హైదరాబాద్: ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధి పురుషోత్తపురం వార్డులకు మంచి నీరు సరఫరా చేసే ట్యాంకర్ కింద పడి కె.దీపక్(2) అనే బాలుడు మృతి చెందాడు. రోజూలాగానే పురుషోత్తపురం గ్రామానికి తాగునీటిని అందించి వాటర్‌ట్యాంకర్ వెనుదిరిగింది. ఈ క్రమంలో తల్లితో ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు ట్యాంకర్ కింద పడ్డాడు. వాహనం చక్రం దీపక్ పైనుంచి వెళ్లడంతో అక్కడకిక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఏర్పడి 30 ఏళ్లైనా పైపు లైన్ ద్వారా రక్షిత మంచినీరు అందించడం లేదని, అరకొరగా ట్యాంకర్‌తో నీరు సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి విడదీయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని జాతీయ రహదారిపై బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, సీఐ వినోద్‌బాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా రాస్తారోకోకు దిగారు. కాగా బాలుడు దీపక్ కె.చిన్న, సావిత్రమ్మలకు రెండో సంతానం. బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడం అందర్నీ కలచివేసింది.
Oct 15,2019 02:30PM