Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నది. ముఖ్యమంత్రి మంకుపట్టు వీడలేదు. హైకోర్టు సూచనలేవీ ఖాతరు చేయటం లేదు. సమస్యల పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేద్దామన్న హైకోర్టు తాజా సూచన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. యూనియన్ల జేఏసీ మాత్రం తమ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారి స్థాయి కమిటీ ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కాజాలవనటం అర్థరహితం. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం అలాంటి కమిటీ వేసే అవకాశం కూడా లేదనటం నిజం కాదు. ఆ చట్టంలోని సెక్షన్ 10(ఎ) ప్రకారం యూనియన్లు, యాజమాన్యం అంగీకరిస్తే మధ్యవర్తి పరిష్కారానికి అప్పగించవచ్చు. ఇప్పుడు హైకోర్టు సూచించిన 'సుప్రీం' రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీ అలాంటిదే కదా! పైగా ఆషామాషీ వ్యక్తులతో కాదు. అత్యున్నత స్థాయి న్యాయ కోవిదులతో మధ్యవర్తిత్వాన్ని కూడా తిరస్కరించటమంటే పాలకుల తొండి వైఖరి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
కార్మికశాఖ ఆధ్వర్యంలో చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని కూడా ప్రభుత్వం చెప్పటం ఆశ్చర్యకరం, హాస్యాస్పదం. కార్మికశాఖ అధికారులు అంత బాధ్యతగా వ్యవహరిస్తే సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 34రోజులు ఎందుకు చర్చలకు పిలవలేదు? నిద్రపోయారా? కానే కాదు.. జరుగుతున్న పరిణామాల క్రమం గమనించిన వారెవరికైనా అసలు విషయం అర్థం కాక మానదు. పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే కార్మికశాఖ ఆ పనికి ఉపక్రమిస్తుంది కదా! ఆ 34రోజులు ఆర్టీసీ సమ్మె నోటీసును మించిన ప్రాధాన్యత గల అంశాలేవీ కార్మికశాఖ ముందులేవు. అయినా సమ్మె పరిస్థితి రాకుండా సయోధ్య కుదిర్చే ప్రయత్నాలూ చేయలేదు. కేవలం సమ్మెకు ఒక రోజు ముందు చర్చలకు పిలిచి, చర్చలు ప్రారంభమైనట్టు తంతు నడిపారు. ఇక్కడ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నమే జరగలేదు కదా! పైగా ప్రభుత్వం మరో ప్రమాదకర వాదన వినిపించింది. ప్రజోపయోగ సర్వీసులన్నీ ఎస్మా కిందికి వస్తాయని కొత్త భాష్యం చెప్పింది. ఇది నిరంకుశ ధోరణి. ఈ వాదన చేయటమంటే ఆర్టీసీ కార్మికులకు శాశ్వతంగా సమ్మె హక్కులేదని చెప్పటమే. ఈ వాదనను అంగీకరిస్తే ఇక ప్రజోపయోగ సర్వీసులు కానివిగా ఎన్ని మిగులుతాయి? ఇది రాష్ట్రంలో సమ్మె హక్కుమీదనే దాడి. ఇది కేవలం ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సంబంధించిన విషయం కాజాలదు. పైగా పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి వచ్చే ఆర్టీసీ కార్మికులకే సమ్మె హక్కు నిరాకరిస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల హక్కుల సంగతేమిటన్న ప్రశ్న ముందుకొస్తోంది.
పారిశ్రామిక వివాదాల చట్టం ఆధారంగా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. మంచిదే! కానీ ఆ చట్టాన్నే ముఖ్యమంత్రీ, రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వం పాటించదు కానీ కార్మికులు పాటించాలంటున్నారు. ఈ చట్టం ప్రకారం గుర్తింపు సంఘంతో యాజమాన్యం చర్చించి తీరాలి. చర్చలకు నిరాకరించటం చట్టాన్ని ఉల్లంఘించటమే. అది కార్మిక వ్యతిరేక చర్య. అయినా ముఖ్యమంత్రి చర్చలకు మొండిగా నిరాకరిస్తున్నారు. ఒక పథకం ప్రకారం కార్మికులను సమ్మెలోకి నెట్టి తన ప్రయివేటీకరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. సమ్మె ప్రారంభించగానే యాభైవేల మంది కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తున్నామని ప్రకటించారు. తొలగించే అధికారం ముఖ్యమంత్రికి, పారిశ్రామిక వివాదాల చట్టంలో ఏ క్లాజు ప్రకారం ఉన్నదో చెప్పజాలరు. మరుసటి రోజు మరో తప్పు చేసారు. కార్మికులు సమ్మెలో చేరటం ద్వారా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్నారు. కనీసం ఇదైనా చట్టంలో ఎక్కడున్నదో చెప్పలేదు. ఐడీ చట్టమే కాదు, మరే కార్మిక చట్టంలోనైనా ఉన్నదేమో చెప్పజాలరు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న నేత ఇంత బాధ్యతారహిత ప్రకటనలు చేయడాన్ని ఏమనుకోవాలి. అంతే కాదు, చర్చలకు నిరాకరించటం ద్వారా ఇతర ప్రయివేటు పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఏమి సందేశం ఇవ్వదలిచారో అర్థం కాదు. పారిశ్రామిక అశాంతిని నివారించి, ఉత్పత్తిని పెంచడానికే, సేవలు నిరంతరం అందించడం కోసం పుట్టిందే పారిశ్రామిక వివాదాల చట్టం. ద్వైపాక్షిక చర్చలూ, త్రైపాక్షిక చర్చలూ, మధ్యవర్తి పరిష్కారాలన్నీ ఇందుకోసమే కదా! ఆ చట్టాన్నే సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఖాతరు చేయకపోతే ఇక ప్రయివేటు యాజమాన్యాలు ఖాతరు చేయవు కదా! ఇది అంతిమంగా పారిశ్రామిక అశాంతి పెరగడానికే దారి తీస్తుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
చట్టపరమైన మార్గాలన్నీ తోసిపుచ్చుతున్నారు. న్యాయస్థానం సూచనలూ నిరాకరిస్తున్నారు. తప్పుడు లెక్కలతో కోర్టునే పక్కదారులు పట్టించే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యారు. సమ్మె హక్కులేదని చెప్పడానికి కాలం చెల్లిన జీవోలూ, టీఎస్ ఆర్టీసీకి వర్తించని ఆదేశాలూ చూపించేందుకు ప్రయత్నించారు. కోర్టు తిరస్కరించటంతో తెల్లముఖం వేసారు. ఇంత జరిగినా ఆర్టీసీ కార్మికులను శత్రువులుగానే పరిగణిస్తున్నారు. శత్రుపూరితంగానే వ్యవహరిస్తున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చేయవల్సిన పనికాదు. ఇకనైనా చర్చల ద్వారా పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధపడాలి.