Authorization
Mon Jan 19, 2015 06:51 pm
poetry is the spontaneous overflow of powerful feelings. it takes its origin from emotion recollected in tranquility
- wiliam wordsworth
కవిత్వం శక్తివంతమైన భావాల ప్రవాహం. మనిషిలో సహజంగా కలిగే భావోద్వేగాలు, ఎమోషన్స్ సమాహారమే కవిత్వం అంటారు విలియం వర్డ్స్ వర్త్.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కవికి ఈ వాక్యాలు సరిగ్గా సరిపోతాయి.. చిత్తలూరి ఈ పేరుకు పరిచయమే అక్కరలేదు. ఆయన పేరు కంటే ముందే ఆయన కవిత్వం లోకాన్ని చుట్టి వస్తుంది. ఈ మాట ఎందుకన్నా నంటే కరోనా సంక్షోభ సమయంలో పాఠశాలలు మూత బడ్డాయి. వత్తిరీత్యా ఆంగ్ల ఉపాధ్యాయుడైన చిత్తలూరి ఏ అంశాన్నైనా క్షణాల్లో కవిత్వం చేయగల సమర్థుడు. ఆయన పాఠశాల అంశంపై ''అమ్మా బడికేమైంది'' అనే కవిత రాశారు. అది అన్ని వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో హల్చల్ చేసింది.. సహజత్వం ఉట్టిపడే కవితకు పేరు, ఊరుతో సంబంధం లేదు అనే విషయాన్ని ఈ కవిత నిరూపించింది. ఇలాంటి ఎన్నో అంశాల్ని ఆయన కవిత్వం చేశారు. కరోనా కాలాన్ని అక్షరాల్లో ఎంత చక్కగా పొందుపరిచారు.
ఆదిత్య 369 సినిమాలో ఒక సైంటిస్ట్ తాను తయారు చేసిన టైం మిషన్ ద్వారా హీరో హీరోయిన్లు రకరకాల కాలాలకు ప్రయాణించినట్టు ఇక్కడ మన మాస్టర్ సైంటిస్ట్ కూడా ఒక సంక్షోభ కాలాన్ని పుస్తక రూపంలో రికార్డు చేశారు. రాబోయే తరాల వారెవరైనా కరోనా కాలానికి వెళ్లేందుకు వీలుగా ఈ అక్షరాలా ద్వారా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు ఆ పుస్తకమే ''మనిషి అలికిడి లేక''. ఇందులో ఏ కవితకు ఆ కవిత ప్రత్యేకమే.. సహజ కవికి ఉండాల్సిన లక్షణం కాలమాన పరిస్థితులకు త్వరగా స్పందించడం.. కనిపించే, కదిలించే ఏ అంశాన్నైనా క్షణాల్లో కవిత్వం చేయడమే.. ఆ లక్షణం ఈ కవిలో చాలా ఎక్కువ. అక్షరాలా గురించి, వాక్యాలు గురించి, పదాల గురించి తడుముకోవాల్సిన అవసరం లేకుండానే రాసేస్తారు.
కరోనా కాలంలో మనిషితనం చచ్చిపోయింది. ఎవరిళ్ళకు వాళ్ళు తాళాలేసుకున్నారు. ముఖాలకు మాస్కులు పడ్డాయి. దాంతో మాస్కు కింద వున్న ముఖం ఎవరిదో తెలియదు. అందరూ దూరం దూరంగా, ఎవరికీ ఏమీ కాకుండా, సహజత్వం లేకుండా, స్వేచ్ఛ లేకుండా వున్న పరిస్థితిని కవిత్వం చేశారు.. ''నాకో ముఖం కావాలి'' అనే శీర్షికతో ''ఏ ముఖం ఎవరిదో తెలియకుండా / అనేకానేక మాస్కులు తొడుక్కున్న / ఇన్ని ముఖాల మధ్య / ఏ మాస్కు లేని స్వచ్ఛమైన తేట నీటి లాంటి / పారదర్శకమైన అద్దం లాంటి / ఒక మానవ ముఖం కావాలి / నాకో ముఖం కావాలి'' అంటూ నర్మగర్భంగా కవితను నడిపించిన విధానం చాలా బాగుంది.
కరోనా కాలంలో కుటుంబాలకు కుటుంబాలు ఇళ్లల్లో బందీలయ్యారు. ఏళ్లకేళ్లు అమ్మ, నాన్న, పిల్లలు తలో దారై, ఎటు పోతున్నామో తెలియని సందర్భంలో కరోనా అందరినీ కలిపింది అనుకున్నాం. కాస్త స్వేచ్ఛ లభించిందని సంబరపడ్డాం.. కానీ ఇళ్లల్లో స్త్రీలకు మాత్రం అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అసలు స్వేచ్ఛ పోయి ఇల్లే జైలైందని అనుకోని వారు లేరు. ముఖ్యంగా వంట గదికి స్వేచ్ఛ పోయింది. ఏం కరోనానో ఏమో వండి పెట్టలేక, ఇళ్లన్నీ తుడుచుకోలేక చస్తున్నాం అని అనుకోని మహిళే లేదంటే అతిశయోక్తి లేదు.. ఆ అంశాన్నే కవిత్వాన్ని చేశారు.. ''శ్రమల జైలు'' అనే శీర్షికతో రాసిన కవితలో ఎన్నో అద్భుత వాక్యాలున్నాయి.. ''కడిగిందే కడిగి / ఊడ్చిందే ఊడ్చి / తోమిందే తోమి / చిమ్మిందే చిమ్మి / ఇంటిని అద్దంలా చేసే యుద్ధంలో / మాదెప్పుడూ రాజు లేని రాణి ఒంటరి పోరాటమే / గడప దాటని ఈ యుద్ధంలో కూడా / కాలు బయట పెట్టలేని ఈ నిర్బంధంలో కూడా / మా స్వేచ్ఛ ఎప్పుడూ వంటింటి పంజరంలో చిలకలా ఎగరడమే'' ఎన్ని పనులు చేసినా అందులో కనీసం వేలు పెట్టక పోగా అది చెయ్యి, ఇది చెయ్యి అని హుకుంలు జారీ చేయడంతో మహిళలు వంటగదిలోని ఎలా మగ్గి పోయారో తేలికైన పదాలతో అందరికీ అర్థమయ్యేలా చాలా సులువుగా చెప్పారు కవి ఈ కవితలో... మహిళా లోకం అంతా మెచ్చదగిన ఒక అద్భుత కవిత అని చెప్పొచ్చు.
