Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఈ దేశంలో పేదలు మాత్రమే చనిపోతారు. ఒక రాజకీయ నాయకుడి పిల్లలు చనిపోరు. మేము మా సొంత ఊళ్లకు వెళ్ళడానికి కనీసం ఒక్క బస్సు కూడా ఏర్పాటు చేయరు'' ఇదొక వలస కార్మికుడి ఆవేదన.
''బ్రిటీష్ వాళ్ళు మనవాళ్ళతో ఎలా చాకిరీ చేయించుకున్నారో సినిమాల్లో చూసాము. కానీ, అంతకన్న ఎక్కువగానే మమ్ముల్ని కష్టపెట్టారు. ఇక్కడ జీతాలివ్వక, తిండి పెట్టక మా విశ్వాసాన్ని కోల్పోయారు. మా ఊర్లో మేము ఆకలితో చచ్చిపోయినా సరే మళ్లీ తిరిగి మాత్రం రాము.'' ఇది ఒక పెద్దమనిషి ఆవేదన.
లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం. ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా అకస్మాత్తుగా లాక్‌డౌన్ పాటించడం వల్ల దేశంలో దాదాపుగా పదిహేను కోట్ల మంది వలస జీవులపరిస్థితి దారుణంగా మారిపోయింది. ఉపాధి కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క సారిగా పనులన్నీ ఆగిపోవడం వల్ల రోజు వారి కూలీలకు ఎంత కష్టమో చెప్పరానిది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు కరోనా నుండి వాళ్లను వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్తలు పాటించాలి, ఎలా మానసిక స్థైర్యంతో జీవించాలో కవులు ఎందరో తమ కవితల్లో వినిపించారు. లాక్ డౌన్ కాలంలో ఒక కొత్త కవిత్వానికి దారి చూపింది. ఊహించని ప్రమాదానికి ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉద్యోగులు, వ్యాపారులు, నాయ కులు వంటి సంపాదనా పరులకు ఎటువంటి కష్టం లేదు, ఉన్నదల్లా పేదవానికే. అందుకే వలస జీవులు చావు ఎదురైనా సరే అని ఇంటికి నడక మొదలు పెట్టారు. అలాంటి వలస బతుకుల బతుకు ప్రయాణాన్ని వివిధ కవులు, వివిధ రకాలుగా తమ కవిత్వంలో వర్ణించారు. వాటిని'దుఃఖపాదం' పేరిట వరంగల్ సంఘం ఆధ్వర్యంలో నల్లెల్ల రాజయ్య సంపాదకత్వంలో పుస్తకాన్ని వెలువరించారు.
ఇందులో మొత్తం 61 కవితలు, 6 వ్యాసాలు ఉన్నాయి. కవితలను పరిశీలిస్తే ముఖ్యంగా వలస జీవుల బతుకు వెతలు, కాలి నడకన రాలినకన్నీళ్లు, శ్రామికుల శ్రమశక్తి, పాలకుల అసమర్థత, ఆదుకున్న ఆపన్న హస్తాలు మొదలైన అంశాలపై కవుల స్పందన ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వారిలో మనోధైర్యం నింపే కవితలు అక్కడక్కడా కనిపిస్తాయి.
వలస అంటే ఉన్నోడు బడికో, గుడికో, పక్క ఊరికో, విదేశాలకో వెళ్ళటమంత సులభం కాదు ''పిల్లల ఆకలి విన్నప్పుడల్లా/ ఖాళీ కంచంలో మునిగి /మూడుపూటలా ఆత్మహత్య చేసుకోవడం'' లాంటి దని అరవింద్ తమ వలస కవిత్వంలో చూపిస్తారు.
''ఆకలి తరిమే వేటలో/ నడక ఆగేదెప్పుడు/ ఆకలిలేని లోకానికి సాగిపోతున్న/ కొత్తదారుల్ని ఈ పాదాలకైనా పరిచయం చేస్తారా?'' అంటూ గాజోజు నాగభూషణం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాళ్ళు ఇల్లు చేరాలి అంటారు.
ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతటి దీనా వస్థలో ఉన్నా కన్నీళ్లను తుడుచు కుంటూ పనిలో నిమగమయ్యే వాళ్లు ఇలా ఏదో జాతర జరుగుతున్నట్లు, మనుషులంతా పక్షులై పోతున్నట్లు అనిపిస్తుంది.
''పల్లె నుండి పట్నానికియ/ పట్నం నుండి మళ్లీ పల్లెకు/ ఇప్పుడిదంతా/ గతం నుండి గతంలోకే పోయినట్లుంది/ ఇక వర్తమానం, మరి భవిష్యత్తు?'' ఎలా ఉంటుందనే భయాన్ని వ్యక్తపరిచారు పిట్ట సాంబయ్య.
