Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పోచమ్మ చెరువు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

పోచమ్మ చెరువు

Sun 10 Jan 01:14:09.895949 2021

ఒరేయ్ మధుకర్‌ పొద్దుపొద్దున్నే ఇట్ల రోజూ చెరువు కాడికొచ్చి కుర్చంటవెందిరా అన్నడు ముత్యాలు. ఇక్కడ కూర్చోని చూసుడు నాకు శానా ఇష్టం బాబాయి. ఏముందిరా ఇక్కడ! పదేళ్ల పిల్లోడివి. ఈ టైంల నీ ఈడు పిల్లలు ఇంక ముసుగు తన్ని పడుకుంటరు. మా కాశి గూడ ఇంక లేవలే. పోద్దుగాల ఈడ బాగుంటది బాబాయి. అటూ సూడు చెరువు నుంచి వచ్చే వేడివేడి పొగలు, నీటికొంగలు, బుడుబుంగల రెక్కల చప్పుళ్ళు. అగో... అపుడే పూసిన కలువ తామరపూలు. చెట్లమీద పక్షుల కిలకిల అరుపులు అన్ని మస్తుగుంటయి. చెప్పినప్పుడు అతని కళ్ళల్లో సంతోషం తళుక్కున మెరిసింది.
వెర్రోడా... రోజూ చూస్తున్నదే కదరా. ఐన... మీ అమ్మ బతికుంటే నువ్విట్ల వుండేటోడివా! మీ అయ్య బుచ్చిరెడ్డి కూడా తాగి తాగి తలపోసుకోని సచ్చే. ఆ దేవుడు సల్లగ సూసి మీ తాతను నీ తోడు వుంచిడు. తల్లి తండ్రి లేని బిడ్డ అన్న జాలి వుంటది ముత్యాలుకు. పాపం... పోరడు అనుకుంట చెరువు కట్ట దిగి తన పొలం వైపు సాగిపోయిండు. ముత్యాలు కొడుకు కాశీ, మధుకర్‌ మంచి దోస్తులు. ఇద్దరివీ పక్కపక్కన ఇళ్లు. బడికి సెలవిస్తే చాలు రోజంతా చెరువు దగ్గర ఆడుతరు. ఈతలు కొడుతరు. తామరపూలు తెంపుతరు. మధుకర్‌ తాత ఏనాడో ఇద్దరికీ ఈత నేర్పాడు. ఇక అంతే. వారికి చేరువే ఈత కొలనైంది. ఆకలేస్తే కట్ట కింద చేన్లలో పెసరు, పల్లికాయ, మొక్కజొన్న కంకులు తింటరు. తాత డెభ్భై ఏళ్ల మనిషి. శాతగాకున్న కూలోళ్లతో ఎట్లనో గట్ల పొలం పనులు నడిపిస్తున్నడు. ఎకరం పొలం మీద వచ్చే వడ్లలో సగం తిండి గాసానికి వుంచుకొని, సగం అమ్మి ఖర్చులు ఎల్ల దిసుకుంటరు. నేను పోతే నా మనవడు దిక్కులేని పక్షి యితడని రోజూ దేవుళ్ళకు మొక్కుతడు తాత.
మన కులంల అందరికీ ఎకరాల కొద్ది భూమి న్నది. మనకెందుకు లేదు? అందరు సిన్న చూపు చూస్తున్నరు అన్నడు మధుకర్‌ బాధగా.
లేనోడు అంటే అందరికీ లోకువే రా. మనకూ పదెకరాల దాకా వుండే. మీ అయ్యనే.. నామాట ఇనక తాగుడుతో దాన్ని ఎకరం చేసిండు. తాత కండ్లల్ల ఒక్కసారిగా గిర్రున నీళ్ళు దిరిగినయి.
''పోచమ్మ చెరువు గురించి చెప్పు తాత. నులక మంచాల తాత పక్కన పడుకొని అన్నడు మధుకర్‌. రోజూ అడిగే ముచ్చటే అది. బీడీ ముట్టిచ్చి రెండు దమ్ములు లాగిండు తాత.
