హైదరాబాద్: ఎన్టీఆర్ తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకైనా తప్పకుండా తెలుగులో సినిమా చేస్తానని యువ దర్శకుడు అట్లీ అన్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తూ నటించిన తమిళ చిత్రం 'బిగిల్'. తెలుగులో 'విజిల్' పేరుతో ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు అట్లీ, హరీష్‌శంకర్, నిర్మాత మహేష్ కోనేరు తదితరులు పాల్గొన్నారు. అట్లీ మాట్లాడుతూ.. 'చాలా రోజుల నుంచి తెలుగు సినిమా చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా. త్వరలోనే చేస్తా. తమిళంలో నేను చేసిన ప్రతి సినిమా విడుదలైన సమయంలో ఎన్టీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారు. ఆయనది మంచి హృదయం. ఆయన చూపిస్తున్న ప్రేమకైనా తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నా. 'విజిల్'లాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మహేష్ కోనేరు ఎంతగానో శ్రమిస్తున్నారు. తమిళంలో సినిమా ఫస్ట్ కాపీ కూడా వచ్చేసింది. కానీ, తెలుగువారి కోసం నన్ను ఇక్కడకు రమ్మన్నారు. ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారు. 'విజిల్'లో యాక్షన్ డ్రామాతో పాటు, క్రీడా నేపథ్యంతో సాగుతుంది. అంతేకాదు కథ ఎంతో భావోద్వేగంతో నడుస్తుంది. మహిళా సాధికారతను చాటి చెబుతుంది. ఈ సినిమాతో సమాజానికి ఓ గొప్ప విషయం చెప్పాలనుకున్నాను. నా ఆశ, ఆశయం నెరవేరుతుందని నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చారు.
Oct 23,2019 09:56PM