Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్దిపేట కవులలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు నవ్య సంప్రదాయ కవి శ్రీమాన్ వేముగంటి నరసింహాచార్యులు. వీరు నడుస్తున్న పద్యకవిగా తను జీవిస్తున్న కాలంలోనే ప్రఖ్యాతి గడించారు. మరో విఖ్యాత కవి నందిని సిద్ధారెడ్డి గారు. వీరువురితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. కవి సమ్మేళనాల్లో కలసి కవిత్వం చదివాను. ఇలా ఇద్దరు ప్రతిభావంతులైన కవులు పుట్టిన నేల మీద కలం పట్టిన వాడు మా సిద్దెంకి యాదగిరి. తెలంగాణ కవితాఝరి.
నిబద్ద కవులు ఆర్తితో జీవిస్తారే తప్ప కీర్తి కోసం కక్కుర్తిపడరు. ఇది సుకవుల లక్షణం. అలాంటి నిజాయితీ ఉన్న నిబద్ధ కవి యాదగిరి. ఇది ప్రాచీన కవికైనా ఆధునిక కవికైనా అన్వయిస్తుంది. 'మా తొవ్వ', 'బతుకు పాఠం' ఈ రెండు కవితా సంపుటాల్లో యాదగిరి కవితాత్మ ప్రతిబింబిస్తూ ఉంటుంది.
నాకైతే అతడి అక్షరాల వెనుక అమాయకత్వమే కనిపిస్తుంది. విద్యావంతుడైన యాదగిరి కవితా ప్రస్థానం చిన్నది కాదు. అనుకుంటే ఆకాశమంత. కొల్చుకుంటే భూదేవంత. ఈ వాక్యము సిద్దెంకికే కాదు వేల సంవత్సరాల వేదనలోంచి, అంటరానితనంలోంచి అక్షరాల కవులు గాయకులు కళాకారులు అయిన ప్రతి దళిత జీవికీ మాటలు సరిపోతాయి. కులం లేదని చాలా మంది గొడవ పడతారు కానీ సురవరం వారు రూపొందించిన 'గోలకొండ' కవుల సంచిక అందులోని సంఖ్యలు సరిపోల్చి చూడండి. అసలు నిజం బయట పడుతుంది. ప్రతాప రెడ్డి గారి గణాంకాలు ఈ నాటికీ వర్తిస్తాయి. ఆ కోణంలోంచి చూసినప్పుడు తెలంగాణలో ముఖ్యంగా అతి దళిత మాదిగ కవులకు జరిగిన జరుగుతున్న అన్యాయం ఏమిటో తెలుస్తోంది. ఈ కవులు పోతన లాంటి ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు. పురస్కారాల కోసం పాకులాడరు. ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా నిర్భయంగా తమ కవిత్వం తాము సష్టిస్తూ స్వయంభువులుగా ధ్రువతారలుగా నిలిచిపోతారు.
ఇదిగో సిద్దెంకి 'అచ్చు' అటువంటి కవి. ఇది చెప్పేందుకే ఇంత నేపథ్యం చెప్పాల్సివచ్చింది. సిద్దెంకి ఎటువంటి కవి? సిద్దెంకి ప్రశ్నించే కవి.
''ఒకటే దేశం ఒకటే భాష అంటున్నప్పుడు
ఒకటే కులం అని ఎందుకు అనవుతండ్రీ!'' ఈ ప్రశ్నకు జవాబు చెప్తే కుల భారతమే ఉండదు. బాబాసాహెబ్ ఆశించిన కులనిర్మూలన సమాజమే సమాధానం కవిత్వం ఇప్పుడు రెండు రకాల భావాలతో వస్తున్న కాలం. ఒకటి మనువాదం. రెండు జనవాదం. లేదా బహుజన వాదం. ప్రసార మాధ్యమాలు పత్రికలు చూస్తున్న వాళ్ళకు ఈ విషయాలు స్పష్టమే. ఎవరు దొంగ నిద్రను నటించనవసరం లేదు. నిజమైన కవి భుజాలు తడుముకోడు. నిర్భయంగా జనంలోంచి మాట్లాడుతాడు.
దళిత కవిత్వంలో మాదిగ కవిత్వం ఆవిర్భవించినప్పటి నుంచి మాదిగ కళాతత్వం, సౌందర్యాత్మక దష్టి ఎంతో వికసించింది. ఈ విద్యకు గుర్రం జాషువా గారిది గురుపీఠం. ఆ కుదరు నుంచే మాదిగ సౌందర్యాత్మకమైన భావుకత విరాజిల్లింది. గద్యంలోను వచన పద్యంలోనూ ఈ చిత్రణ గమనించవచ్చు. గద్యంలోనైతే బోయ జంగయ్య వేముల ఎల్లయ్య, జూపాక సుభద్ర, జాజుల గౌరి, రచనల్లో తేటగా కనబడుతుంది. నాగప్పగారి సుందర్రాజు, ఎజ్రాశాస్త్రి, ఇండ్ల చంద్రశేఖర్, చోరగుడి జాన్సన్ లాంటి వాళ్లను కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. కవిత్వ విషయంలో సిద్దెంకి మొదటి నుంచి మాదిగ జీవన సౌందర్యకళను అక్షరబద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ సంపుటిలోని 'సుగంధాల లంద స్వప్నం' ఒక మచ్చుతునక. ఈ 'అచ్చు'వెనక అంటరాని అందమంతా తొణికిసలాడుతూ ఉంటుంది. సిద్దెంకిని కేవలం దళిత కోణంలోంచే చూడకూడదు. ఇతడు ప్రాపంచిక కవి. సంఘటనాత్మక అభివ్యక్తిలో అందెవేసిన చెయ్యి. భావుకవిత్వానికి పటం కట్టిన పట్టభద్రుడు.
సిద్దెంకి తెలంగాణ పజొన్న కంకి. తీరొక్క పువ్వు లాగా ఉంటుంది ఇతడి కవిత్వం. ఎవరికి వాళ్లు ఆస్వాదించి, అనుభవించి, ఆ అనుభూతి పొందాలి గానీ విమర్శకుల మీదో, ముందుమాటల మీద ఆధారపడకూడదు. మంచి కవితా సంపుటి అచ్చులోకి తెచ్చినందుకు అభినందిస్తున్నాను. ఇతడి 'అచ్చు' పని పదిమంది మెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. కడపటి తరం లోంచి పుట్టిన
మొదటి తరం కవి దోషాలను లోపాలను మీ లోపలి కోపాలను పక్కన పెట్టి కవి సిద్దెంకితో కరచాలనం చేయండి. పేరెన్నికగన్న కవిగా ఎదగాలని కోరుకుంటున్నాను. 'అచ్చు' కవితా సంపుటిని తెస్తున్నందుకు తమ్మున్ని తనివితీరా అభినందిస్తున్నాను.
- ప్రొ. ఎండ్లూరి సుధాకర్,
8500192771.