మా ముత్తాతల కాలం నాటిదిరా మనువడా!.. అది ఎండి పోయి వూరికి కరువొచ్చుడు ఎవరూ సూడలే. వంద ఎకరాలకు నీళ్లనిస్తది. వరి, పత్తి, పెసరు పంటలు దండిగ పండుతయి. కట్ట మీద తూము దగ్గరున్న పోచమ్మ గుడి మహిమ గలది. తొలకరి చినుకులు పడగానే ఊరి జనం ఆ తల్లికి బోనం చేస్తరు. చెరువు నిండి మంచి పంటలు ఇవ్వాలని మొక్కుతరు.
తాత ఏడువకు.. పెద్దయినంక హైదరాబాద్‌ బోయి బాగా డబ్బులు సంపాయించి పంపుత. అప్పుడు మన పోలాల్ని మల్ల కొందువు గానీ.
ఆ మాటలకు కంటనీరు తుడుచుకొని నవ్విండు తాత. మనువన్ని దగ్గరకు తీసుకొని ముద్దాడిండు.
పిచ్చి కన్నా...హైద్రాబాద్‌ పోయి డబ్బులేట్ల పంపుతవురా!
ఏమో... నాకు తెల్వదు. పెద్దనాన్న కొడుకు పెద్దిరెడ్డి హైద్రాబాద్‌ పోయి డబ్బులు పంపుతలేడా అన్నడు మధుకర్‌.
తాత మరింత సంబరపడిపోయి, నువ్వు బాగా సదువుకొంటే హైద్రాబాద్‌ల ఉద్యోగం వస్తది. అప్పుడు నాకు డబ్బులు పంపుదువులే. ఆయన కళ్ళ నిండా ఇంకా నీళ్ళే.
నేను వున్న లేకున్నా ఎప్పుడూ దైర్నంగ వుండాలే. తాత గొంతు దు:ఖంతో పూడుకపోయింది. మాట రాలేదు.
అట్లనే తాత. నువ్వు ఏడికిపోవు ఎప్పుడూ నాతోనే ఉంటావ్‌ అంటూ కన్నీరు తుడిచి తాతను అల్లుకుపోయిండు మధుకర్‌. సంవత్సరం తరువాత ఓ రోజు నిద్రలోనే ప్రాణం విడిసిండు. తాత శవంపై పడి మధుకర్‌ గుండెలవిసేలా ఏడ్చిన ఏడుపుకు వూరు వూరంతా బోరుమంది. కులపోల్లు అంటీ ముట్టనట్టు దూరంగున్నరు. ముత్యాలే ముందుండి కర్మకాండ జరిపించిండు. ఇగ మధుకర్‌ పూర్తిగా ఒంటరి వాడైండు. నువ్వు మా తాన వుండరా.. కలోగంజో కలిసే తాగుదాం అన్నడు ముత్యాలు. కన్నీళ్లు తుడిచాడు కాశి. మధుకర్‌ ఏం మాట్లాడలేదు. రెండు రోజులు చెరువు కాడ పొద్దంత కూసున్నడు. ఆ చిన్ని మనసులో ఎన్నో జవాబు దొరకని ప్రశ్నలు! మౌనంగా తన బాధనంతా చెరువుతో చెప్పుకున్నడు. అదే రాత్రి హైద్రాబాద్‌ రైలు ఎక్కిండు.
బోగి రద్దిగ వుంది. బాత్రూం వెళ్లొచ్చిన కమలక్క మధుకర్‌ ఒళ్ళో తన చంటి బిడ్డను చూసింది. తమ్ముడు ఏడుస్తుంటే ఎత్తుకొని అడిస్తున్నడు అంది ఆమె ఐదేళ్ల కూతురు.
ఏడి నుంచి వస్తున్నవ్‌ తమ్మీ!
