రాంచీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఓటమి దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడుతున్న సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 9/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దెబ్బకు 162 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో జుబే హమ్జా చేసిన 62 పరుగులే అత్యధికం, బవుమా 32, లిండే 37 పరుగులు చేశారు. ఏడుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, షమీ, నదీమ్, జడేజాలు రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 162 పరుగులకే పరిమితం చేసిన తర్వాత టీమిండియా సారథి కోహ్లీ మరోమాటకు తావులేకుండా ఫాలో ఆన్ అప్పగించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా పరుగుల వేటలో మరోమారు చతికల పడింది. వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈసారి మహ్మద్ షమీ ప్రొటీస్‌లను దెబ్బ కొట్టాడు. మూడు వికెట్లు తీసి వణికించాడు. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్ల తీసుకున్నాడు. జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 43 ఓవర్లకు 121/8 గా ఉంది. భారత్ కంటే ఇంకా 214 పరుగులు దూరంలో ఉండగా, చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
Oct 21,2019 05:04PM