నవతెలంగాణ- ఆదిలాబాద్‌అర్బన్
ప్రాజెక్టులు, చెరువుల పనులకు కావాల్సిన భూసేకరణ చేపట్టాలని అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దష్ట్యా భూసేకరణ నిర్వహించాలని, భూముల యజమానులు ఏమైనా సమస్యలు తెలియజేసినపుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. చెరువుల నిర్మాణ పనులకు కావలసిన భూ సర్వేతో పాటు ఎంజారుమెంట్ సర్వే కూడా చేపట్టాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభంకానున్న దష్ట్యా సర్వే పనులు పది రోజుల్లోగా పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించిన రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అన్నారు. ఇరిగేషన్ శాఖకు కేటాయించిన భూములకు బౌండరీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రాజెక్టులకు, చెరువు నిర్మాణాలకు కేటాయించిన భూముల అవార్డు ఉత్తర్వులను రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా పొందాలని తెలిపారు. ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, నార్నూర్, గాదిగూడ, బేల, తలమడుగు, తాంసి, భీంపూర్, ఆదిలాబాద్‌రూరల్, సిరికొండ మండలాల్లోని గ్రామాల్లో నిర్మించే చెరువు పనులకు భూసేకరణ పనులు పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణకు సంబంధించిన ప్రాంతాల్లో గ్రామసభలు తప్పని సరిగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని వ్యవసాయ క్లస్టర్ ఏరియాలో రైతు వేదికల భవన నిర్మాణాలకు అవసరమైన భూములను రేపటిలోగా గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ భూములు లేనట్టయితే దాతల ద్వారా సేకరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నటరాజ్, రాజస్వ మండల అధికారి సూర్యనారాయణ, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Authorization