పైడిపెల్లి
అటూ ఇటూ చూసి మీవాళ్లు ఏరి! అంది. తల అడ్డంగా ఊపిండు. అయ్యో, అనుకుంట టిఫిన్‌ పెట్టి తినమంది. ఆవురావురంటు తినేసిండు. అమ్మ వుంటే ఇలాగే చూసుకునేది అనుకున్నడు. వివరాలు అడిగి తెలుసుకొని ''మా ఇంటికి వస్తావా రా'' అంది. తల వూపాడు. భార్యతో వచ్చిన పిల్ల వాన్ని చూసిండు ఆమె మొగుడు. వీడికి ఎవరు లేరు. ఇగ మనతో పాటే ఇక్కడే వుంటడు. బావకు నమస్కారం చెప్పరా అంది. ఆమెది జాలి గుండె. ఏం చేసిన సరిగనే వుంటదని అతని నమ్మకం. సరే... సరే.. అక్క తమ్ములిద్దరు ముందు నిమ్మల పడున్లి. బైటికెల్లి తినడానికి ఏదైన తేస్త అంటు వెళ్లి పోయిండు. వాళ్ళది పాలమూరు. కరువొచ్చి భూములున్న కూడా పనుల్లేక హైద్రాబాద్‌ బాట పట్టారు. ''రావు కన్స్ట్రక్షన్‌ కంపెనీ'' అపార్ట్‌మెంట్లు కట్టుట్ల పెద్ద పేరున్నది. షాద్‌ నగర్‌లో అపార్ట్‌ మెంట్‌ కడుతున్నరు. అక్కడ వీళ్ళు పని చేస్తరు. మధుకర్‌కు హైద్రాబాద్‌ను చూస్తే ఏదో కొత్త లోకానికి వచ్చినట్టుంది. పెద్ద పెద్ద భవంతులు, విశాలమైన రోడ్లు షాపులు వాహనాల రాకపోకలు రద్దీ మనషుల భాష చిత్రంగున్నరు.
దూరవిద్యలో డిగ్రీ చేసి నారాయణరావు చుట్టాల అమ్మాయినే పెళ్ళిచేసుకున్నడు. ముత్యాలు బాబాయి దంపతులు పెళ్లి పెద్దలుగా పీటల మీద కూసున్నరు. కమలక్క ఆడబిడ్డగా హారతి పట్టింది. ''మా తమ్ముడు శానా మంచోడు... జర మంచిగ చూసుకో మరుదలు పిల్ల'' అంది నవ్వుకుంట.
''అలాగే వదిన'' అంది సిగ్గుపడుతు పెళ్ళికూతురు.
ఒక్కసారిగా పెల్లి మండపంలో నవ్వుల పువ్వులు పూసినయి. ప్రాజెక్టులకు నీళ్ళు రావడంతో కమలక్క వాళ్ళు పాలమూరు వెళ్ళిపోయిన్లు. రాఖీ పండగకు తప్పక వచ్చి రాఖీ కట్టుధ్ది. మధుకర్‌ బిల్డర్స్‌తో మీటింగ్‌లో వుండగా కాశీ వాట్సాప్‌ లో పోటోలు పంపిండు. అవి చూసి వెంటనే కార్లో చాలా ఏళ్లకు సొంతూరుకు బయలుదేరిండు.
పెద్ద గుట్టంత అపార్ట్‌ మెంట్‌. దాని ముందు వందల మంది పనోల్లు, మిషన్ల చప్పుడు. కుప్పలు కుప్పలుగా సిమెంట్‌, ఇసుక, కంకర చూసి ఆశ్చర్యపోయాడు. ఓ రోజు కంపెనీ అధినేత నారాయణరావు వచ్చి మెటీరియల్‌ లెక్కలు చూస్తున్నడు. గుమాస్తాలు చేతులు కట్టి నిలుచున్నరు. సిమెంట్‌ బస్తాల లెక్క తేడా రావడంతో నిలదీసిండు.
మధుకర్‌ ''సార్‌ నేను చెపుతా'' అంటు ధైర్యంగా రాత్రి సిమెంట్‌ బస్తాలు ట్రక్కలో పోయిన విషయం చెప్పిండు. అందరు ఉలికిపడ్డరు.
