Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జారిపడే జలపాతం చేయి పట్టుకు ఆపాలని
సెలయేటి వంకర్లు సవరించాలని
పూలకు కొంచెం పరిమళం అద్దాలని
పచ్చటి పెరడుకు
కాస్తంత పత్రహరితం పూయాలని..
అడివిని మాలిమి చేసుకోవాలని
అలవికాని మహా వక్షాలను మంత్రించి..
డ్రాయింగ్ రూమ్‌లో అందంగా బంధించాలని
తప్పిపోయిన ప్రకతిని బొట్టెట్టి పిలిచి..
బాల్కనీలో బంతిభోజనం చేయాలని
పెచ్చులు కట్టిన సిమెంట నగరానికి..
పచ్చని చెట్ల నీడనివ్వాలని
చీలి, వేరుపడిన దారులను ఒక్కటి చేయాలిని
మంచుతో కప్పడిపోయే కొండలను
మచ్చిక చేసుకోవాలని
కొండ గొర్రెనొకదాన్ని తోలుకొచ్చి
పాపాయితో నేస్తం కట్టించాలని
పోడు చేస్తూ పండించిన పరమాన్నాన్ని
నట్టింట పొంగించాలని
తలనిండ మేఘాల దండ దాల్చిన చెరువునొకదాన్నిచేరదీసి..
చెలి చెక్కిళ్ల అద్దాలకు చేరువచేయాలని
ఆకాశం నుంచి ఇంద్రధనస్సు కొసను
చలాకీగా లాగి..
సొగసుగా నేలకు ముడివేయాలని
ఇలా, పచ్చదనంతో ప్రణయకలాపం సాగిస్తూండగానే..
నా కలల సీతాకోక చిలుక పైనుంచి,
బుల్‌డోజరొకటి దొర్లుకుంటూ వెళ్లిపోయింది.
- దేశరాజు