Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్థిరాస్తి దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్‌కు దేశ అత్యున్నత న్యాయ స్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన తొమ్మిది ఆస్తులను జప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు బుధావరం అధికారులను ఆదేశించింది. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని ఏడు ఆస్తులను, బీహార్‌లోని రాజ్‌గిర్, బక్సర్ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను పోలీసులు సీజ్ చేసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ తొమ్మిది స్థలాలకు సంబంధించిన ఎటువంటి పత్రాలు కూడా కంపెనీ డైరెక్టర్ల దగ్గర ఉండకుండా జాగ్రత్త వహించాలని కోర్టు సూచించింది. ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసేంత వరకు ఆమ్రపాలి ముగ్గురు డైరెక్టర్లను పోలీసులు లాకప్‌లోనే ఉంచాల్సిందిగా నిర్ధిష్ట ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆస్తులు ఉన్న ప్రదేశాలకు కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు, పోలీసులు మాత్రమే వెళ్లాలని తెలిపింది. మిగతా వారెవరూ వారితో పాటు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఆమ్రపాలి గ్రూప్‌నకు చెందిన 46 కంపెనీల పత్రాలన్నింటినీ ఫోరెన్సిక్ ఆడిటర్లకు ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలు పాటించకుండా న్యాయస్థానంతో దాగుడుమూతలు ఆడినందుకు గాను ముగ్గురు డైరెక్టర్లను పోలీస్ తమ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులకు పూర్తి చేసేందుకు భవన నిర్మాణదారులను ఎంపిక చేసేందుకు 'నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్' (ఎన్‌బీసీసీ)ను సుప్రీంకోర్టు అనుమతించింది.