ఆయన 'ఎవరీ పిలగాడు' అనడంతో కమలక్క మా తమ్ముడు సార్‌ అంది. గుమాస్తాలను గట్టిగా హెచ్చరించి వదిలేసిండు. చురుకుదనం, కలుపుగోలుతనం తరుచూ వచ్చె నారాయణరావుకు దగ్గరైండు మధుకర్‌. ఆయన కోటీశ్వరుడైన నిగర్వి. స్వయం కషితో ఎదిగినోడు. మధుకర్‌ ఉత్సాహాన్ని, చొరవను గుర్తించి చిన్న చిన్న పనులు చెప్పేవాడు. సిమెంట్‌ బస్తాలు, ఇసుక, కంకర లారీ లోడులు లెక్క ఏరోజు కారోజు ఓ పెన్ను నోట్‌బుక్‌ ఇచ్చి రాయమనే వాడు. ఆ పిల్లవాని లెక్కలు, గుమాస్తాల లెక్కల తో సరిపోవడంతో వీడికి మంచి భవిష్యత్తు వుందని నమ్మి బాగా ప్రోత్సహించాడు. రోజంతా పిల్లల్ని ఆడించడం, పనుల్లో వాళ్ళకి సహాయం చేసేవాడు మధుకర్‌. అదష్టం కొద్ది నా అనే వాళ్ళు లేని అతన్ని కమలక్క కంటికి రెప్పలా చూసుకుంది.కాలం సుఖంగా,ఒడిదొడుకులు లేకుండ సాగడంతో మధుకర్‌కు సంవత్సరాలు నెలలుగా,నెలలు రోజులుగా గడిచిపోయినయి. ఇప్పుడు పాతికేళ్ల మధుకర్‌ రెడ్డి నారాయణరావుకు కుడి భుజమైండు. ఆయన దగ్గరే వుంటు నిర్మాణ పనులు చూస్తడు. మధుకర్‌ రెడ్డి చేరికతో కంపెనీ మరింత బలపడి విస్తరించింది.
ఊరు గుర్తు పట్టనంత మారిందిరా.. ఈ బిల్డింగులు, షాపులు, బస్టాండ్‌, హాస్పిటల్స్‌.. అబ్బో అన్నడు మధుకర్‌ ఆశ్చర్యపోతూ.
అవునన్నా.. ఈ పదిహేను ఏండ్లల్ల వూల్లే శాన చిత్రాలు జరిగినయి.
అవునవును.. జరిగినయి.. నువ్వు ఎమ్మెల్యే రాజమల్లు దగ్గర కారు డ్రైవర్‌ ఐయితివి. నా దగ్గరికి రమ్మంటే రాకపోతివి నవ్వుకుంట అన్నడు మధుకర్‌.
నీకు తెలుసు కదన్నా. అమ్మ నన్ను ఒదిలి వుండదని అన్నడు కాశి.
కారు దిగి చెరువు దగ్గరికి నడిచిన్లు కట్ట కింద చాలా భూములు కొని ప్లాట్లు చేెసిండ్లు కొందరు మాత్రం బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తన్నరు. పోచమ్మ చెరువు!!... ఓ పక్క ఎండిపోయి నేర్రెలు బారింది. అన్నిముళ్ళ పొదలు... తుమ్మచెట్లు... మరో పక్క వూరి మురుగు నీరంత దాన్లో వచ్చి చేరింది. మధ్యల మట్టి కోసం తవ్విన పెద్ద పెద్ద బోందలు.. చుట్టూ చెరువును ఆక్రమిస్తూ చొచ్చుకు వస్తున్న అక్రమ నిర్మాణాలు. చెరువును కన్నార్పకుండా చూస్తూ వుండి పోయాడు మధుకర్‌.
చెరువు ఇట్ల కావడానికి మా ఎమ్మెల్యే రాజమల్లు కారణం అన్న. ఆయన మనుషులు చెరువును కబ్జా చేస్తున్లు. ఇదంత ఎమ్మెల్యే వెనుక నుండి నడిపిస్తున్నడు.
చెరువు నుండి చూపు తిప్పుకొని, ఇక్కడ గజం రేటు ఎంతరా?
ఏమో అన్నా... ఓ పది వేల వుంటది కావచ్చు.
మధుకర్‌ తల అడ్డంగా వూపి... లేదురా... పాతిక వేలు!
నోరేల్ల బెట్టిండు కాశి. గుంటకు ముప్పై లక్షలు. ఎకరానికి కోటి పైనే. ఎనిమిది ఎకరాలకు తొమ్మిది కోట్లు!!! ఒక దెబ్బతో ఎలక్షన్ల పెట్టిన ఖర్చంతా వడ్డీతో సహా వస్తది. మంచి ప్లాన్‌ వేసిండు రా మీ ఎమ్మెల్యే అన్నడు మధుకర్‌ నవ్వుకుంట.
ఎట్లన్న చేసి ఎమ్మెల్యేను ఆపాలన్న. మన చిన్నప్పటి పోచమ్మ చెరువును కాపాడాలె. అందుకే నీకు ఫోటోలు పంపిన.
