పెన్ను, పేపర్ పట్టుకొని బయల్దేరుతాడు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రపంచానికి తెలియజేస్తాడు. మట్టి మనుషుల జీవితాలను కండ్లకు కట్టినట్టు చూపిస్తూ ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవుతాడు. సమాజంలో జరిగే అన్యాయ, అక్రమాలను ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుంచుతూ కత్తి మీది సాము లాంటి వత్తితో జీవన పోరాటం చేస్తుంటాడు. యాజమాన్యాలు ఇచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. అతడే జర్నలిస్టు. వృత్తి ధర్మ నిర్వహణలో నిజాలను నిగ్గుతేల్చే క్రమంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, రాజకీయ, దోపిడీదారుల కుట్రలకు బలవుతూ భౌతికదాడులు ఎదుర్కొంటూ అసువులు బాసినవారున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రాణసంకట పరిస్థితుల్లోనూ ప్రాణాలను లెక్కచేయకుండా మహమ్మరిని అరికట్టడంలో కూడా మేము సైతం అంటూ ప్రజలను చైనత్యవంతం చేసేలా జర్నలిస్టులు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీరి సేవలను కేవలం మాటలతోనే గుర్తిస్తూ కడుపులు ఎండబెడుతోంది. కష్టకాలంలో తమను గుర్తించి ఆర్థిక సాయం అందజేసి కుటుంబాలు బతికేలా చూడాలని జర్నలిస్టులు కోరుతున్నారు.
నవతెలంగాణ-హాజీపూర్
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో దీని వ్యాప్తి నిర్మూలనకు ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు వారధిలాగా ఉంటూ జర్నలిస్టులు సమాజ సేవ చేస్తున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇండ్లకు పరిమితమైన వేళ జర్నలిస్టులు ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నారు. దినసరి కూలీలు, ఫుట్‌పాత్, తోపుడుబండ్ల కార్మికులు, ప్రయివేట్ ఉద్యోగులు, వలస కూలీలు తినడానికి తిప్పలు పడుతున్న తీరును కథనాల రూపంలో ప్రచురిస్తూ బాహ్యప్రపంచానికి తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాలతో ప్రజల కడుపు నింపుతున్నాయంటే అది విలేకరుల చలువే. కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో రెడ్‌జోన్‌లు ఏర్పాటు చేస్తే అక్కడ నిబంధనలు మరింత కఠినంగా ఉండడంతో ప్రజలు నిత్యావసరాలకు, అత్యవసర పనులకు ఇబ్బందులు పడుతున్న తీరును తెలియపరుస్తూ వారికి కష్టకాలంలో కడుపునింపే చర్యలను చేపడుతున్నారు. కరోనా మహమ్మారి లక్షణాలున్న, వ్యాధి సోకిన వారిని ఉంచే క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి కూడా వారి కండీషన్, వైద్యసేవలపై ఆరా తీస్తూ అక్కడి వాతావరణాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తున్నారు. వలస కూలీలుగా, ఉద్యోగులుగా వెళ్లి ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియపరుస్తూ వారికి న్యాయం జరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. విధి నిర్వహణలో వైరస్ బారినపడి పలువురు చికిత్స పొందుతున్న వారున్నారు.
జర్నలిస్టుల సేవలకు దక్కని గుర్తింపు
ప్రాణాంతక మహమ్మారి ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని వణికిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు కరోనాపై అవగాహన వచ్చే రాతలు రాస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకునే చర్యలను తెలియజేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించడంలో జర్నలిస్టులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కానీ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. పైగా హేళనగా మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. ప్రస్తుత్తం రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల సమయంలో ఇతర శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అనడం మినహా సేవలను గుర్తించడం లేదు. కుటుంబ పోషణలో వారు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల నుండి కాపాడే చర్యలేవి తీసుకోవడం లేదు. అసలే చాలీచాలని వేతనాలిచ్చే యాజమాన్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో అవి కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇచ్చే వాణిజ్య ప్రకటనలపై ఎంతోకొంత వచ్చే కమీషన్‌లపైనే ఆధారపడే జర్నలిస్టులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని అక్రిడిటేషన్‌తో ముడిపెట్టకుండా ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబానికి లాక్‌డౌన్ కొనసాగినంత కాలం నెలకు రూ.10వేల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించాలని జర్నలిస్టులు కోరుతున్నారు.
జర్నలిస్టులను ఆర్థిక సాయంతో ఆదుకోవాలి : తోట్ల మల్లేష్‌యాదవ్, టీడబ్ల్యుజేఎఫ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్ట్‌లు పని చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడక్కడ పోలీసులు, ఇతరుల నుండి అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ తమ వంతు సామాజిక బాధ్యతగా లాక్‌డౌన్ విజయవంతానికి కషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే జర్నలిస్ట్‌లను ఆదుకోవాలి. కొన్ని యాజమాన్యాల్లో ఎలాంటి వేతనాలు కూడా ఉండక వత్తి ధర్మం, సమాజ హితం కోసం జర్నలిస్ట్‌లు పాటుపడుతున్నారు. లాక్‌డౌన్ కాలానికి ప్రభుత్వం జర్నలిస్ట్‌లకు నెలకు రూ.10వేల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేయాలి. రూ.50లక్షల బీమా కల్పించాలి.
జర్నలిస్టులపై ప్రభుత్వం చిన్నచూపు : కెశెట్టి వంశీకష్ణ, జర్నలిస్ట్, మంచిర్యాల
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన పోరాడుతున్న జర్నలిస్ట్‌లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్ర అధిపతిగా ఉన్న వ్యక్తే జర్నలిస్టులను హేళనగా, బాధ్యతారహితంగా మాట్లాడడం హేయమైన చర్య. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మహమ్మారిని రాష్ట్రం నుండి పారదోలడానికి జర్నలిస్ట్‌లు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి జర్నలిస్ట్‌లపై కనికరం లేదు. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి అది చేస్తం..ఇది చేస్తం అని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరిస్తోంది.
దుర్భరంగా కుటుంబాలు : మధుసూదన్, జర్నలిస్ట్, హాజీపూర్
కేవలం విలేకరి అనే పేరుకోసం తాపత్రయ పడుతూ వేతనాలు లేక కుటుంబ పోషణలో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలాగా ఉంటూనే సమాజంలోని అన్యాయ, అక్రమాలను ఎదిరిస్తూ ధైర్యంగా ముందుకు పోయే గుణం విలేకరుల సొంతం. కుటుంబాలను పోషించుకోలేక దుర్భర జీవితాలు గడుపుతూ బయటకు మాత్రం పెన్ను, పేపర్ పట్టుకొని తిరుతున్నాం. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో కూడా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో మేము సైతం అంటూ ముందుంటున్నాం. అయినకానీ ప్రభుత్వం గుర్తించడం లేదు.
ప్రభుత్వమే ఆదుకోవాలి : భాస్కర్, జర్నలిస్ట్
ప్రస్తుత పరిస్థితుల్లో వార్తా పత్రికల నిర్వహణ భారమై మూసివేత దిశగా యాజమాన్యాలున్నాయి. ముద్రణకు కావాల్సిన ముడిసరుకు అందక ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు పత్రికలను ముద్రించడం ఆపేశాయి. అసలే వేతనాలు లేని జీవులం యాజమాన్యాలు రాత ఆధారంగా ఇచ్చే వాటితోనే జీవితాలు గడిపే తమకు ఇప్పుడు బతుకు పోరాటంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే జర్నలిస్ట్‌లను ఆదుకోవాలి. అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ప్రభుత్వం సాయం అందించాలి.
Authorization