Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సౌధంలో
తలుపుకు చెదలెక్కేటట్టుంది
గోడల లోలోపల
తడి విస్తరిస్తూ వుంది
పై కప్పులు పగుల్లబారి
నీళ్ళుట్టుతున్నై
రాజ్యంల ఒడ్లన్నీ
పందికొక్కుల పాలాయె
సాయమానుల పెంకలు చిట్టి
పొట్కువెడ్తుంది
దేవునర్రల మూలదైవం
వరాలిస్తదా తీసుకుంటదా
ప్రగతి సౌధం
ఉంటదా ఉడ్తదా
గెలవక ముందు
సామాన్యులందరినీ
సైన్యం జేసిన యోధుని
మాటలెంత తియ్యగా ఉండేవి
రాజైనంక నాలుక
మర్లబడ్డదా
కుర్చీ దొర్కంగనే
ముడ్లె అర్శెలు మొలిచినయా
మనిషిలా భూమ్మీదనే వుండనుకున్నంగని
మిగిలిన శరీరమంతా
ఆకాశంలో వున్నమాట
మర్చిపోతిమి
000
అసెంబ్లీ ఇంకా కూలలే
కౌన్సిల్ పెద్దర్వాజాలింకా
విరిగిపడలే
సచివాలయం ఒకటే
ఇచ్చల్లయింది
పట్టపగలే బ్లాకులు
రహస్య మంతనాలాడుతున్నై
పూలమొక్కలన్నీ
తోట నుంచి పీకి
గట్ల మీద పడేసినట్లుంది
తోటనెప్పుడు
తొవ్టం బెడ్తరు
పీకిన మొక్కలెప్పుడు
తిరిగి నాట్తరు
అక్కడి నుండి వైదొలిగాక
నగరంలో ఒక
సముద్రముందని తెల్సింది
తట్టాబుట్టా సర్దుకున్నాక
హుస్సేన్‌సాగర్
కెరటాలు ముడుచుకున్నై
ప్రభుత్వాలే కాదు
కార్యాలయాలూ
శాశ్వతం కావని అర్థమయింది
ఎటు బయటికెళ్తే
అటు రోడ్డు ఎదురొచ్చేది
ఏ రోడ్డెక్కినా
ఆర్టీసీ స్వాగతం పలికేది
000
కాలం నెత్తిమీదికొచ్చింది
డియ్యేకూ
డిమాండు చేయాల్సి
వచ్చేటట్లుంది
ఐ ఆర్ అంటే ఏందని
మహారాజు
అడుగుతున్నట్టుండు
ఐదేండ్లకోసారి
పీఆర్సీ ఎందుకియ్యాలె
ఈళ్ళేమన్నా ఓట్లేస్తరా
అంటున్నట్టుండు
ఎక్కువ నీల్గితే
బతుకులు
ఆర్టీసీ జేద్దామంటుండు
నవ్వినోని ముందు
బోర్లబడ్డట్లయింది
ఇకనైనా
మత్తువదలకపోతే
భయం పొరలు
తొలగించుకోకపోతే
కొత్తనాయకత్వాన్ని
సృష్టించుకోకపోతే
ప్రత్యేక కలల అద్దం
భళ్ళుమనడం ఖాయం
- నరుడు