మధుకర్‌ తల వూపాడు కానీ ఏం మాట్లాడలేదు. కాశి బాగా నిరాశ పడ్డడు. చెరువును చూడంగనే తన కంటే ఎక్కువ బాధ పడత డనుకొన్నడు. కానీ గిట్ల చెరువు భూములకు లెక్కలు వేస్తడు అనుకోలె. హైద్రాబాద్‌ పోయి ఆన్న మారిండు అనుకొన్నడు.
అద్దాల మేడ లాంటి ఎమ్మెల్యే రాజమల్లు ఇంటికి వెళ్ళిండు మధుకర్‌.
ఆ.. రావయ్యా.. మధుకర్‌ రెడ్డి.. కూర్చొ. మీ వాడు కాశి నీ గురించి చెప్పిండు అన్నడు.
హైద్రాబాద్‌ల నీ పేరు, మీ సారు పేరు విన్ననయ్య. మీ సారు నారాయణరావు దేవుడు. అదష్టవంతుడివి ఆయన కంట్ల పడ్డవ్‌. శాన రోజులకు మన వూరు యాదికొచ్చింది. ఎంది సంగతీ! అవును... ఇంతకీ నీ ఓటు ఎడుంది అన్నడు నవ్వుకుంట.
ఓటు ఇక్కడ లేకుంటే నాతో మాట్లాడారా ఏంది! ఐన ఓటుదేముంది.. ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు మార్చు కోవచ్చు. మీ నాయకులు పార్టీ కండువాలు మార్చినట్టు అన్నడు మధుకర్‌.
అబ్బో... మీ హైద్రాబాదోల్లతో మాట్లాడలేం అంటు పగలబడి నవ్విండు ఎమ్మెల్యే.
సూటిగా తన వచ్చిన పని చెప్పాడు. పోచమ్మ చెరువులో కొత్త కాలనీ కడుదాం సార్‌ ''పోచమ్మ నగర్‌''. మీ నియోజకవర్గంలో కొత్తగా చేరుతది అన్నడు. మధుకర్‌ అలా మాట్లాడుతడని అనుకోలే ఎమ్మెల్యే.
నొసలు చిట్లించి... ఏమిటి నువ్వనేది!.. కొంపతీసి నా పేరు చెప్పి ఆడ గుడిసెలు ఎపిస్తవా ఏంది!
ఛ... దాని వల్ల మీకు నాకు ఒరిగేది ఏంది! చెరువును పూడ్చి ప్లాట్లు చేసి పోచమ్మ నగర్‌ పేరిట కాలనీ కడుదాం. ఎమ్మెల్యే సీరియస్‌ ఐయిండు. ఏమిటి అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నవ్‌. కాలనీ ఏంది... కట్టుడేంది! దీన్లకు నన్ను ఎందుకు లాగుతున్నవ్‌. అది ప్రభుత్వ భూమి. నీది నాది కాదు. మీడియా కళ్ళు, ప్రతిపక్షం నోళ్ళు దాని మీదనే వున్నయి. చెరువు మీద నా కన్ను వుందని ఏ తలకు మాసినోడు నీతో చెప్పిండు చిరాకు, కోపంతో అన్నడు ఎమ్మెల్యే.
ఇంకెక్కడి చెరువు. సొంతూరు గురించి నాకు తెల్వకుండ ఎట్లుంటది! నాకంత తెలుసు. పట్టింపులకు పోకండి. ఇరవై ఏళ్ల కింద హైద్రాబాద్‌లో 400 చెరువులు వుండే. ఇప్పుడు నలభై కూడా లేవు. మా లాంటి వాళ్ళే మాయం చేసి అపార్ట్‌ మెంట్లు కట్టిన్లు. చెరువులను మింగేసి అపార్ట్‌మెంట్లు కట్టడం, హైద్రాబాద్‌లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. మొన్నటి వరదలు చూసిన్లు కదా. హైద్రాబాద్‌ నగరం ఓ పెద్ద సముద్రమే ఐయింది. చెరువులు పూడ్చి ఇళ్లు కట్టినంక నీళ్ళు ఎటు పోతయి! ఇండ్లల్లకే వస్తయి. మా పలుకుబడి గురించి ఇంతకు ముందు మీరే చెప్పిన్లు. ఆలోచించుకొండి అన్నడు మధుకర్‌.
ఎమ్మెల్యేకు ప్లాన్‌ బాగానే వుందనిపించింది. ఎంతైనా తెలిసినోడు పక్కనుంటే పని తేలికైతది. ఆయనకు పూర్తిగా నమ్మకం కలిగి తప్తిగా తల వూపిండు. ధనా ధనా లోపలికి వెళ్లి చాలా సేపు బీరువాలో వెతికిండు. ఎట్టకేలకు పది పేజీలు వున్న డాక్యుమెంట్‌ తెచ్చిండు. రెండేళ్ల నుండి దీన్నీ దాచి పెట్టిన. ఊరు కార్పొరేషన్‌లో విలీనం కాక ముందటి డాక్యుమెంట్‌ ఇది. భూముల ధరలు అమాంతం పెరగడంతో చెరువు మీద ఆశ కలిగి పక్కన పెట్టిన. ఇగ ఇప్పుడు దీని అవసరం వుండదు. నీ చేతుల పెడుతాన... జాగ్రత్త. డాక్యుమెంట్‌ చదివాడు మధుకర్‌. అతని కళ్ళు మిలమిల మేరిశాయి. అతనికో దారి కన్పించింది. డాక్యుమెంట్‌ను తీసుకొని ఇక మీరు నిచ్చింతగ వుండండి అన్నడు మధుకర్‌.
అతని భుజంపై చరిచి నీ కష్టం వుంచుకోనులే అన్నడు ఎమ్మెల్యే మెచ్చుకోలుగా.
ఎమ్మెల్యే కాస్త మెత్తపడ్డడు. ూA ను బైటికి పంపిండు. ప్రిజ్‌ ల మంచినీళ్ళ బాటిల్‌ తెచ్చి ఇస్తూ చిన్న గొంతుతో బిబి ''నీ దగ్గర దాసుడెంది గని.... నేను కాయిసుతో ఈ రాజకీయాల్లోకి వచ్చినోన్నీ గాను. రిజర్వేషన్‌ కలిసొచ్చి జిల్లా మంత్రి కరణం గారి దయతో ఎమ్మెల్యేనైన. ఐదు కోట్లు పార్టీ ఫండ్‌ అడిగి నాతో పది కోట్లు ఖర్చు పెట్టిచ్చిన్లు. రోడ్‌ దగ్గర ఎకరం పొలం అమ్ముకొన్న. ఏం లాభం! గడియ రికాం లేదు గవ్వ రాకడ లేదు. పెట్టిన ఖర్చన్న రాబట్టుకోపోతే నేను మనిషిని ఎట్ల యిత.
మధుకర్‌ వెంటనే... అందుకే వెంచర్‌ చేద్దాం... మీకు కలిసి వస్తది ఖర్చు పుడుతది.
అంత ఈజీ కాదయ్యా.. ఊరు కార్పొరేషన్ల విలీనం కావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చనయి. రెట్లు పదింతలైనయి. అందరి చూపులు దాని మీదనే పాడుబడే. వీళ్ళందరి కళ్ళు గప్పి ఎట్లా వెంచర్‌ చేస్తం?
చిన్నగా నవ్వాడు మధుకర్‌. అమాయకంగా మాట్లాడుతరేంది సార్‌... అంటు టేబుల్‌పై తను వెంట తెచ్చిన వెంచర్‌ మ్యాప్‌ను పరిచిండు. ఇది పోచమ్మ నగర్‌ వెంచర్‌ ప్లాన్‌ అన్నడు. ముందు మన ఏరియా ఎమ్మార్వో, రిజిస్టార్‌ను నాకు కలపండి. చెరువుల అక్రమ నిర్మాణాలు తొలగించున్లు.
గట్లనే గదెంత పని గని అన్నడు ఎమ్మెల్యే.
ముందు మనం చెరువుల రెండు ఎకరాలు బినామీ పేరు మీద డాక్యుమెంట్‌ చేపిస్తం. వాళ్ళ తాతల నాటి పొలం చెరువులో కలిసిందని డాక్యుమెంట్‌లో చూపి రిజిస్ట్రేషన్‌ చేయిద్దాం. దాన్ని సాపు చేసి మోరం మట్టితో నింపుదాం. పోచమ్మ గుడి ఎలాగూ వుంది. ప్లాట్లు చేసి గంధపు చెట్లు నాటుదాం. టైం చూసి వెంచర్‌ ఓపెన్‌ చేద్దాం. ఇక మీడియా వాళ్ళు అంటారా... డబ్బుతో కానిది ఏముంది! కొనేద్దాం. రెండు సంవత్సరాలు తిరక్కుండనే పోచమ్మ చెరువు మొత్తాన్ని పోచమ్మ నగర్‌ చేసేద్దాం అన్నడు మధుకర్‌.
ఇంటికి వచ్చిన మధుకర్‌తో ఆవేశంగా... నాతో చెప్పింది ఎంది! నువ్వు చేసింది ఎంది!! హైద్రాబాద్‌లో నువ్వేదో వెలగ బెట్టినవని నమ్మితే ఇట్ల చేస్తావా? ఆయన ముక్కుపుటాలు అదురు తున్నయి. శరీరం వణుకుతోంది బీపీ పెరిగి కళ్ళు తిరిగినట్టు అన్పించి ూA, గన్‌మెన్‌లను పట్టుకొని సోపల కూలబడ్డడు.
సార్‌ కూల్‌... ముందు నేను చెప్పేది వినండి అన్నడు మధుకర్‌. ఎందయ్యా.. నువ్వు చెప్పేది నేను వినేది. నడి రిజర్వాయర్ల ముంచినవ్‌. బొమ్మను చేసి ఆడిస్తివి. కోపం, బాధ రిజర్వాయర్‌ నీటిమట్టంలా అంతకంతకూ పెరిగింది.
పదిహేను రోజుల తర్వాత పొద్దున టీవీల వార్తలు విం టాడు రాజమల్లు. బ్రేకింగ్‌ న్యూస్‌!! అకస్మాత్తుగా రాజమల్లు ఫోటో వేశారు. ఆయన ఆశ్చర్యం నుంచి తీరుకొక ముందే ఎమ్మెల్యే రాజమల్లు చొరువతో జిల్లా ప్రజల కల సాకారం. దాహార్తిని తీర్చే మినీ రిజర్వాయర్‌ మంజూరు. ఎమ్మెల్యే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోచమ్మ మినీ రిజర్వాయర్‌ సాధించుకున్నారు. ఇక నియోజకవర్గ ప్రజల దాహార్తి తీరనుంది. కేంద్ర జల సంఘం, పర్యావరణ శాఖ నుండి అనుమతులు మంజూరు. త్వరలో రిజర్వాయర్‌ శంకుస్థాపన ముహూర్తం ఖరారు. వార్తలు వింటున్న రాజమల్లుకు మతిపోయింది. మెదడు మొద్దు బారింది. క్షణం పాటు ఏమి అర్థం కాలేదు. ూAతో ఏందిరా ఇది... ఏం జరుగుతాంది.!. గి మధుకర్‌ నా కొంప ముంచేట ట్టున్నడు. ఫోన్‌ కలుపు అన్నడు అరుస్తూ అయోమయంగా.
అందరిలానే మీరు కూడా పెట్టుబడి ఎట్ల తిరిగి రాబట్టుకోవాలని చూస్తున్నరు. అవినీతితో జనంల పలచనయి మీ రాజకీయ భవిష్యత్తు సమాధి చేసుకుంటారా! కొంచెం పేరు, పుణ్యం కూడా సంపాదించుకోండి అన్నడు మధుకర్‌ నెమ్మదిగా. జనానికి సేవ... నీటి మీద రాత ఒక్కటే. ఎలక్షన్ల ఎవడు ఎంత ఎక్కువిస్తే వానికే ఓటును అమ్ముకుంటరు.
మంచి చేసే వాళ్ళను జనం ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటరు. ఇది నిజం. మన దేశంల ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ మళ్ళీ ఎన్నిక కావడం లేదూ. ప్రజలకు ఎంతోకొంత సేవ చెయ్యబట్టే వాళ్ళు ఎన్నికవుతున్నరు. రాజకీయ నాయకులు ఎవర్ని నమ్మరు. నమ్మిస్తరు. మీకు రాజకీయ ''రంగు'' ఇంక అంటలేదు. అందుకే పోచమ్మ చెరువులో రిజర్వాయర్‌ కోసం సేకరించిన స్థల డాక్యుమెంట్‌ నాచేతికిచ్చారు. ఎమ్మెల్యేగ ఒక హౌదా, గుర్తింపు, సేవ చేసే భాగ్యం అందరికీ రాదు. మీరు ఎమ్మెల్యేగా వున్న లేకున్న జీతం, అలవెన్సులు సదుపాయాలు వుండనే వున్నయి. అన్నడు మధుకర్‌ నచ్చచెప్పే ధోరణిలో .
ఎమ్మెల్యే నీరసపడి గాలి తీసిన బెలూన్‌ అయిండు.
మీ అనుమతి లేకుండా మీరిచ్చిన డాక్యుమెంట్‌ ఢిల్లీలోని కేంద్ర జల సంఘంనకు పంపిన. అక్కడ మాకు తెలిసిన అధికారితో ''పైల్‌ క్లియరెన్స్‌'' చేయించిన. మీడియాకు లీక్‌ చేసిన. ఇదంతా ద్రోహంల అన్పించిన మీకు మంచే చేసిన. ఇదంతా చెరువు కోసం చేసిన. అవును, అదంటే ప్రాణం... ఆ చెరువు తల్లి వూడిలోనే ఆడిన పాడిన. దాన్ని మీరు కబ్జా చేస్తున్నరని తెలిసివచ్చిన. పోచమ్మ నగర్‌ ప్లాన్‌తో నమ్మించి మీమ్ముల్ని ఇరికించాలని చూసిన. కానీ మీ సంతకాలతో సహా సిధ్ధంగా వున్న రిజర్వాయర్‌ డాక్యుమెంట్‌తో నా పని సులువైంది. అతని మాటలు, చెరువు కోసం ఆరాటం చిత్రరంగ అనిపించినయి. ఇంత కాలం ఎమ్మెల్యే కబ్జా గాళ్లనే చూసిండే. సెల్‌ మోగింది అవతల మంత్రి కరుణం గారు ఏమయ్యా ఇంతకాలం చెరువుల స్థల సేకరణ జరగలేదన్నవ్‌.. చెరువు కట్ట కింది రైతులు ఒప్పుకోలేదన్నవ్‌. ఏకంగా పర్మిషనే తెచ్చుకున్నవ్‌. ఏమైతేనేం... మంచి పని చేసినవని ముఖ్యమంత్రి సాబ్‌ కూడా మెచ్చుకున్నడు. ఓ సారి హైద్రాబాద్‌కు వచ్చి కనబడు అన్నడు.
సార్‌.. సార్‌. అట్లనే సార్‌ అంటు తడబడ్డడు ఎమ్మెల్యే.
మధుకర్‌ మాటలు, కరణం గారి మెచ్చుకోలు విని చెరువు పోయిందని లోపల బాధున్న తనకు మంచే జరుగుతదనిపించింది.
పోచమ్మ తల్లి దయకు ముహూర్త బలం తోడయ్యింది. ముఖ్య మంత్రి చేతులమీదుగా శంఖు స్థాపన జరిగి మూడేళ్లు తిరిగేసరికి ''పోచమ్మ మినీ రిజర్వాయర్‌'' సిద్ధమైంది. దానిలో నిండుగా నీల్లచ్చినయి. ఎమ్మెల్యే రాజ మల్లుకు పుల్లుగా పేరచ్చింది. పార్టీ పిలిచి టికెట్‌ ఇచ్చింది. ఆయన గెలుపు ఖాయమైంది. రిజర్వాయర్‌ కట్టను టాంక్‌బండ్‌ చేశారు. కట్ట కింద పిల్లల పార్కు కోసం తన ఎకరం పోలం ఇచ్చాడు మధుకర్‌. ఇప్పుడది టూరిజం స్పాట్‌. ప్రతి దసరాకి కుటుంబంతో ముత్యాలు బాబాయి ఇంటికి వస్తడు మధుకర్‌. రోజూ ఉదయం కట్ట మీద తాత పేరు మీద వేయించిన సిమెంట్‌ బెంచీపై కూర్చుంటడు. సరిగ్గా తన చిన్నతనంలో కూర్చున్న చోట. ఆ రిజర్వాయర్‌లో తన ''పోచమ్మ చెరువు'' ను తనవి తీరా చూసుకొని మురిసిపోతడు.

- కె.భాస్కరాచారి,
7396016164

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.