వాషర్‌మెన్‌పేట: గవర్నర్ కిరణ్‌బేదీ ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటూ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ప్రతి యేడాది పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జోనల్, రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీ. ఆ రీతిలో జీవానందం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఏర్పాటైన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను వెలికితేసే విధంగా ఎగ్జిబిషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, వైద్య, భూగర్భజలాలు, అంతరిక్షానికి సంబంధించి 340 ప్రాజెక్ట్‌లను విద్యార్థులు రూపొందించారని ప్రశంసించారు. 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని, ప్రతిభను చాటే విద్యార్థులకు ప్రభుత్వం తరపున బహుమతులు అందించనున్నట్టు తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో సీఎం మాట్లాడుతూ, ప్రజలకు ఎనలేని సేవలు చేసి, ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టిన డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి కీర్తిప్రతిష్టలను విస్తరింపచేసేందుకు పుదుచ్చేరిలో కూడా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించామని, ఇందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేదీ ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ స్థలంలో కరుణ విగ్రహ ఏర్పాటుకు అనుమతించమని చెప్పడం ఆవేదనకు గురిచేసిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న అధికారపార్టీ ప్రవేశపెట్టే పథకాలను అడ్డుకోవాలన్న ధ్యేయంతో కిరణ్‌బేదీ వ్యవహరిస్తున్నారని, ఆమె తీరు హిట్లర్‌లా వుందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిం చేవారు ప్రభుత్వ అధికారులైనప్పటికీ త్వరలో జైలుకు వెళతారని ఆయన స్పష్టం చేశారు
Nov 20,2019 10:00AM