కార్మికుల చేతి చలువ వల్లే నగరాలైనా, భవనాలైనా, రహదారులైనా తళతళా మెరిసేది. అంటూ వలస పక్షుల గొప్పతనాన్ని చెబుతూనే ''తల్లి చెట్టు మీద వాలేదెన్నో/ పొలిమేర చేరక మునుపే రాలేదేన్నో!''అనే ఆవేదనను వ్యక్త పరుస్తారు కొండి మల్లారెడ్డి.
''ఆకలి గిన్నెలు పట్టుకొని/ నగరాలకు నడిసొచ్చిన పక్షులు'' అంటూ నగరాల్లో వలస జీవుల కష్టాలను వలసగోసలో చూపిస్తారు నాగేశ్వర్ శ్రీరాముల.
నడకలో తనువు చాలించిన తల్లిని చూసి అతను ''అయ్యాలారా!/ మీలో ఎవరైనా బతికుంటే / ఈ పసికందును/ మనుషులు బతికున్న తావుకు చేర్చండి'' అంటూ ఎంతో ఆవేదనతో వేడుకుంటారు దేశపతి శ్రీనివాస్.
నడక అంటేనే పోరాటం, స్త్రీల, బాలింతల నడకను చూస్తే ఎవరికైనా బాధే.. ''మంత్రసాని సాయమైనా అందని ఆ బాలింత/ చేతిలోని పసిగుడ్డుతో/ జీవన పోరాటం చేస్తూ/ తన రుధిరంతో/ దారి దాహం తీరుస్తున్నది'' అంటూ నడకలో అమ్మ పడిన ఆవేదనను వెగ్గలం ఉషశ్రీ వర్ణిస్తారు.
'ఎంత దూరం నడిచినవో గాని/ జరంత జల్దిరా బిడ్డా అంటూ' తల్లి ఎదురుచూపులను ఖాజా ఆఫ్రిది వర్ణిస్తారు. తిండి లేక, పాలు లేక ఆకలితో అమ్మ చుట్టూ తిరిగే పసిపిల్లల ఆకలి కేకలను వర్ణిస్తూ ''నడక దప్పనిచోట/ కాళ్ళు బొబ్బలెక్కి/ రోడ్లు దుఃఖనదులై/ దేశాన్ని ముంచెత్తు తున్నాయి'' అంటారు ఉదయమిత్ర. అలాగే ఈ ఆపదలో పాలు పంచుకొని సహాయం చేస్తున్న మానవత్వాన్ని చూసి ''ఒక దుఃఖపు పాయను తమలోకి ఒంపుకొని/ పిడికెడు విశ్వాసానిస్తున్నారు,/ హద్దులు సరి హద్దులు దాటి/ వాళ్లు ఓ మహా మానవగీతానికి/ కోరస్ ఎత్తుకున్నారు/ ఇప్పుడు పాడాల్సింది ఈ గీతమే''నంటూ సమాజం ఆచరించాల్సినదేమిటో చూపిస్తారు ఉదయమిత్ర.
''వలస దూరమెంతో/ రహదారికేం తెలుసు/ అరిగిన కాల్లనడుగు చెబుతాయి'' అంటూ రజా హుస్సేన్. వీళ్లంతా యాత్రకై నడువలే ఊరుకై నడిచారంటున్న వనపట్ల సుబ్బయ్య ''కడుపులున్న బిడ్డతో/ భుజంపై మరో బిడ్డతో/ నెత్తిన బతుకు మూటతో నడుస్తున్న'' విధానాన్ని వర్ణిస్తారు.
''చెదురుముదురు సౌకర్యాల నడుమ/ నిర్లక్ష్యం డొల్లలోంచి జారి/ దేశాన్ని మోసుకుంటూ/ దేహాలు నడిచి పోతున్నాయి''అని ప్రభుత్వ వైఖరిని ఎండ గడుతున్నారు బంగార్రాజు కంఠ.
''కాలే కడుపుల్ని తలకెత్తుకుని/ బతుకు భారాన్నంతా/ కాళ్ళమీద మోసుకుంటూ'' వెళ్తున్న విధానాన్ని నూటెంకి రవీంద్ర మన చేతుల్ని వాళ్లకు పాదరక్షలుగా తొడగాలి అంటున్నారు.
నడిచి నడిచి అలసిసొలసి పగిలిన పాదాల గాయం సలుపుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని నిరసన తెలియ జేస్తూనే ''మా రెక్కలకట్టంతో/ నిర్మించిన మాత భూమిలో/ మేము గెలుపుతీరం చేరేదాక / పిడికిలెత్తి నడుస్తూనే ఉంటం! అని నినదిస్తున్నారు చిలువేరు అశోక్.
''శ్రమించేవాడికి నిర్మించడమేకాదు/ కూల్చడం కూడా చేతనౌతుందని'' అపుడు దిగ్భ్రాంతి ఎవ్వరి వంతో అని హెచ్చరిస్తారు నిధి.
