హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల ఓ కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల జట్ల మధ్య డిపార్ట్ మెంటల్ క్రికెట్ పోటీల వ్యవస్థను రద్దు చేసింది. దాంతో ఆయా డిపార్ట్ మెంట్ల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతకుముందు లక్ష రూపాయల వరకు పారితోషికం పొందిన వాళ్లు ఇప్పుడు ఏడాదికి రూ.30 వేలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి! దాంతో అనేకమంది క్రికెటర్లు ఇతర వృత్తుల బాటపడుతున్నారు. ఫజల్ సుభాన్ అనే క్రికెటర్ పికప్ వ్యాన్ నడుపుకుంటూ మీడియా కంట్లో పడ్డాడు. ఫజల్ 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 2,301 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ కెరీర్ లో 29 పోటీలు ఆడి 659 పరుగులు సాధించాడు. తాను డిపార్ట్ మెంటల్ క్రికెట్ ఆడే సమయంలో లక్ష రూపాయల వరకు సంపాదించేవాడ్నని, పీసీబీ కొత్త విధానంతో తమ ఆదాయం తగ్గిపోయిందని వాపోయాడు. అందుకే డ్రైవర్ అవతారం ఎత్తాల్సి వచ్చిందని తెలిపాడు. ఇది సీజనల్ పని అని, ఒక్కోసారి పది రోజుల వరకు పని ఉండదని వెల్లడించాడు. తనకు కనీసం వ్యాన్ డ్రైవర్ గా అయినా ఉపాధి దొరికిందని, ఇతర క్రికెటర్ల పరిస్థితి ఎలా ఉందో ఊహించలేనని ఫజల్ సుభాన్ పేర్కొన్నాడు.
Oct 15,2019 03:25PM