Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా పేరు రైతు
అలియాస్.....
అన్నదాత, వెన్నుముక
మొద్దు కట్టం జేసే
మోటు మనిషిని
నా నెత్తురు కలి కలి చిలికి
నా చెమట మడిలో ఒలికి
సాగుకు పురుడు బోస్తా.!
పొట్టకచ్చిన పొలం జూసి
పురిటి నొప్పులు
నేను దీస్తా.!
ఈనిన వరి కంకుల జూసి
రెక్కలకు కత్తులు గట్టుకొని
గద్దల కంట్లె బడకుండా
తల్లి కోడిలెక్క ధిక్కరిస్తా.!
గోదుమ మడి అలికినంక
నా మట్టి పాదాలు
కంచెగా కాపలగాస్తయి.!
మిర్చి మీద ఏ మిడతలు
వాలకుండా
నా కళ్లు గస్తీ గాస్తయి.!
పత్తి చేనుకు
ఏ గత్తర పురుగు సోకకుండా
నా రెక్కల పందిరి పరుస్తా.!
మక్క కంకి బోయగానే
మంచె మీదే
నా కంచం మంచం.!
పిట్టలు చిలుకలు
నక్కలు తోడేళ్లు
కంకి మీద వాలితేనే
వొడిసెల రాళ్లు రువ్వెటోన్ని.
ఎద్దు సక్కగ
నడవకుంటెనే ముడ్డిమీద
ముల్లుగర్రతో
బొడిసి మెతిపెటోన్ని.!
కమతం నా కంటి పాప
ధాన్య రాశి
నా ఒంటి కండ.
ఓరి నీ మారు బేరం
కాట్లె గలువా..!
మదరిండియా అంటివి
మార్కెట్ల తాకట్టుబెడితివి.!
కాంట్రాక్టు ఎవుసమేంది
కళ్లం మీద నీ కార్పోరేట్
జులుమేందిర.!
ఆన్ లైన్ లో
అగ్గువ సగ్గువ కొనుడేంది
అమ్మకమేంది.!
ఆపు నీ
అత్మనిర్భర థోకాబాజి తనం
సాగదు నీ కార్పోరేట్
దోస్తులు దోపీడి మదం.!
నీవు
పార్లమెంట్ గెలువచ్చు
పొలం గెలవలేవు
హలం దాటికి నిలువ లేవు.
మట్టి పాదాల మార్చ్ కింద
నీ కంపెనీ పాలన
మనువు లాలన
కూలుడు ఖాయం.!
- చిలువేరు అశోక్