- విత్తన ప్యాకెట్లపై బార్‌కోడ్ తప్పనిసరి కాదు
- విత్తన కంపెనీలకు వేసులుబాటు కల్పిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు
- ఇప్పటికే నకిలీ విత్తనాలతో రైతు కుదేలు
- తాజా నిర్ణయంతో మార్కెట్లోకి రానున్న మరిన్ని నకిలీ విత్తనాలు
- వ్యవసాయ శాఖ నిర్ణయంపై రైతుల మండిపాటు
విత్తనం మొలకెత్తితేనే పంట పండేది. అందులోనూ మొలకెత్తిన విత్తనం అన్ని రకాల చీడపీడలను తట్టుకొని కాతకాస్తేనే దిగుబడి వచ్చేది. దీనికోసం దశాబ్ద కాలంగా దేశంలో ఎన్నో రకాల విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. తమ కంపెనీ విత్తనం మొలకెత్తడం గ్యారంటీతో పాటు అధిక దిగుబడి ఇస్తుందని, అన్ని రోగాలను తట్టుకుంటుందని ఇలా ఆకర్షణ పేర్లతో రంగు రంగుల కలర్లతో ప్యాకెట్లను తయారు చేసి అడ్డగోలు ధరలతో మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. అందులో కొన్ని కంపెనీల విత్తనాలు సరిగ్గా మొలకెత్తక, పంట సరిగ్గా పండక రైతులు నష్టపోతున్నారు. దీన్ని నివారించడానికి కొన్ని రాష్ట్రాలు విత్తనాలు తయారు చేసే కంపెనీల పూర్తి వివరాలు అంటే రకం, దిగుబడి తదితర అంశాలు క్షుణ్ణంగా ఉండేలా బార్‌కోడ్(క్యూఆర్)తో ముద్రించాలని కేంద్రాన్ని కోరగా, కేంద్రం ఆ దిశగా పోకపోగా విత్తన కంపెనీల ఒత్తిడితో ఎలాంటి క్యూఆర్ కోడ్ అవసరం లేదని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాజ్యమేలి రైతులు మరిన్ని నష్టాల బారిన పడే అవకాశం ఉందని రైతు సంఘాలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-హాజీపూర్
పంట పండాలంటే మేలైన విత్తన రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. గతంలో రైతులే వారి పంట నుండే విత్తనాలను కట్టి మళ్లీ విత్తుకునే వారు. రానురాను వ్యవసాయం కొత్త పుంతలు తొక్కడంతో రైతులు మోడ్రన్ సాగుకు అలవాటు పడ్డారు. ఇందులో భాగంగానే విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. విత్తనాలను తయారు చేసి అధిక ధరలకు రైతులకు అమ్ముతున్నాయి. విత్తనాల ప్యాకెట్లపై సమగ్ర వివరాలను ముద్రించి అమ్మాలి. అవి నాణ్యమైనవే అని రాష్ట్ర విత్తన సంస్థ నుండి ధ్రువీకరణ పత్రం పొందాలి. సదరు కంపెనీ విత్తనాన్ని తయారు చేసే ఏడాది ముందే విత్తన పంట వివరాలను ప్రభుత్వానికి తెలియపర్చాల్సి ఉంటుంది. అప్పుడు అధికారులు విత్తన పంటను పలుమార్లు పరిశీలించి సర్టిఫై చేస్తారు. దాన్ని ప్రయోగశాలలో పరిశీలించి వంద విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో శాతాన్ని నిర్ధారించి లాట్ సంఖ్యను కేటాయిస్తారు. కానీ చాలా కంపెనీలు ఇవన్నీ లేకండానే సొంతంగా కంపెనీ సర్టిఫై అని ట్రూత్ లేబుల్‌లు వేసి మార్కెట్లో అమ్ముతున్నాయి. ఇందులో చాలా మట్టుకు విత్తనాలు మొలవక మొలిసినా సరైన దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులతో నకిలీ దందాకు ఊతం
ఉమ్మడి జిల్లాలో సుమారు 8లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగవుతోంది. ఇందులో ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న, పెసర, కంది, సోయా, జొన్న, కూరగాయ పంటలున్నాయి. ఈ పంటల సాగు కోసం రైతులు మార్కెట్లో విత్తనాలు కొంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నకిలీ విత్తనాల దందా రాజ్యమేలుతోంది. కోట్లలో విలువజేసే నకిలీ విత్తనాలు పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నాయి. కొన్నేండ్లుగా నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్న తీరును చూసి కొన్ని రాష్ట్రాలు విత్తన కంపెనీలు కచ్చితంగా తయారీ రకం, దిగుబడి, తయారీ తేదీ, గడువు, ధర ఇలా కచ్చితమైన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్‌తో విత్తన ప్యాకెట్లు ముద్రించి అమ్మితే ఈ నకిలీల బెడద తగ్గే అవకాశం ఉంటుందని కేంద్రానికి నివేదించాయి. కేంద్రం కూడా ఆవైపు ఆలోచిస్తుదని, 2020 వాన కాలం పంట సమయం వరకు ఈ బార్ కోడ్ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు భావించారు. కానీ విత్తన కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర వ్యవసాయ శాఖ రైతులకు అలాంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుత మార్కెట్లో ఉన్న నకిలీ విత్తనాలు కాకుండా ఇక నిబంధనలు లేని కారణంగా మరిన్ని కంపెనీలు పుట్టుకొచ్చి రైతులను ముంచే అవకాశం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పేరొందిన కంపెనీలు తయారు చేసిన విత్తనాలే 60శాతానికి మించి మొలకెత్తడం లేదు. ఇక ఇప్పుడు నకిలీల దందా జోరందుకోనుంది. గతంలో నకిలీ విత్తనాల ప్రభావంతో రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన ఘటనలు ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంత రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి నకిలీ విత్తనాలు కట్టబెడుతూ సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్లు, ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయంతో వీరి నకిలీ విత్తనాల దందాకు అదుపు లేకుండా పోయే అవకాశముంది. ఇప్పటికైనా ప్రభుత్వం కచ్చితమైన వివరాలతో ఉండేలా బార్‌కోడ్‌తో విత్తనాల ప్యాకెట్లు తయారు చేసేలా కంపెనీలకు నిబంధనలు విధించాలని రైతులు కోరుతున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయంతో రైతు మోసపోకతప్పదు : అత్తె శ్రీనివాస్, నంనూర్ రైతు సహకార సంఘం, మంచిర్యాల జిల్లా
ఇప్పటికే మార్కెట్లో అమ్ముతున్న విత్తనాల్లో 60శాతం మించి మొలకెత్తడం లేదు. కంపెనీల మోసపూరిత మాటలు నమ్మి పెట్టిన గుడ్డలు మళ్లీ మళ్లీ పెడుతూ రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతుపై ఆదిలోనే విత్తన భారం పడుతోంది. ఇక కొన్ని కంపెనీల విత్తనాలైతే అసలే మొలకత్తక, మొలకెత్తినా కాతపూత లేక రైతు పంట మొత్తం మునుగుతున్న ఘనటలు లేకపోలేదు. ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువుకు సంబంధించి క్యూఆర్‌కోడ్‌తో ప్యాకింగ్ వస్తుంది కానీ విత్తనాలు ఎందుకు రావడం లేదు. ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ బార్‌కోడ్ అవసరం లేదని ప్రకటించడంతో ఇక విత్తన కంపెనీల ఇష్టారాజ్యంతో రైతులు నష్టపోక తప్పదు.
Authorization