Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడియారపు ముల్లు
కాలాన్ని కండె చుట్టుకుపోతూనే ఉంది
ఊపిరాడక నాలో నేను
ఉండ చుట్టుకుపోతూనే ఉన్న
ఈ రణగొణ ఉక్కపోతల నడుమ
రండి మిత్రులారా!
నిర్మానుష ఏకాంతంలోకి
చెట్లు, గుట్టలు విరివిగా పూసే తావులోకి
తొడిమెకు అంటుకున్న పూరేకుల్లా
ముగ్గురమో, నల్గురమో సమూహమౌదాం
నిర్బంధాలకు తావులేని
ఒక ప్రత్యేక ఎజెండా రూపొందించుకుందాం!
విన్నవో చూసినవో
కొన్ని ముచ్చట్లను నంజుకుందాం!
సీతాకోకచిలుక రెక్కలకంటిన
పుప్పొడిని రాల్చుకున్నట్లుగా
అహాలను అసూయలను రాల్చుకుందాం!
నవ్వు అంటరానిదైన చోట
ఒకరికొకరం స్వేచ్ఛగా
నవ్వుల పరిమళాలను పంచుకుందాం!
మొగ్గలా వచ్చిన మనం
పువ్వులా విచ్చుకునే వరకు
రోజులో కొన్ని క్షణాలను
ఇలాగే గడిపేద్దాం!
- వడ్లకొండ దయాకర్,
9440427968