Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో లిమిటెడ్ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి సామాజిక సేవలో మరో విశిష్ట గౌరవం దక్కింది. ఆయన సేవ దృక్పతానికి శనివారం ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఐమా) లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. దేశంలో మేనేజ్‌మెంట్ విభాగంలో అత్యున్నత సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను ఐమా ప్రతి ఏటా తన వార్షికోత్సవం రోజు ఈ అవార్డులను అందిస్తుంది. శనివారం జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హాజరై అవార్డులను అందజేయడంతో పాటుగా ప్రారంభోపన్యాసం చేశారు. విప్రో ఫౌండేషన్‌లో తన సహోద్యోగులు, భాగస్వాములు వేలాది మంది అలసిపోని అంకితభావంతో పనిచేయడం వల్లనే తనకు ఈ గుర్తింపు వచ్చిందని ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు.
ఇదే సందర్భంగా ఐమా ఉత్తర రచనకు గాను డాక్టర్ రామ్ తర్నేజా అవార్డు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో సజనాత్మకత, ఆవిష్కరణలకు డాక్టర్ జెఎస్ జునేజా అవార్డులను కూడా ప్రదానం చేశారు. అదే విధంగా ఈ ఏడాది కార్పొరేట్ నాయకత్వానికి ఐమా జెఆర్‌డి టాటా అవార్డును హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాకు అందజేశారు. ఐమా పబ్లిక్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డును న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు.