Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త రుణాలు, డిపాజిట్లు రద్దు
- రూ.1000 ఉపసంహరణకు మాత్రమే అనుమతి
- నగదు సంక్షోభ సంస్థపై ఆర్‌బీఐ కొరడా
న్యూఢిల్లీ : కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు నగదు లభ్యత సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ఆ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించింది. దీంతో వచ్చే ఆరు మాసాల పాటు పొదుపు, కరెంట్, డిపాజిట్లపై ఆ బ్యాంక్ ఖాతాదారులు కేవలం రూ.1000 లోపు మాత్రమే ఉపసంహరించుకోవ డానికి అవకాశం ఉందని ఆర్‌బీఐ వెల్లడించింది. అదే విధంగా కొత్త రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం, ఇతర వ్యాపారంపై కూడా ఆరు నెలల పాటు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అయితే షరతులకు లోబడి డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని పేర్కొంది. 99.58 శాతం డిపాజిటర్లు పూర్తిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) భీమా పథకం పరిధిలోకి వస్తారని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో రూ.5 లక్షల లోపు డిపాజిట్లపై బీమా వర్తిస్తుందని వెల్లడించింది. బ్యాంక్ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఇంతక్రితం నగదు సంక్షోభంలోకి చిక్కుకున్న పిఎంసి బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పైనా ఇదే తరహా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.