''ఇప్పుడు మా బతుకులు చిరిగినట్లే చిరిగి / ఈ దేశం బతుకు కూడా అలాగే ఉందంటూ'' తంగిరాల సోని నేటి దేశభక్తి గల నాయకులు, ప్రజలపై నిరసన ధ్వనిని వినిపిస్తారు.
''వలస వేదన ఉన్నోడికి తెలియదు/ ఒకవేళ తెలిసుంటే వాడెప్పుడో ఇల్లు చేరేవాడు'' అంటూ మెట్టా నాగేశ్వరరావు నడిచినడిచీ పాదాల నిండా రక్త సముద్రం ఒలికిందంటారు.
''అడుగడుగునా కన్నీటి మడుగులు/ నెత్తుటి పూల ఆనవాళ్లు కనబడతాయని లేదంటే కరుడు గట్టిన రాతిగుండెలేనని'' ఆవేదన వ్యక్త పరుస్తారు పద్మావతి రాంభక్త.
''రాత్రి ఇంటి తలుపు రెక్క కండ్లు మూసి/ తెల్లారి కళ్ళు తెరిసేసరికి/ వలసలమని పచ్చబొట్టు పొడిపించుకున్నా''మంటూ వలస గ్రామలన్నీ పురాతన శిలాజాలై ఉన్నాయని అశోక్ అవారి వలస వెళ్లిన జీవితం ఎలా ఉంటుందో చెబుతారు.
శ్రమను దోచుకునే యజమానులు, నాయకులను నిరసిస్తూ ''ఈసారి కన్నీళ్ళతో రామ్/ ప్రశ్నల కొడవళ్ళతో వస్తాం/ కడుపు చేత పట్టుకొని రామ్/ కదనశంఖం పూరిస్తూ వస్తాం'' అంటూ పిడికిలి బిగిస్తున్నారు కన్నెగంటి రవి.
అర్థరాత్రి ప్రకటనలతో ప్రజలు, ముఖ్యంగా పేదలు ఎలాంటి బాధలు పడతారో చెబుతూనే, ఇన్నాళ్ల శ్రమకు ఫలితంగా ఇలా దిక్కులేని తనాన్ని ఇవ్వడం అన్యాయమని ''అప్పుడైనా ఇప్పుడైనా/ అర్థరాత్రి ప్రకటనలంటేనే/ అయినోళ్ళకు వరాలు కుమ్మరించడం/ కానోళ్ళకు కష్టాలు తెచ్చిపెట్టడమే'' నంటారు నల్లెళ్ల రాజయ్య.
రైలు పట్టాల మార్గంలో నడిచిన వలస జీవులు అలసిపోయి నిద్రిస్తుంటే వారిపై రైలు దూసుకు పోవడం అత్యంత విషాదకరం. అందుకే ''పట్టాలు మింగిన మా చావును/ హత్య అంటారా, ఆత్మహత్య అంటారా?'' అంటూ పాలకులను ప్రశ్నిస్తున్నారు పడమటింటి రవి కుమార్.
పాలకుల వంచన ఎలా ఉందో తమ కవితలో వర్ణిస్తారు బాసిత్. అలాగే శవాల మీద పేలాలు బుక్కుతున్న ప్రభుత్వాల మీద నిరసనగా ''ఈ తల్లిబిడ్డల సల్లని ఉసురు/ మెల్లగ ఓట్లు దండుకున్న / నాయకులకు తాకుతది'' అంటూ తమ ఆవేదనను పొత్తిలి పేగులధ్వనిలో చూపిస్తారు దాసోజు లలిత.
ఎంతో నిరాశలో కూడా అణువంత ఆశతో నడిచే వాళ్ళ బతుకు పయనాన్ని వర్ణిస్తూ ''నా ఇంటి ముందు నుండి ఎల్లినోళ్ళ/ ఆకలిదప్పులు తీర్చుతూ/ ఆళ్ల దుఃఖాన్ని దోసిల్లలో నింపుకొని/ కొన్ని అక్షరాలను కూడగట్టి/ ఈ కరడుగట్టిన కాలాన్ని/ పాదయాత్ర వేదనని లిఖితంచేస్తున్నా'' నంటున్నారు సిరిమల్లెలు తమ మోదుగుపూల కవితలో.