ఇక టైటిల్ పేజీ కవిత విషయానికి వస్తే ''మనిషి అలికిడి లేక'' ఏ వైరస్ ప్రపంచాన్ని కుదిపేసినా ప్రకతి సహజత్వాలన్నీ వాటి పని అవి చేసుకుపోతూనే వుంటాయని చాలా చక్కగా, చిక్కగా చెక్కిన అందమైన కవిత ఇది. ఇందులో కొన్ని వాక్యాలు నన్ను తడుము తుంటాయి.. నాకే కాదు చదివిన వారిని కూడా అవును కదా, నిజమే అని అనిపించేలా ఉంటాయి.. ''మనిషి అలికిడి ఎక్కడా కనిపించదు / ఐనా చెట్టు విరగ బూస్తూనే ఉంటుంది / పూలు పూస్తూనే ఉంటుంది చెట్టు / పూసిన పూలతో నేలను కప్పెడుతుంది గాలి / కోసే చేతులేవీ కనిపించవ్''.. అంటూ ఆయన హదయాన్ని ఈ కవితలో చక్కగా ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో ఒక్కోటి ఒక్కో మాస్టర్ పీస్.. కొన్ని కవితలోని ఆర్ద్రమైన వాక్యాలు పరిశీలిస్తే కవి హదయం ఎంత గాయపడితే ఇంత అద్భుత వాక్యాలు రాశాడా అనిపిస్తుంది. రెక్క తెగిన గాయం కవితలో చూస్తే- నేల పచ్చి పుండులా వుంది / మొలకెత్తేవి గాయాలా / విత్తనాలా అనే సందేహ నివత్తిలో పడింది..అమెజాన్ నుంచి నల్లమలదాకా అనే కవిత బహుళ జాతి కంపెనీల మీద ఎక్కుపెట్టిన బాణం- మీ బహుళ జాతి కంపెనీల దాస్టికాలలో/ నా గుండెల్ని మందుపాతరలు పెట్టి పేల్చేస్తూనే వున్నారు'' అంటారు కవి. ఇక అందరూ నచ్చే మెచ్చేది అమ్మా బడికేమైంది కవిత చాలా సహజంగా ఎవరూ చెప్పలేరనిపిస్తుంది. అందుకే ఈ కవిత నాది, నాది అనుకున్న వారందరికీ దగ్గరయింది ప్రపంచాన్ని చుట్టొచ్చింది... బడికేమయ్యిందో భయంగా వుందే/ ఒక్కసారి బడికెళ్ళి పలకరించి వస్తానే/ అమ్మ బడికేమ య్యిందమ్మా / గంట గంటకూ గంట గొంతెత్తి పిలిచే బడి నోరు / ఇంత గానం మూత పడిందేంటి ? అమ్మా బడికేమయ్యింది''.. అంటూ పాఠశాలను అందమైన కవితా శిల్పంగా చెక్కారు. చెట్టు, పుట్టా, గొడ్డు, గోదా, మనిషి, పుస్తకం, నెమలీక, అమ్మా నాన్న, సీతాకోక చిలుక ఇలా చెప్తూ పొతే అన్ని అంశాల్ని కవిత్వం చేశారు .. బడిని పలకరించేవాళ్ళు లేని సమయంలో బడికి కూడా గొంతిచ్చిన వ్యక్తి చిత్తలూరి..
చిత్తలూరి అంటే రకరకాల ప్రక్రియల సమాహారం. కథ, కవిత, లూరిలు, నానీలు, రెక్కలు, ఒక్కటి కాదు.. కవిత్వం చేయని వస్తువులేమన్నా ఉన్నాయా ఈ కవికి అని పాఠకుడికి అనిపించేలా అన్ని ప్రక్రియలను తడుముతాడు.. ఈ కవి రాసిన కవితలు కన్నడంలోకి అనువాదమయ్యాయి.. అలాగే ప్రముఖ కవుల కవితలను ఆయన తెలుగులోకి స్వేచ్ఛానువాదం కూడా చేసి పాఠకులకు అందించారు.. కాలంతో పాటు పరిగెత్తే కవికి ఎప్పుడూ ఎక్కడా అలుపు, అంతం ఉండదు... మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎలాగూ ఎండాకాలం వస్తోంది.. ఈ పుస్తకాన్ని కొని, చదివి, చల్లని అక్షరాల మధ్య సేదదీరండి.. ఈ పుస్తం యొక్క కాపీలు దొరికే చోటు..
- అమూల్యచందు,
9059824800