Sun 17 Jan 02:08:52.314013 2021
Authorization
ఒక రాజు గారు గుర్రంపై నగరంలో పర్యటిస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక సన్యాసి ఎదురైనాడు. రాజు గుర్రం దిగి అతనికి నమస్కరించాడు.
ఆ సన్యాసి మాట్లాడుతూ ''రాజా! క్రూరమృగాలను, విష కీటకాలను వేటాడి చంపి ప్రజలను రక్షించు'' అని ఆశీర్వదించాడు. సరేనని అన్నాడు రాజు.
కొద్దిదూరం వెళ్లేసరికి మరొక సన్యాసి రాజుకు ఎదురై నాడు. రాజు గుర్రం దిగి అతనికి కూడా నమస్కరించాడు. అతడు రాజుతో ''మహారాజా! జీవహింస మహా పాపం. అందువల్ల ఏ ప్రాణిని హింసించరాదు'' అని అన్నాడు. సరేనని అన్నాడు రాజు.
కానీ ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మొదటి సన్యాసి క్రూర మగాలను వేటాడి విష కీటకాలను చంపి ప్రజలను రక్షించమన్నాడు. రెండవ సన్యాసి ''జీవహింస మహాపాపం'' అని అన్నాడు. ''ఇవి రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వీటిలో నేను దేనిని పాటించాలి'' అని ఆలోచించాడు. ఎంత ఆలోచన చేసినా అతనికి జవాబు తట్టలేదు. తన మంత్రిని అడిగి చూశాడు. అతడు కూడా ఏమీ సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇలా ఉండగా ఆ ఆస్థానానికి మరొక సన్యాసి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. రాజు ఆ సన్యాసి వద్ద తన సందేహం వెలిబుచ్చాడు.
అప్పుడు ఆ సన్యాసి ''మహారాజా! వారు ఇద్దరూ చెప్పింది నిజమే. నీ సందేహం కూడా నిజమే. ఇక్కడ క్రూర మగాలు ఆకలైతే తప్ప ఇతర జంతువుల పైన దాడి చేయవు. అట్లే విష కీటకాలు కూడా వాటికి ఏదైనా హాని కలిగిస్తారేమో అని భావించి కాటు వేస్తాయి తప్ప కావాలని చంపవు. ఒక్క మానవులే వారికి అవసరం ఉన్నా, లేకున్నా ఇతర జంతువులను వేటాడి చంపుతారు. విష కీటకాలు కనిపిస్తే చాలు వాటిని కూడా చంపకమానరు. అందువల్లనే ''జీవహింస మహా పాపం'' అని అన్నారు. నీ ఆత్మరక్షణకు ఏ జంతువునైనా సంహరించు. అంతేగానీ అనవసరంగా జంతువులను చంపడం నేరం. అవి ప్రజలపై దాడి చేస్తే వాటిని నీవు చంపవచ్చు. అదే ధర్మం, న్యాయం కూడా. అంతేగానీ అడవిలోనికి వెళ్లి వాటిని చంపడం ధర్మం అనిపించుకోదు. అంతేగాక అవి ఒకదానిపై మరొకటి ఆధార పడిఉన్నాయి. అనగా అవి ఒకదాన్ని మరొ కటి చంపి తింటాయి. అందువల్ల వాటి సంఖ్య పెరుగుతుందన్న బాధ నీకు లేదు.
ఇక్కడా మరొక్క సంగతిని నీవు గ్రహించు. మొదటి సన్యాసి నీకు ఎదురైనది బహుశా అడవికి దగ్గరగా ఉండే ప్రాంతంలో కావచ్చు. అందుకే అతడు ఆ మాట అన్నాడు. అక్కడ క్రూర మగాలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. అందుకే మొదటి సన్యాసి క్రూర మగాలు దాడి చేస్తే వాటిని వేటాడమని చెప్పాడు.
అదే రెండవ సన్యాసి మాట్లాడుతూ నగరం మధ్యలోని ప్రజలు ప్రత్యేకంగా అడవికి వెళ్లి వాటిని వేటాడి చంపుతున్నారనీ, అందుకే ఆయన అనవసరంగా వేటాడ కూడదనే ''జీవహింస మహాపాపం'' అని అన్నాడు. ''ఇప్పుడు నీ సందేహం తీరిందా!'' అని అన్నాడు.
రాజు ఆ సన్యాసి కాళ్లపై బడి ''స్వామీ! మీ దయవల్ల నా సందేహం తీరింది. ఇప్పుడే నా రాజ్యంలో అనవసరంగా జంతువులను చంపవద్దని ఆదేశం జారీ చేస్తాను'' అని అన్నాడు. ఈ మాటలకు ఆ సన్యాసి ఎంతో సంతోషించాడు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
9908554535