిమార్థగోళంలో ప్రజాస్వామ్యానికి మరపురాని క్షణం' అని అంటూ తరువాత పనిపట్టబోయేది వెనెజులా, నికరాగ్వాలనేనని ఆయన హెచ్చరించాడు. ట్రంపే కాదు అమెరికాలో అత్యంత ప్రాచుర్యం గల రెండు పత్రికలు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు మంగళవారంనాడు బొలీవియాలో జరిగిన సైనిక తిరుగుబాటును సమర్థిస్తూ సంపాదకీయాలను ప్రచురించాయి.
లాటిన్ అమెరికాలో తన సామ్రాజ్యవాద విధానాన్ని అమెరికా కొనసాగిస్తున్నదన్న వాస్తవాన్ని బొలీవియా సైనిక తిరుగుబాటు ప్రతిబింబిస్తోంది. ఈ విషయంలో పాలకులు రిపబ్లికన్లా లేక డెమొక్రట్లా అనే తేడాలేదు. 2002లో బుష్ మద్దతుతో వెనెజులాలో హుగో చావెజ్ మీద సైనిక తిరుగుబాటు జరిగిన(ఈ తిరుగుబాటును విజయవంతం కాకముందే టైమ్స్ సంబరాలు చేసుకుంది) దగ్గరనుంచి 2009లో ఒబామా మద్దతుతో హౌండురాస్‌లో మాన్యుయెల్ జెలాయా ప్రభుత్వాన్ని కూలదోయటందాకా, ఆ తరువాత నేడు ట్రంప్ మద్దతుతో మొరేల్స్ ప్రభుత్వాన్ని కూలదోయటం వరకూ లాటిన్ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాద విధానం కొనసాగుతూనే ఉన్నది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై క్షీణిస్తున్న అమెరికా ఆధిపత్యాన్ని పున్ణప్రతిష్టింపజేయటానికే అమెరికా తన సామ్రాజ్యవాద విధానాన్ని సైనిక హింసతో కొనసాగిస్తోంది. తన 'స్వంత పెరడు'గా భావిస్తున్న లాటిన్ అమెరికాలో ఈ విధానం మరింత క్రూరంగా అమలవుతోంది. లాటిన్ అమెరికా వనరులు, మార్కెట్లపైనా, ఈ సందర్భంలో బొలీవియాలోని అపార ఇంధన, ఖనిజ వనరుల కోసం ముఖ్యంగా ప్రపంచంలో 70శాతంగా వున్న లిథియం కోసం అమెరికా సామ్రాజ్యవాద ప్రోద్బలంతో బొలీవియాలోని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసింది. చైనాతో లాటిన్ అమెరికా వాణిజ్యం గత సంవత్సరం రూ.21,42,000కోట్లు చేరుకోవటం అమెరికాకు కంటగింపుగా ఉంది.
1998లో లాటిన్ అమెరికాలో హుగో చావెజ్‌తో మొదలయిన 'బొలీవరియన్ విప్లవ క్రమం'లో భాగంగా మొరేల్స్ ప్రభుత్వం ఏర్పడింది. 2000-2005 మధ్యకాలంలో నీటిని ప్రయివేటీకరించటానికి వ్యతిరేకంగా, గ్యాస్‌ని జాతీయీకరించాలని జరిగిన ప్రజా ఉద్యమాలతో మొరేల్స్ అధికారంలోకి వచ్చారు. అంతకుముందు ఆయన కోకో గ్రోయర్స్ సంఘానికి నాయకుడిగా ఉన్నారు. ఆయన గిరిజనుల నుంచి ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు.
ఇటీవల కాలంలో లాటిన్ అమెరికాలో వివిధ దేశాలలో ప్రజాస్వామికంగా ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాలను వరుసగా కుట్రపూరితంగా అమెరికా దన్నుతో కూలదోయటాన్ని చూస్తుంటే ఒక విప్లవ పార్టీ సారథ్యంలో క్రాంతి పథాన్ని నిర్మించిన క్యూబా మార్గంలో మాత్రమే వామపక్ష ప్రభుత్వాలు మనగలుగుతాయనే గుణపాఠాన్ని బొలీవియా మరోసారి లాటిన్ అమెరికా ప్రజల ముందు ఉంచింది.