Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికీ ఎక్కడైనా మట్టి ఇల్లు కనిపిస్తే చాలు
చిన్ననాటి నేను పుట్టి పెరిగిన
మా ఇల్లు గుర్తుకొస్తది
ఇల్లంతా ఎర్రమన్ను
ఆవుపేడతో కలిపిన అలుకుతో
అలికి ముగ్గులు పెట్టేది 'ఎల్లవ్వ'
అవ్వ మా ఇంటికి పనిమనిషిని అనుకుంటదికానీ!!
మా మనసు తెలిసి మసులుకునే మా ఇంటి మనిషి
ఆవులను లేగలను శుభ్రంగా కడగడం
దానా పెట్టడం పాలు పితకడం అవ్వ చేసే పని
కట్టెలపొయ్యిని అలికి మంటవేసి పాలు కాచేది అమ్మ
తోడుపెట్టిన పాలను చిలికి మజ్జిగ చేసేది నాయినమ్మ
పొద్దున్నే కట్టెలపొయ్యి నుండి
వచ్చే పొగ మేఘాల్లా ఇంటి చూరునుండీ
అల్లుకుపోయేదీ
ఆకాశంలో తిరుగుతుతున్నామన్న భావన కలిగేది
పంట చేతికొచ్చే వేళ ధాన్యపు సంచులతో
సందడిగా ఉండేది పండగలప్పుడు
ఇంట్లోని స్తంభాలకు గుమ్మానికి జాజుతో రంగురుద్ది
శేడె సున్నం రంగరించి చేసిన తెల్ల
బొట్లుపెట్టేవాళ్ళు ఇంటికి అదొక కళ!
నాకు మా చెల్లికి రోజుకోరకం జుట్టువేయడం
మా చిన్నమ్మకు సరదా
అర్ధరాతిరో అపరాతిరో నాన్న ఉలిక్కిపడి లేచేవాడు
లేగదూడలకు ఆకలేస్తుందేమోనని
నాన్నను చూడగానే
లేగదూడ తోక ఊపుతూ తల నిమరమని
నాన్న ముందు నిలుచునేది
మూగజీవాలంటే మానాన్నకు ప్రాణం!!
ఆడంబరాలు లేకపోవచ్చు కానీ
మనసులనిండా ప్రేమ ఉండేది
పల్లెలన్నీ నగరాలైనవేళ
మా ఇంటి జాగాలో కూడా భవంతి లేచింది!!
- జయంతి వాసరచెట్ల,
8555849733