''ఎవ్వడినీ వదలనమ్మా/ నీ చవుకీ నా బతుక్కీ మూలాన్ని చంపేదాక/ ఆపిన తవ్వకాలను తవ్వి/ మన పూర్వీకుల అవశేషాల చెంత వాడ్ని పూడ్చుతా'' అంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు గిరిప్రసాద్ చెలమల్లు. అందరూ నగరాన్ని తిడుతూ, పాలకులను తిడుతూ తమ ఆవేదనను వ్యక్తపరిస్తే ప్రసాదమూర్తి మాత్రం నేను నిర్మించిన నగరాన్ని వదిలి పోతున్న మళ్లీ వచ్చే వరకు జాగ్రత్త అంటూ ''నగరం నా దేహ శ్వాస కోసం అలమటిస్తే/ నేను వస్తానని నమ్మకం పలకండి'' అంటూ వలస జీవితో బాధ్యతగా పలికిస్తారు.
అలాగే మా అడుగులు, కన్నీళ్లు, చావులు, ఆకలి కేకలు దేశ పరిస్థితిని తెలియజేసి పరువు తీస్తుందంటే మమ్మల్ని క్షమించమని వ్యంగ్య బాణాన్ని సాధిస్తారు ఆశాజీవి.
''పేదసాదల వేడి నెత్తుటితో/ రోడ్లను ఎర్ర తివాచీలు చేసి/ ఏలిన వారిని కీర్తిస్తూ/ సంబరాలు చేసుకుంటున్నది దేశం''అంటూ ఉన్నోళ్లకు ఇచ్చిన ప్యాకేజీలు లేనోళ్ళకు ఉండవని వాస్తవాన్ని చెబుతు న్నారు కవి నిజం. ''స్వర్ణ భారతంలో స్వచ్ఛ భారతంలో/ వలసబతుకుల పరుగుపందెం/ ఏ సమద్ధికి నమూనా?/ ఏ అభివద్ధికి నమూనా?'' అంటూ రాచపాళెం వలసప్రశ్నలను సంధిస్తున్నారు.
''స్వదేశంలో కాందీశీకులవడం/ తనవారి మధ్యే పరాయి వారవడం/ ఎంత దురదష్టం'' అంటూ కమలేకర్ శ్యామ్‌ప్రసాద్‌రావు కఠోర వాస్తవానికి దోషులు ఎవరని అడుగుతున్నారు.
''ఈ ప్రహసనమిలా కొనసాగితే / ఆగని వలస జీవుల నడక/ చరిత్ర పుటల్లో వందేళ్ళకైనా/ మాయని మచ్చగా మిగిలిపోతుందని'' సాంబ మూర్తి లండ హెచ్చరిస్తున్నారు.
''నీలో మమేకమైపోయిన/ మా జీవితాలిప్పుడు / నీ వెలితిని నలుదిక్కులా చూస్తున్నాయి'' అంటూ శ్రమజీవుల కోసం శాంతి కష్ణ ఆవేదన పడుతున్నారు.
''ఊరు చివర ఊడల మర్రిపై/ ఉషోదయాన అలపిస్తున్న/ వలస పక్షుల విషాద గీతం/ రేపటి తరానికి / విప్లవ గీతమై వినిపించాలి'' అంటూ రెడ్డి శంకరరావు సమాజాన్ని ఆదేశిస్తున్నారు.
ఇలా వీరితో బాటు వడ్డేపల్లి కష్ణ, సుక్కరాం నర్సయ్య, కట్టా రాజమౌళి, పానుగంటి శ్రీనివాస్ రెడ్డి, జోగు అంజయ్య, తంగెళ్లపల్లి ఆనందాచారి, గన్రెడ్డి ఆదిరెడ్డి, రవీందర్ ఆడెపు, కోడం సురేందర్, వి.దిలీప్, వడ్డేబోయిన శ్రీనివాస్, మంత్రి కష్ణ మోహన్, బి.బాలకష్ణ, బుర్ర మధుసూదన్ రెడ్డి, ముత్యాల రఘుపతి, తాటిపాముల రమేష్, విప్ప గుంట రామ మనోహర, ఉమా మహేశ్వర రావు, వాడపల్లి అజరుబాబు, మోతుకూరి అశోక్‌కుమార్, చింతల రాకేష్‌భవాని, పాతూరి అన్నపూర్ణ, వశిష్ఠ సోమేశ్వరి, కవిత పులి వంటి కవులు వలస జీవితాల గురించి కవితలు ఇందులో రాశారు.
ఇంకా ఇందులో గుండెబోయిన శ్రీనివాస్ సి.వి.ఎల్.ఎన్. ప్రసాద్, మల్లెపల్లి లక్ష్మయ్య, అభినవ్ బూరం రాసిన వ్యాసాలు అరుంధతి రారు ప్రసంగం ఇందులో ఉపయుక్తంగా ఉన్నాయి.
కవితలన్నీ సామాజిక బాధ్యతతో కూడు కున్నవి. ఒకే అంశానికి చెందినవి కావడంతో పునరుక్తి అక్కడక్కడ కనబడుతుంది. కానీ అన్ని కోణాలలో కవిత్వం వినబడుతుంది.
- పుట్టి గిరిధర్,
9491493170