హైదరాబాద్: సాధారణంగా పెళ్లి కూతురంటే కొత్త కొత్త డిజైన్లతో రూపొందించిన నెక్లెస్‌లు ధరించేందుకు ఉత్సాహం చూపుతుంటారు. పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా బంగారు ఆభరణాలు వేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే పాక్‌లో వీటన్నింటికి భిన్నంగా ఓ పెళ్లికూతురు సాదాసీదాగా టమోటా నెక్లెస్‌ను వేసుకుంది. ఈ పేరేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా..?. పెళ్లి కూతురు సరికొత్తగా ఆలోచించి టమోటాలను నెక్లెస్‌లా తాడుకు గుచ్చుకుని మెడలో వేసుకుంది. చేతులకు కూడా టమోటా గాజుల్ని పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక రిపోర్టర్ ఒకరు ఆ పెళ్లి కూతురును పలకరించాడు. పెళ్లి కూతురు మాట్లాడుతూ..బంగారం ధరలు పెరిగాయి. దీంతోపాటు టమోటా, పైన్ కాయల ధరలు కూడా పెరిగాయి. అందుకే నా పెళ్లిలో బంగారానికి బదులుగా టమోటాల నెక్లెస్‌ను ధరించానని చెప్పింది. పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో టమోటా ధరలు కిలో రూ.300-400 వరకు పలుకుతూ ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, అందరినీ ఆలోచింపజేసేలా చేసింది నవ వధువు.
Nov 20,2019 04:11PM