హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాల భవనం పైనుంచి దూకి, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. విద్యార్థిని కళాశాల బి-బ్లాక్ మూడో అంతస్తు నుంచి దూకింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి సహచర విద్యార్థినులు కేకలు వేశారు. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను స్థానిక కార్పొరేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విద్యార్థిని ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏతో ఉత్తీర్ణురాలై ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. దసరా సెలవుల అనంతరం ఆదివారం తిరిగి కళాశాలకు వచ్చింది. అంతలోనే ఇలా జరిగింది. విద్యార్థిని రాసినట్లు భావిస్తున్న లేఖ ఒకటి సంఘటన స్థలంలో లభించింది. తనను కడుపు నొప్పి తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో రాసి ఉంది.
Oct 16,2019 08:31AM