నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరాలకు ఆదర్శమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రెడ్డి కుటుంబంలో జన్మించిన సుందరయ్య తన జీవితాన్ని పేదలు, దళితులు, అణగారిన ప్రజలకు అంకితం చేశారన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా చిన్న వయస్సులోనే తన ఇంట్లోనే పోరాటాన్ని ప్రారంభించారన్నారు. వీర తెలంగాణ విప్లవ పోరాటానికి నాయకత్వం వహించి, మొట్ట మొదటి ప్రతి పక్ష నాయకుడిగా పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు, జిల్లా నాయకులు పూసం సచిన్, అన్నమొల్ల కిరణ్, జాదవ్ రాజేందర్, శకుంతల, ఆత్రం కిష్టన్న, బొజ్జ ఆశన్న, ఆర్.మంజుల పాల్గొన్నారు.
మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని సీఐటీయా కార్యాలయంలో మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తన జీవితాంతం ప్రజల మేలు కోసం పరితపించిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటితరం కార్యకర్తలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. నైజాం నిరంకుశ విధానాలకు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను ఉద్యమ పథంలో నడిపించిన మహానేతగా సుందరయ్య చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోమాస ప్రకాష్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు రాజేశ్వరి, ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ ఆర్.రాజేశం, బీమా ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.రామదాసు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ కార్యదర్శి మహేందర్, అశోక్, తిరుపతి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్: పుచ్చలపల్లి సుందరయ్య మచ్చలేని నాయకుడని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, గొడిసెల కార్తీక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య పీడిత, తాడిత ప్రజలకు భూమి, భుక్తి, విముక్తి పోరాటాలు చేశారని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్రగణ్యుడుగా అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు.
Authorization